Begin typing your search above and press return to search.

ఐపీఎల్ 2026: చెన్నై విక్ట‌రీని కొడుకుతో క‌లిసి ఆస్వాధించిన ధనుష్‌

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన `ఎల్ క్లాసికో` పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.

By:  Sivaji Kontham   |   2 May 2026 11:35 PM IST
ఐపీఎల్ 2026: చెన్నై విక్ట‌రీని కొడుకుతో క‌లిసి ఆస్వాధించిన ధనుష్‌
X

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన `ఎల్ క్లాసికో` పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సిఎస్‌కే అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ముంబైపై చెన్నైకి ఇది రెండో విజయం కావడం విశేషం. పసుపు రంగు జెండాలతో చేపాక్ స్టేడియం హోరెత్తిపోగా.. స్టేడియం మొత్తం `ఎల్లో ఫీవర్`తో నిండిపోయింది.

ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను వీక్షించేందుకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కుమారుడు లింగాతో కలిసి విచ్చేశారు. ధనుష్ తన కుమారుడితో కలిసి గ్యాలరీలో కూర్చుని సిఎస్‌కే ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ కనిపించారు. ధనుష్‌తో పాటు అదే గ్యాలరీలో `తళా` అజిత్ కుమార్ సతీమణి, మాజీ నటి షాలిని కూడా కనిపించడం విశేషం. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇలా స్టేడియంలో సందడి చేయడంతో అభిమానులు వారి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

చెన్నైకి చెందిన ధనుష్‌కు సిఎస్‌కే జట్టుతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన కేవలం అభిమానిగానే కాకుండా.. తన ప్రాంతీయ మూలాలను ప్రతిబింబించేలా ప్రతి సీజన్‌లోనూ చెన్నై జట్టుకు బహిరంగంగా మద్దతు తెలుపుతుంటారు. ముఖ్యంగా చేపాక్ స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడల్లా ఆయన హాజరై తన హోమ్ టీమ్‌ను ప్రోత్సహిస్తుంటారు. ధనుష్‌తో పాటు ఆయన కుమారులు యాత్ర రాజా, లింగా కూడా క్రికెట్‌ను ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ కనిపించడం అక్కడి వారిని ఆకట్టుకుంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (21 బంతుల్లో 29), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 35), తిలక్ వర్మ (29 బంతుల్లో 37) రాణించినా.. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు. అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్ కీలక సమయాల్లో వికెట్లు తీసి ముంబై పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నారు.

ప్రస్తుత పాయింట్ల పట్టికను గమనిస్తే.. గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజా విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో తన పట్టును మరింత బిగించింది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టేబుల్ మధ్యలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్ రేసులో వెనుకబడి ఉన్నాయి. ఈ సీజన్‌లో సిఎస్‌కే ప్రదర్శన చూస్తుంటే మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.