Begin typing your search above and press return to search.

శివాజీ 'దండోరా'కు సెన్సార్ కత్తెర.. ఆ పదాలు, సీన్లు ఔట్!

By:  Tupaki Desk   |   24 Dec 2025 1:43 PM IST
శివాజీ దండోరాకు సెన్సార్ కత్తెర.. ఆ పదాలు, సీన్లు ఔట్!
X

నటుడు శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'దండోరా' సినిమా విడుదలకు సిద్ధమైంది. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'UA 16+' సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాలు ఉండబోతోంది. అయితే సర్టిఫికెట్ ఇచ్చే ముందు బోర్డు దాదాపు 16 రకాల కట్స్, మార్పులను సూచించింది.

ముఖ్యంగా సినిమాలో కులాల ప్రస్తావన, ఊర్ల పేర్ల విషయంలో సెన్సార్ బోర్డు చాలా సీరియస్ గా వ్యవహరించింది. సినిమాలో వాడిన 'రెడ్డి' అనే ఇంటి పేరును తొలగించడం లేదా మార్చడం చేయాలని ఆదేశించింది. అలాగే 'కులం తక్కువ' అనే పదం ఎక్కడ వచ్చినా తీసేయాలని స్పష్టం చేసింది. సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉన్నందున చుండూరు, కారంచేడు వంటి సమస్యాత్మక గ్రామాల పేర్లను కూడా పూర్తిగా తొలగించాలని సూచించింది.

ఇక సినిమాలో అసభ్యకరమైన పదజాలం మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. 'లం.. కొడక', 'దెం..రు' వంటి బూతు పదాలను మ్యూట్ చేయాలని లేదా మార్చాలని బోర్డు ఆదేశించింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో వచ్చే 'బాస్టర్డ్', 'హోర్' వంటి పదాలను కూడా రీప్లేస్ చేయమని చెప్పింది. లింగ మార్పిడికి సంబంధించిన ఒక డైలాగ్ ను, మహిళలను కించపరిచేలా ఉన్న డైలాగులను తొలగించారు.

అన్నింటికంటే ముఖ్యంగా వైలెన్స్ విషయంలో కొన్ని అభ్యంతరకరమైన సీన్లను మార్చమని చెప్పారు. ఒక శవం మీద మూత్ర విసర్జన చేసే విజువల్స్ ను తొలగించి, కేవలం ఇండికేటివ్ గా మాత్రమే చూపించాలని, అక్కడ బ్లడ్ షెడ్ ను డార్కెన్ చేయాలని సూచించారు. దీన్ని బట్టి సినిమా చాలా రా గా, ఇంటెన్స్ గా తెరకెక్కినట్లు అర్థమవుతోంది.

సినిమా ప్రారంభంలో ఇది కేవలం కల్పిత కథ అని, ఎవరినీ ఉద్దేశించింది కాదని వాయిస్ ఓవర్ తో కూడిన డిస్క్లైమర్ వేయాలని బోర్డు కండిషన్ పెట్టింది. అలాగే స్మోకింగ్ వార్నింగ్స్ ను, చైల్డ్ ఆర్టిస్టుల నుంచి ఎన్.ఓ.సి ని కూడా సమర్పించాలని కోరింది. నటుడు శివాజీ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే సినిమాపై చర్చ జరుగుతుండగా, ఇప్పుడు ఈ సెన్సార్ కట్స్ సినిమా కంటెంట్ పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

భారీ కోతలతో 'దండోరా' బయటకు వస్తోంది. కుల వివక్ష, సామాజిక అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ రా అండ్ రస్టిక్ డ్రామాలో శివాజీ నటన హైలైట్ గా ఉండబోతోందని టాక్. ఫైనల్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా కంటెంట్ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.