Begin typing your search above and press return to search.

దేవర పక్కన పెట్టి మంగళవారం...!

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన 'దేవర' సినిమా సీక్వెల్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

By:  Ramesh Palla   |   19 April 2026 3:00 PM IST
దేవర పక్కన పెట్టి మంగళవారం...!
X

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన 'దేవర' సినిమా సీక్వెల్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దేవర 1 సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వక పోవడంతో సీక్వెల్‌ విషయంలో ఎన్టీఆర్‌ ఆసక్తిగా లేరనే వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ మాత్రం పలు సార్లు దేవర సినిమా సీక్వెల్‌ స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 2024లో దేవర పార్ట్‌ 1 వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే ఇప్పటికే దేవర 2 సినిమా సైతం వచ్చి ఉండేది. కానీ ఎన్టీఆర్‌ ఆసక్తి కనబర్చని కారణంగా సీక్వెల్‌ ఇప్పటి వరకు పట్టాలు ఎక్కలేదు. మంచి స్క్రిప్ట్‌తో వస్తే చేద్దాం అన్నట్లుగా దర్శకుడితో ఎన్టీఆర్ చెప్పాడని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు కొరటాల శివ స్క్రిప్ట్‌ పూర్తి చేయలేదు, ఎన్టీఆర్‌ని కలవలేదని ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో దేవర సినిమా సీక్వెల్‌ గురించి అంతా సైలెంట్‌ అయ్యారు.

సుధాకర్ మిక్కిలినేనితో కలిసి కొరటాల శివ...

కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొరటాల శివ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడని, దేవర సినిమాపై ఆశలు వదిలేసిన దర్శకుడు కొరటాల ఇప్పుడు కొత్త హీరోతో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ను ప్లాన్‌ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ కథ ఏంటి, ఆ హీరో ఎవరు, నిర్మాత ఎవరు అనే విషయంలో ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ ఇటీవల మరో ప్రాజెక్ట్‌ గురించిన వార్తలు మొదలు అయ్యాయి. సూపర్‌ హిట్‌ మూవీ మంగళవారం కు సీక్వెల్‌ నిర్మాణ బాధ్యతలను కొరటాల శివ తన భుజాలపై ఎత్తుకున్నారనే వార్తలు వస్తున్నాయి. మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌ తో కలిసి కొరటాల శివ ఈ సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ ను నిర్మించే యోచనలో ఉన్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే సుధాకర్‌తో కలిసి దర్శకుడు కొరటాల శివ సీక్వెల్‌ కోసం అజయ్‌ భూపతికి అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది.

ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్ భూపతి...

అజయ్‌ భూపతి దర్శకుడిగా ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో వెంటనే మరో సినిమాను చేసే అవకాశం దక్కింది. కానీ మహాసముద్రం నిరాశపరచడంతో ఆయన మళ్లీ హీరోల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పాయల్‌ రాజ్‌పూత్‌తో 'మంగళవారం' అనే విభిన్నమైన సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో హీరోయిన్‌ పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాకుండా నటిగా పాయల్‌ కి మంచి పేరును తెచ్చి పెట్టింది. మంగళవారం హిట్‌ తో వెంటనే కొత్త సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. మహేష్‌ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాకు దర్శకుడిగా అజయ్ భూపతి వర్క్ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీనివాస మంగాపురం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అంచనాలు పెంచాయి.

పాయల్‌ రాజ్‌పూత్‌ మంగళవారం సీక్వెల్‌..

శ్రీనివాస మంగాపురం సినిమా విడుదల అయిన వెంటనే మంగళవారం సినిమా యొక్క సీక్వెల్‌ ను మొదలు పెట్టాలని దర్శకుడు నిర్ణయించుకున్నాడు. ఈ సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ఇప్పటికే రెడీ అయింది. చాలా మంది నిర్మాతల వద్దకు ఈ స్క్రిప్ట్‌ వెళ్లింది. పలువురు నిర్మించేందుకు ఆసక్తి చూపించారట. కానీ అజయ్ భూపతి కోరుకున్నట్లుగా, ఎలాంటి మార్పులు లేకుండా ఓకే చెప్పింది, నిర్మించేందుకు సిద్ధం అయింది మాత్రం కొరటాల శివ, సుధాకర్ మిక్కిలినేని అని సమాచారం అందుతోంది. అందుకే కొరటాల శివ నిర్మాణంలో ఈ సినిమాను ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించారట. అజయ్‌ భూపతి ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. దేవర సీక్వెల్‌ ఎలాగూ పక్కన పెట్టాడు కనుక ఈ సినిమా నిర్మాణంతో అయినా కొరటాల శివ ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది ఈ సీక్వెల్‌ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక సీక్వెల్‌లో ఎవరు నటించేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.