Begin typing your search above and press return to search.

డెవిల్ గొడవలో.. మరో మలుపు?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డెవిల్' పై గత కొన్ని నెలలుగా ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Dec 2023 11:20 AM GMT
డెవిల్ గొడవలో.. మరో మలుపు?
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డెవిల్' పై గత కొన్ని నెలలుగా ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు దర్శకుడిగా నవీన్ మేడారం పేరుని ప్రకటించారు. కానీ టీజర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం 'డైరెక్టెడ్ బై అభిషేక్ నామా పిక్చర్స్ టీమ్' అని వేశారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ టైం కి నిర్మాత అభిషేక్ నామ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పటివరకు రైటింగ్, డైరెక్షన్ లో ఇతనికి ఎలాంటి అనుభవం లేదు.

కేవలం నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలను నిర్మించాడు. అలాంటి అభిషేక్ నామ ఉన్నట్టుండి ఎలా డైరెక్టర్ అయిపోయాడో సినీ జనాలకు ఏమాత్రం అంతు పట్టడం లేదు. మామూలుగా డైరెక్టర్ తో నిర్మాతకి విభేదాలు వస్తే అతన్ని తప్పించి మరొకరిని పెట్టి సినిమా పూర్తి చేస్తారు. కానీ ఇలా నిర్మాతే దర్శకుడిగా మారడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. టీజర్ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ గా నవీన్ పేరు తీసేసినప్పటికీ టెక్నికల్ టీం లో తన పేరు ఉంది.

కానీ తర్వాత తన పేరుని ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. మొన్నటిదాకా ఈ సినిమాలో ఏమాత్రం భాగస్వామ్యం లేని రైటర్ శ్రీకాంత్ విస్సా ఇప్పుడు డెవిల్ మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్ క్రెడిట్ మొత్తం తీసుకున్నాడు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రెడిట్ అతనికే ఇచ్చారు. అంటే అభిషేక్ పిక్చర్స్ టీం తో కలిసి నవీన్ మేడారం రెడీ చేసిన స్క్రిప్ట్ ని పూర్తిగా పక్కన పెట్టారా? లేకపోతే అదే స్క్రిప్ట్ కి శ్రీకాంత్ విస్సా మెరుగులు దిద్దాడా? అనే విషయం ఇంకా తెలియ రాలేదు.

మొత్తానికి డెవిల్ రైటింగ్, డైరెక్షన్ విషయంలో కొత్త కొత్త ట్విస్టులు ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఇదొక పర్ఫెక్ట్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. కాగా దర్శకుడి మార్పుపై డెవిల్ టీం నుంచి ఇప్పటివరకు ఎవరు మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారు. చివరికి నవీన్ మేడారం సైతం ఈ వివాదంపై సైలెంట్ గానే ఉన్నాడు

దానికి తోడు తన ట్విట్టర్ అకౌంట్లో డెవిల్ మూవీకి సంబంధించిన పోస్టులన్నీ అలాగే కొనసాగిస్తుండడం గమనార్హంగా మారింది. ఇక తాజాగా రిలీజ్ అయిన డెవిల్ ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. అతని సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. డిసెంబర్ 29న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.