Begin typing your search above and press return to search.

లాభం నుంచి కోట్లు దాన‌ధ‌ర్మాలు చేస్తున్న నిర్మాత‌

ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిందంటే సాధారణంగా అందరి దృష్టి నిర్మాతల లాభాలు.. తదుపరి ఎలాంటి భారీ ప్రాజెక్టు చేస్తున్నారు? అనేదానివైపే మళ్లుతుంది.

By:  Sivaji Kontham   |   30 Aug 2026 9:00 AM IST
లాభం నుంచి కోట్లు దాన‌ధ‌ర్మాలు చేస్తున్న నిర్మాత‌
X

ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిందంటే సాధారణంగా అందరి దృష్టి నిర్మాతల లాభాలు.. తదుపరి ఎలాంటి భారీ ప్రాజెక్టు చేస్తున్నారు? అనేదానివైపే మళ్లుతుంది. కానీ మరాఠీ చిత్రం `దేవూల్ బంద్ 2` నిర్మాతలు మాత్రం తమ స‌క్సెస్ సంబరాలను ఒక వినూత్నమైన, ఉదాత్తమైన రీతిలో జరుపుకుంటున్నారు. సుమారు రూ. 10 కోట్ల లోపు పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో రూ. 100 కోట్ల మైలురాయిని దాటింది. ఈ సినిమా ద్వారా వచ్చిన భారీ లాభాలను సమాజ సేవకు కేటాయించాలని చిత్ర బృందం నిర్ణయించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఈ అద్భుతమైన విజయం ద్వారా వచ్చిన లాభాలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలకు అండగా నిలవాలని `దేవూల్ బంద్ 2` బృందం భావించింది. ఆయా బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు ఇతర ఆర్థిక, సామాజిక సహాయాలను అందించడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. కేవలం సక్సెస్ మీట్లు, పార్టీలకే పరిమితం కాకుండా తమకు విజయాన్ని అందించిన సమాజానికి... ముఖ్యంగా కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకు తిరిగి ఏదైనా చేయాలనే ఆలోచన ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలిచింది.

భారతీయ సినీ పరిశ్రమలో సినిమాల ద్వారా వచ్చిన లాభాలను లేదా కలెక్షన్లలో కొంత భాగాన్ని ఒక మంచి సామాజిక ఆశయం కోసం దారపోసి `మనసున్న నిర్మాతలు`గా పేరు తెచ్చుకున్న ఘనత కొందరికే దక్కింది. గతంలో కూడా పలువురు నిర్మాతలు తమ సినిమాల విజయాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించి పరిశ్రమలో ప్రత్యేక ముద్ర వేశారు. కేవలం గ్లామర్, వ్యాపారం మాత్రమే కాకుండా సినిమా అనేది సామాజిక మార్పుకు- సేవకు ఒక శక్తివంతమైన సాధనమని వారు నిరూపించారు.

ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో ఇలాంటి ఉదారత చూపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. హిందీలో అమీర్ ఖాన్ నటించిన `సత్యమేవ జయతే` వంటి షోల ద్వారా.. అత‌డి నిర్మాణంలో వచ్చిన కొన్ని చిత్రాల ద్వారా సమాజంలో తాగునీటి సమస్య పరిష్కారానికి (పానీ ఫౌండేషన్) నిధులను కేటాయించారు. అలాగే వినోద్ చోప్రా వంటి నిర్మాతలు తమ సినిమాల ప్రీమియర్ కాన్సర్ట్‌లు, కలెక్షన్ల ద్వారా వచ్చిన సొమ్మును స్వచ్ఛంద సంస్థలకు, శరణార్థుల సంక్షేమానికి అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఇక టాలీవుడ్‌లోనూ సినిమాల ఆదాయాల‌తో సంబంధం లేకుండా మెగా హీరోలు కోట్లాది రూపాయ‌ల విరాళాల‌ను క‌ష్టంలో ఉన్న‌వారికోసం.. ప‌రిశ్ర‌మ‌లో ఇబ్బందిలో ఉన్న వారికోసం డొనేట్ చేసిన సంద‌ర్భాలున్నాయి. మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు తమ స్వంత నిర్మాణంలో రూపుదిద్దుకున్న సినిమాల ద్వారా వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు - దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్నారు. మరికొందరు నిర్మాతలు హెచ్‌ఐవీ బాధిత పిల్లల చదువులకు, క్యాన్సర్ రోగుల చికిత్సకు తమ సినిమాల డిజిటల్ లేదా ప్రీమియర్ షోల ఆదాయాన్ని అందించి రియల్ హీరోలుగా నిలిచారు. ఇప్పుడు `దేవూల్ బంద్ 2` నిర్మాతలు కూడా ఇదే బాటలో పయనిస్తూ రూ. 100 కోట్ల విజయంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.