Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: డ‌జ‌ను సినిమాల‌తో స్టార్ ఫ్యామిలీ గ్రేట్ కంబ్యాక్

డియోల్స్ కొత్త ఇన్నింగ్స్ ఈ సినిమాతో ఘ‌నంగా ప్రారంభమైంది. ఈ చిత్రం భారతదేశంలో విజయవంతమైంది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 3:08 PM GMT
ట్రెండీ టాక్‌: డ‌జ‌ను సినిమాల‌తో స్టార్ ఫ్యామిలీ గ్రేట్ కంబ్యాక్
X

కొన్నేళ్లుగా విస్మరించబడిన స్టార్ ఫ్యామిలీ గ్రేట్ కంబ్యాక్ ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వైఫ‌ల్యాల‌తో రేసులో వెన‌క్కి వెళ్లిపోయిన‌ డియోల్స్ మళ్లీ బాలీవుడ్‌ను పాలిస్తున్నారు. గదర్ 2 & RRKPK చిత్రాల‌తో డియోల్స్ గ్రేట్ కంబ్యాక్ ప్రారంభ‌మైంది. దీనిని ఇక‌పైనా వారు కొన‌సాగిస్తార‌ని అంతా భావిస్తున్నారు. నిజానికి డియోల్ శకం తిరిగి రాబోతోందని ఏడాది కాలంగా ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. 2023లో డియోల్స్ న‌టించిన అర‌డ‌జ‌ను సినిమాలు వ‌రుస‌గా రిలీజ్ కానున్న నేప‌థ్యంలో స్టార్ ఫ్యామిలీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో పునరాగమనం చేయ‌నుంద‌ని ఏడాది కింద‌టే అంచ‌నా వేసారు.

ఈ అంచ‌నాల్ని నిజం చేస్తూ ధర్మేంద్ర నటించిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' పెద్ద విజ‌యం సాధించింది. డియోల్స్ కొత్త ఇన్నింగ్స్ ఈ సినిమాతో ఘ‌నంగా ప్రారంభమైంది. ఈ చిత్రం భారతదేశంలో విజయవంతమైంది. 87 ఏళ్ల పాపుల‌ర్ స్టార్ ధ‌ర్మేంద్ర న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. దేశ విదేశాల్లో భారీ ప్రశంసలతో సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అటుపై రెండు వారాల తరువాత సన్నీ డియోల్ 'గదర్ 2'తో పాత కాలంలో(90ల‌లో) లాగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ చిత్రం 10 రోజుల్లో రూ. 375 కోట్లు వ‌సూలు చేసింది. గ‌ద‌ర్ 2 రూ. 500 కోట్ల క్ల‌బ్ లో చేరింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆసక్తికరంగా రణబీర్ కపూర్‌తో కలిసి బాబీ డియోల్ న‌టించిన క్రేజీ చిత్రం 'యానిమల్' కూడా 'గదర్ 2' రిలీజ్ డేకి విడుదల చేయవలసి ఉంది. అయితే ఈ చిత్రం డిసెంబర్‌కి వాయిదా పడింది.

గదర్ 2 దేశీయ బాక్సాఫీస్ వద్ద ధ‌మాకా మోగిస్తుండగా, సన్నీడియోల్ చిన్న కుమారుడు రాజ్‌వీర్ డియోల్ రాజశ్రీ ప్రొడక్షన్స్ 'డోనో'తో రంగ ప్ర‌వేశం చేస్తున్నాడు. పూనమ్ ధిల్లాన్ కుమార్తె పలోమా ఇందులో క‌థానాయిక‌. ఈ రొమాంటిక్ డ్రామాకు సూరజ్ బర్జాత్య కుమారుడు అవ్నీష్ బర్జాత్య దర్శకత్వం వహించారు. 5 అక్టోబర్ 2023న థియేటర్లలో విడుదల కానుంది. మరో నెల తర్వాత నవంబర్‌లో ధర్మేంద్ర న‌టించిన‌ మరో చిత్రం విడుద‌ల‌వుతుంది. షాహిద్ కపూర్ -కృతి సనన్ ల‌తో కలిసి నటించిన ఇంకా పేరు పెట్టని రొమాంటిక్ కామెడీలో ధ‌ర్మేంద్ర న‌టిస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ 'డుంకీ'లో షారుఖ్ ఖాన్ తండ్రిగా ధర్మేంద్ర నటిస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. ఈ చిత్రం 22 డిసెంబర్ 2023న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో కలిసి నటిస్తున్న‌ 'ఎక్కిస్' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.

సన్నీడియోల్ విషయానికొస్తే,.. అతడు తదుపరి యాక్షన్ చిత్రం 'బాప్‌'లో సంజయ్ దత్- జాకీ ష్రాఫ్- మిథున్ చక్రవర్తి తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే 'సూర్య' అనే క్రైమ్ థ్రిల్లర్ లోను స‌న్నీ న‌టించ‌నున్నాడు. ఇది 2018 మలయాళ చిత్రం జోసెఫ్ కి అధికారిక‌ రీమేక్.

డిసెంబర్ 1న యానిమల్‌తో పాటు, డిసెంబర్ 15న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' అనే తెలుగు పీరియడ్ యాక్షన్ చిత్రంలో బాబిడియోల్ న‌టిస్తున్నారు. సూర్యతో కలిసి నటించిన తమిళ యాక్షన్ ఎపిక్ 'కంగువ'లో కూడా బాబి కనిపించనున్నాడు. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది.

చివరకు, నలుగురు డియోల్‌లు - ధర్మేంద్ర, సన్నీ డియోల్, బాబీ డియోల్, సన్నీ పెద్ద కొడుకు కరణ్ డియోల్ కలిసి 'అప్నే 2'లో నటించనున్నారు. బాక్సింగ్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం 2007 బ్లాక్ బ‌స్ట‌ర్ 'అప్నే'కి సీక్వెల్. గదర్ 2 ఫేమ్ అనిల్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఇంత‌కుముందే ప్ర‌క‌టించారు. 2024లో ఈ సినిమా విడుదల కానుంది.