న్యూస్‌పేపర్ వార్తలే దేవీ శ్రీకి తొలి లిరిక్స్.. చిన్ననాటి సంగీత ప్రయాణం వెనుక ఆసక్తికర కథ!
అంతేకాదు, స్కూల్ డేస్ లో కూడా మ్యూజిక్ ను చదువుకు ఉపయోగించుకున్నానని దేవీ శ్రీ తెలిపారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Jun 2026 8:00 PM ISTమ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌లు, చార్ట్‌బస్టర్ పాటలు ఉన్నా.. ఆయన మ్యూజిక్ జర్నీ ఎలా మొదలైందన్న విషయం చాలా మందికి తెలియదు. తాజాగా సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దేవీ శ్రీ ప్రసాద్ తన చిన్ననాటి సంగీత ప్రయోగాల గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను అలరించాయి. తనకు చిన్నప్పటి నుంచే సంగీతంపై అమితమైన ఆసక్తి ఉండేదని, ఎప్పుడూ ఏదో ఒక ట్యూన్‌ను క్రియేట్ చేయాలని తపన పడేవాడినని గుర్తు చేసుకున్నారు. అయితే ట్యూన్ చేయడానికి లిరిక్స్ అవసరం అవుతాయని, కానీ తనకు పాటలు రాయడం రాకపోవడంతో ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పారు. ఇంటికి ప్రతిరోజూ వచ్చే న్యూస్ పేపర్ లోని వార్తలనే లిరిక్స్‌లా ఉపయోగించి వాటికి ట్యూన్లు కట్టేవాడినని వెల్లడించారు. తండ్రి పేపర్ చదవడం పూర్తయ్యే వరకు ఎదురుచూసి, ఆయన వెళ్లిపోయాక ఆ పేపర్ ను తీసుకుని అందులోని న్యూస్ ను స్వరబద్ధం చేసేవాడినని, ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తిరిగి అదే చోట పెట్టేవాడినని నవ్వుతూ వివరించారు.
ఈ అలవాటు ఒకటి రెండు రోజులు కాదు, కొన్నేళ్ల పాటు కొనసాగిందని దేవీ చెప్పారు. మ్యూజిక్ పై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఎలాంటి పదాలైనా తనకు లిరిక్స్‌లా కనిపించేవని, వార్తలు కూడా తనకు పాటలుగా వినిపించేవని ఆయన వ్యాఖ్యానించారు. ఆ చిన్ననాటి ప్రయోగాలే తర్వాత తన సంగీత ఆలోచనలకు బలమైన పునాది అయ్యాయని చెప్పకనే చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత కూడా కొత్త ఆలోచనలను వెతకడంలో అదే కుతూహలం తనను ముందుకు నడిపించిందని ఆయన మాటల్లో స్పష్టమైంది. సాధారణంగా మ్యూజిక్ స్టడీస్ లేదా ట్రైనింగ్ తోనే ప్రయాణం ప్రారంభమవుతుందని భావించే వారికి, చిన్న వయసులోనే దేవీ లాంటి ఓ అబ్బాయి న్యూస్ పేపర్ లోని వార్తలతో ట్యూన్లు కట్టడం నిజంగా ఆసక్తికరమైన విషయమే.
అంతేకాదు, స్కూల్ డేస్ లో కూడా మ్యూజిక్ ను చదువుకు ఉపయోగించుకున్నానని దేవీ శ్రీ తెలిపారు. తొమ్మిది, పదో తరగతుల్లో ఎగ్జామ్స్ టైమ్ లో హిందీ సబ్జెక్ట్‌లోని కవితలను గుర్తుంచుకోవడం కష్టంగా అనిపించేదని చెప్పారు. దీంతో ఆ పద్యాలనే లిరిక్స్‌లా తీసుకుని వాటికి ట్యూన్లు కట్టేవాడినని, దాంతో అవి సులభంగా గుర్తుండిపోయేవని వెల్లడించారు. ఒక పద్యం అంటే ఒక ట్యూన్ అన్నట్టుగా గుర్తుపెట్టుకుని పరీక్షల్లో రాసేవాడినని చెప్పారు. ఒకసారి క్లాస్‌రూమ్‌లో ఆ ట్యూన్‌లను పాడుతుండగా, ఫ్రెండ్స్ వాటిని పాటలుగా ఎందుకు చేయకూడదని ఎంకరేజ్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రోత్సాహంతో తొలిసారిగా సొంతంగా లిరిక్స్ రాసి ఒక అమ్మాయి గురించి పాటను కంపోజ్ చేశానని చెప్పారు. అయితే తాను చదివింది బాయ్స్ స్కూల్ కావడంతో ఆ పాటను వినిపించడానికి సరైన అమ్మాయి కూడా లేనందుకు అప్పట్లో నిరాశ చెందానని సరదాగా వ్యాఖ్యానించారు.
మ్యూజిక్ ను కేవలం వృత్తిగా కాకుండా జీవన విధానంగా చూసే దేవీ శ్రీ ప్రసాద్ మాటలు యువ సంగీతాభిమానులకు ప్రేరణగా నిలిచాయి. ఒక న్యూస్ పేపర్ లోని సాధారణ పదాల నుంచి మొదలైన ఆయన సంగీత ప్రయాణం, నేడు భారతీయ సినీ సంగీత రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడం వెనుక ఉన్న పట్టుదల, అభిరుచి, సృజనాత్మకతకు ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సింగ్ గీతం వేదికపై దేవీ శ్రీ ప్రసాద్ షేర్ చేసుకున్న ఈ జ్ఞాపకాలు ప్రేక్షకుల్లో చిరునవ్వులు పూయించడమే కాకుండా, ప్రతి గొప్ప విజయానికి వెనుక ఒక ఆసక్తికరమైన ఆరంభం ఉంటుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశాయి.
