Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : డెవిల్

By:  Tupaki Desk   |   29 Dec 2023 7:38 AM GMT
మూవీ రివ్యూ : డెవిల్
X

డెవిల్ మూవీ రివ్యూ

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్-సంయుక్త- మాళవిక నాయర్- ఎల్నాజ్- మార్క్ బెనింగ్టన్-నితిన్ మెహతా- అజయ్- సీత- ఎస్తేర్- సత్య- హరి తేజ తదితరులు

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

ఛాయాగ్రహణం: సౌందరరాజన్

కథ- స్క్రీన్ ప్లే-మాటలు: శ్రీకాంత్ విస్సా

నిర్మాణం- దర్శకత్వం: అభిషేక్ నామా

గత ఏడాది బింబిసారతో ఘన విజయాన్ని అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తర్వాత అతను నటించిన అమిగోస్ నిరాశపరచగా.. తన కొత్త చిత్రం డెవిల్ ప్రామిసింగ్ గా కనిపించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలు ఏంటో చూద్దాం పదండి.

కథ:

1945 ప్రాంతంలో మద్రాస్ ప్రొవిడెన్స్ ఆధ్వర్యంలోని రాసపాడులో ఒక జమీందారు ఇంట్లో తన కూతురి హత్య జరుగుతుంది. అందరూ అక్రమ సంబంధం పెట్టుకుందని కూతురిని జమీందారే చంపాడని అనుకుంటారు. పోలీసులు కూడా అతన్నే అరెస్ట్ చేస్తారు. అయితే ఈ కేసు విచారణకు వచ్చిన బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్).. హత్య వెనుక అసలు రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే డెవిల్ రాసపాడుకు వచ్చిన ఉద్దేశం వేరని తెలుస్తుంది. మరి ఈ హత్య కేసు ఏమైంది.. డెవిల్ నేపథ్యం ఏంటి.. తన లక్ష్యం ఏంటి.. అది నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

భారత స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ వ్యవహారం ఒక పెద్ద మిస్టరీ. అంత పెద్ద బ్రిటిష్ బలగాన్ని ఢీకొని బోస్ ఉద్యమాన్ని విప్లవ బాటలో ఎలా నడిపించాడు, చివరికి ఆయన ఏమయ్యాడు అనే విషయంలో చరిత్రకారులు అనేక వెర్షన్లు చెబుతుంటారు. వినడానికి, చదవడానికి ఎంతో ఉత్కంఠభరితంగా, ఉద్వేగ భరితంగా అనిపించే బోస్ క్యారెక్టర్.. ఆయనతో ముడిపడ్డ ఘటనల చుట్టూ కల్పిత కథలు అల్లి సినిమాలు తీసే ప్రయత్నం ఎప్పటినుంచో జరుగుతోంది. కానీ బోస్ పాత్రను ఇప్పటి ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలోనే ఈ సినిమాల సక్సెస్ ఆధారపడి ఉంటుంది అన్నది స్పష్టం. కొన్ని నెలల కిందటే నిఖిల్ నుంచి స్పై అనే సినిమా వచ్చింది. అందులో కథ మొత్తాన్ని బోస్ పాత్ర చుట్టూనే తిప్పారు. ట్రైలర్ చూస్తే ఏదో అద్భుతం చేస్తున్నట్లు అనిపించింది కానీ తెర మీద ఆ పాత్రే కాదు సినిమా కూడా తేలిపోయింది. ఇప్పుడు డెవిల్ సైతం బోస్ పాత్ర చుట్టూనే ఒక కల్పిత కథను అల్లి ఒక ప్రయత్నం చేసింది. ఇది స్పై లాగా పై పై మెరుపుల సినిమా అయితే కాదు. కథపరంగా ఇందులో ఒక కసరత్తు, టేకింగ్ పరంగా కష్టం కనిపిస్తుంది. కానీ ముందే అన్నట్లు బోస్ పాత్రను ఎమోషనల్ గా ప్రేక్షకులు కనెక్ట్ చేయడంలో డెవిల్ టీం కూడా విఫలమైంది. డెవిల్ సగటు యాక్షన్ థ్రిల్లర్ సినిమాల తరహాలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలిగిందే తప్ప.. ఉద్వేగాలు రేకెత్తించడంలో సక్సెస్ కాలేకపోయింది.

ఆర్ఆర్ఆర్ ఒక అసహజమైన కల్పిత కథ. ఒకరితో ఒకరికి అసలు సంబంధం లేని, వేర్వేరు కాలాల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను కలిపి కథను అల్లి కూడా ఆ పాత్రలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో.. భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లగలిగాడు రాజమౌళి. డ్రామాను పండించడంలో నైపుణ్యం ఉంటే కథ ఎంత అసహజంగా ఉన్నా ఎమోషన్ వర్కవుట్ అవుతుంది అనడానికి ఆ సినిమానే ఉదాహరణ. కానీ డెవిల్ లో అలా డ్రామా పండించడంలోనే తడబడింది. డెవిల్ టీం సిన్సియర్ గానే ఒక ప్రయత్నం చేసిన దానిలో సందేహం లేదు. ఇందులో కథ ఎక్కడా డీవియేట్ కాదు. అవసరం లేని కమర్షియల్ హంగుల హడావిడి కనిపించదు. ఒక తీరుగా కథ నడిపించడానికే ప్రయత్నించారు. కానీ ఆ కథలో ఎమోషన్ మాత్రం మిస్సయింది. ఒక మర్డర్ మిస్టరీతో మొదలై.. కొన్ని లేయర్లతో ఒక పెద్ద లక్ష్యం దిశగా కథ నడుస్తుంది. అయితే మర్డర్ మిస్టరీ చుట్టూ నడిపిన కథనం ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. సీక్రెట్ ఏజెంట్ గా అడుగుపెట్టిన హీరో ఈ మిస్టరీని ఛేదించడానికి చేసే ప్రయత్నం సాధారణంగా సాగిపోతుంది. ఓటిటిల్లో స్పైన్ చిల్లింగ్ మర్డర్ మిస్టరీలు చూస్తున్న ఈ రోజుల్లో ఇందులో సాగే మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఏమంత ఉత్కంఠభరితంగా అనిపించదు. బోస్ పాత్ర వైపు కథను మల్లించాకే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలవుతుంది. కానీ ఒక దశ వరకు నడిచిన మర్డర్ మిస్టరీకి ఉన్నట్టుండి బ్రేక్ పడిపోవడంతో అక్కడి దాకా నడిచిన కథ పర్పస్ ఏంటో అర్థం కాదు. అందువల్లే ప్రథమార్తం సోసోగా అనిపిస్తుంది.

డెవిల్ లో హైలెట్లన్నీ ద్వితీయార్థంలోనే ఉన్నాయి. హీరో పాత్రకు సంబంధించిన ట్విస్ట్ మరి ఊహించలేనిది ఏమీ కాదు కానీ.. దాన్ని ప్లేస్ చేసిన విధానం.. అది రివిల్ అయినప్పుడు వచ్చే ఎలివేషన్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. ఆ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. చివరి అరగంటలో కథనం మంచి వేగంతో, మలుపులతో ఉత్కంఠ భరితంగానే నడుస్తుంది. అయితే చివరికి వచ్చేసరికి ఈ సినిమా పర్పస్ ఏంటన్నదే అర్థం కాకుండా తయారవుతుంది వ్యవహారం. కథలో దేశభక్తి కోణాన్ని సరిగా ఎలివేట్ చేయలేదు. స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో కథను నడిపించి ఆ రకమైన ఎమోషన్ తీసుకురాలేకపోవడం వైఫల్యమే. ఉద్యమంలో బోస్ పాత్ర గురించి కొంచెం ఇంట్రో లాంటిది ఇచ్చి, కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూపించి ఆ పాత్రను ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తే హీరో పాత్రతో ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యే వాళ్లేమో. తొలి సగంతో పోలిస్తే సెకండాఫ్ లో హీరో పాత్ర, కథనం ఆసక్తికరంగా సాగి చివరికి ఓకే అన్న ఫీలింగ్ కలిగిస్తుంది డెవిల్. రెండున్నర గంటల నిడివిలో సినిమా ఒక మోస్తరుగా టైంపాస్ అయితే చేయించేస్తుంది. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే డెవిల్ ఓకే.

నటీనటులు:

కళ్యాణ్ రామ్ డెవిల్ పాత్రలో కన్విన్సింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొదట్లో తన పాత్ర, నటన మామూలుగా అనిపించినా తర్వాత తర్వాత ఇంపాక్ట్ పెరుగుతుంది. ద్వితీయార్థంలో డెవిల్ క్యారెక్టర్ ఎలివేషన్ కి తగ్గట్లే కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ అయింది. యాక్షన్ ఘట్టాల్లో అతని కష్టం కనిపిస్తుంది. హీరోయిన్ సంయుక్త మరోసారి మెప్పించింది. తను హీరోయిన్ లాగా కాకుండా ఒక పాత్రలానే కనిపిస్తుంది. తన పరిధిలో పాత్రకు అవసరమైన మేర ఆమె నటించింది. బ్రిటిష్ దొర బ్రాకెన్ పాత్రకు మార్క్ బెనింగ్టన్ సరిపోయాడు. మాళవిక నాయర్ ఒక ముఖ్య పాత్రలో జస్ట్ ఓకే అనిపించింది. తన నుంచి ఇంకా బెటర్ పెర్ఫామెన్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. సముద్ర పాత్రలో చేసిన కన్నడ నటుడికి మంచి మార్కులు పడతాయి. నితిన్ మెహతా, షఫీ, సత్య ఇతర సహాయ పాత్రలు పోషించిన నటీనటులు అందరూ ఒకే.

సాంకేతిక వర్గం:

అర్జున్ రెడ్డి తర్వాత ఈ మధ్య యానిమల్ సినిమాతో మరోసారి తన ప్రత్యేకత చాటాడు హర్షవర్ధన్ రామేశ్వర్. డెవిల్ లో అతను అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. తన సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. మాయ చేసావే పాట ఒకటి ప్రత్యేకంగా ఉంది. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేసింది. కొన్నిచోట్ల మాత్రం మరీ లౌడ్ అనిపిస్తుంది. సౌందర్య రాజన్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ డైరెక్టర్, ఇతర టెక్నీషియన్లు బాగానే కష్టపడ్డారు. నిర్మాణ విలువల విషయంలో రాజీ లేదు. రచయిత శ్రీకాంత్ విస్సా స్క్రిప్ట్ విషయంలో బాగానే కసరత్తు చేసినట్లు అనిపిస్తుంది కానీ ఆ ఇంపాక్ట్ తెర మీద కనిపించలేదు. స్క్రీన్ ప్లే కొంచెం ఆసక్తికరంగానే ఉన్నా.. కథలో ఎమోషన్ లేకపోవడం మైనస్ అయింది. దర్శకుడు అభిషేక్ నామా ఓకే. అతను కథ నుంచి పక్కకు వెళ్లకుండా సినిమాను నడిపించినప్పటికే.. పూర్తిగా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయించలేక పోయాడు.

చివరగా: డెవిల్.. థ్రిల్స్ ఓకే, ఎమోషన్ నాట్ ఓకే

రేటింగ్: 2.5/5