Begin typing your search above and press return to search.

యాదృచ్ఛికం కాదు.. దైవానుగ్ర‌హంతోనే!

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న విష‌యం తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 March 2026 3:00 PM IST
యాదృచ్ఛికం కాదు.. దైవానుగ్ర‌హంతోనే!
X

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న విష‌యం తెలిసిందే. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల‌కు సంగీతం అందించి ప్రేక్షకులను అలరించిన ఆయన, తాజాగా హీరోగా మారేందుకు అడుగులు వేస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రీసెంట్ గా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్ష‌న్ లో తన నటనా ప్రయాణంపై స్పందించిన దేవీ శ్రీ ప్రసాద్, తాను ఇప్పటివరకు ఎందుకు నటన వైపు రాలేదో స్పష్టంగా చెప్పారు.

ఎగ్జైట్‌మెంట్ లేనిది ఏ ప‌నీ చేయ‌ను

చాలా మంది దర్శకులు, నిర్మాతలు తనను హీరోగా నటించమని అడిగారని, అయితే తనను నిజంగా ఎగ్జైట్ చేసే కథ మాత్రం దొరకలేదని పేర్కొన్నారు. ఎంత పెద్ద అవకాశం వచ్చినా, ఎగ్జైట్‌మెంట్ లేక‌పోతే ఏ ప‌నినీ చేయ‌లేన‌ని, అందుకే ఇన్నాళ్లూ తాను హీరోగా మార‌లేద‌ని, చూద్దాంలే అనుకుంటున్న టైమ్ లో తాను ఎల్ల‌మ్మ క‌థ‌ను విన్నాన‌ని, ఆ త‌ర్వాత ప‌రిస్థితి మొత్తం మారిపోయింది డీఎస్పీ చెప్పారు.

5 నిమిషాల్లోనే క‌నెక్ట్ అయ్యా

స్క్రిప్ట్ వినడం మొద‌లుపెట్టిన ఐదు నిమిషాల్లోనే ఈ సినిమా మనం చేయాల్సిందే అనిపించింద‌ని, ఆ కథలో ఉన్న భావోద్వేగం, ఆధ్యాత్మికత త‌న‌ను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేశాయ‌ని చెప్పారు. ఎల్లమ్మ కథను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, ఇది మామూలు కమర్షియల్ సినిమా కాదని, ఒక ప్రత్యేక అనుభూతిని అందించే కథగా భావిస్తున్నానని తెలిపారు.

ఎప్పుడూ అమ్మ‌వారి ఆశీస్సుల‌తోనే!

ఈ సంద‌ర్భంగా దేవీ శ్రీ మ‌రో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా డీఎస్పీ గుర్తుచేశారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా త‌న‌ తొలి సినిమా దేవి కూడా అమ్మవారి నేపథ్యంతోనే వచ్చిందని, ఇప్పుడు హీరోగా చేస్తున్న తొలి సినిమా కూడా అమ్మవారి పేరుతో ఉండటం ఒక మంచి శకునంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అనుసంధానం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, ఇది యాదృచ్ఛికం కాకుండా దైవానుగ్రహమేనని దేవీశ్రీ అభిప్రాయపడ్డారు.

మ‌రో మెట్టు ఎక్క‌బోతున్నా

ఈ సినిమాతో తాను మరో మెట్టు ఎక్క‌బోతున్నాన‌ని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్న అందరికీ మంచి జరుగుతుందని నమ్ముతున్నాన‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తన కెరీర్‌లోని మరో ముఖ్య ఘట్టాన్ని కూడా డీఎస్పీ ప్రస్తావించారు. తన 50వ సినిమా ఢ‌మ‌రుకం అని, అది కూడా శివుని సినిమా అని, ఆ సినిమాకు సంబంధించి కూడా ఇదే వేదికపై అవార్డు అందుకోవడం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. మొత్తానికి, సంగీత దర్శకుడిగా అపార విజయాలను అందుకున్న దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పుడు నటుడిగా ప్రేక్షకుల ముందుకు రానుండటం అంద‌రినీ ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. ఎల్లమ్మతో ఆయన హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.