దేవి సినిమాలకే ఎందుకిలా జరుగుతోంది?
టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్య కాస్త వెనుకబడిపోతున్నాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
By: Ravindar Gorantla | 16 March 2026 12:45 PM ISTటాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో మ్యూజికల్ సెన్సేషన్ దేవి శ్రీప్రసాద్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ అంటే అమలా పురం, ఆర్య 2లోని రింగ రింగ..పుష్ప ఊ అంటావా మామ ఊహూ అంటావా.. పలుకే బంగారమాయెనే శ్రీవల్లీ..హుక్ స్టెప్.. ఇలా ప్రతీదీ వరల్డ్ వైడ్‌గా పాపులర్ కావడం తెలిసిందే. ఇక ఆ అంటే అమలా పురం, రింగ రింగ సాంగ్స్ బాలీవుడ్‌ని ఓ రేంజ్‌లో కుదుపు కుదిపేశాయి. క్రికెట్ స్టేడియాల్లోనూ ఈ పాటలు మారుమోగిన విషయం తెలిసిందే.
టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్య కాస్త వెనుకబడిపోతున్నాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దేవి సంగీతం అందించిన సినిమాలకు ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ నేపథ్య సంగీతం అందించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన `పుష్ప 2` మూవీకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌కి సంగీతంచేసిన దేవినే `పుష్ప 2`కు కూడా మ్యూజిక్ చేశారు.
సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి `పుష్ప 2` వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అయ్యేలా చేసింది. సినిమా విజయంలో దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ ప్రధాన పాత్ర పోషించాయి. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో బ్యాగ్రౌండ్ స్కోర్‌ని దేవి శ్రీప్రసాద్ కొంత వరకు చేయగా, మిగతా కీలక సన్నివేశాలకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ కంప్లీట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దేవి ఉండగా సుక్కు సామ్‌ని ఎందుకు రంగంలోకి దించాడని అంతా కామెంట్‌లు చేశారు.
అయినా సరే సామ్ సీఎస్‌తోనే అడిషనల్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ని సుకుమార్ చేయించాడు. ఇప్పుడు అదే సీన్ `ఉస్తాద్ భగత్‌సింగ్` విషయంలో రిపీట్ అయింది. ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తే తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. దేవితో మ్యూజిక్ చేయించుకుని బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని మాత్రం తమన్‌కు అప్పగించడం ఏంటని దేవి అభిమానులు వాపోతున్నారు. దేవి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోందని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో దేవి మూవీ టీమ్‌పై అలిగారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన `ఉస్తాద్ భగత్‌సింగ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవి శ్రీప్రసాద్ పాల్గొకపోవడం ఆ అనుమానాలకు మరింత బలాన్నిచేకూరుస్తోంది. దేవిశ్రీప్రసాద్ హాజరు కాలేకపోయినా తమన్ కూడా ఈవెంట్‌లో కనిపించకపోవడంతో అభిమానులు అసలు ఏం జరుగుతోందనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. స్టార్ సినిమా ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ లేకపోవడం పెద్ద లోటని, గతంలో జరిగిన ఈవెంట్‌లో దేవి హంగామా చేసే వాడని, ఇప్పుడు ఆ హడావిడీ కనిపించడం లేదని అంతా వాపోతున్నారు.
