Begin typing your search above and press return to search.

యంగ్ ఆర్టిస్టుల కలలకు రెక్కలు: చదువుకున్న స్కూల్‌కే 18 కోట్లు ఇచ్చేసిన హీరో!

డెంజెల్ వాషింగ్టన్ ఫోర్డ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి నాటక రరంగ విద్యను పూర్తి చేశారు. నాటక కళలో తగిన శిక్షణ పొందిన తర్వాతే ఆయన హాలీవుడ్ స్థాయి నటుడిగా ఎదిగారు.

By:  Tupaki Desk   |   18 Oct 2026 12:00 AM IST
యంగ్ ఆర్టిస్టుల కలలకు రెక్కలు: చదువుకున్న స్కూల్‌కే  18 కోట్లు ఇచ్చేసిన హీరో!
X

హాలీవుడ్‌లో అత్యున్నత నటుడిగా గుర్తింపు పొంది.. రెండు ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న దిగ్గజ నటుడు డెంజెల్ వాషింగ్టన్ త‌న‌ ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమా ప్రపంచంలో ఎంతోమందికి ప్రేరణగా నిలిచిన ఆయన కళారంగాన్ని నమ్ముకున్న భావి తరాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తాను చదువుకున్న ఫోర్డ్‌హామ్ యూనివర్సిటీ థియేటర్ విభాగానికి ఏకంగా $2.25 మిలియన్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 18 కోట్లకు పైగా) భారీ విరాళాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నారు.

చదువుకున్న బడికే తిరిగి ఇవ్వడం

డెంజెల్ వాషింగ్టన్ ఫోర్డ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి నాటక రరంగ విద్యను పూర్తి చేశారు. నాటక కళలో తగిన శిక్షణ పొందిన తర్వాతే ఆయన హాలీవుడ్ స్థాయి నటుడిగా ఎదిగారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన సొంత విద్యాసంస్థకు ఈ విరాళం ఇవ్వడం ద్వారా ఆయన మూలాలను మర్చిపోలేదని నిరూపించారు. రంగస్థల నాటకాలపై ఆయనకున్న అమితమైన ప్రేమను, కృతజ్ఞతా భావాన్ని ఈ విరాళం స్పష్టం చేస్తోంది.

యంగ్ ఆర్టిస్టులకు మెరుగైన శిక్షణ

డెంజెల్ అందించిన 18 కోట్ల విరాళాన్ని ఫోర్డ్‌హామ్ విశ్వవిద్యాలయం థియేటర్ విభాగాన్ని మరింత ఆధునీక రించడానికి ఉపయోగించనున్నారు. ముఖ్యంగా నాటక రంగం వైపు అడుగులు వేస్తున్న యువ కళాకారులకు అధునాతన సాంకేతిక ప్రమాణాలతో కూడిన మెరుగైన శిక్షణ అందించడానికి.. వారి రంగానికి సంబంధించిన మౌలిక వసతులను పెంపొందించడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు.

ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు:

కేవలం వసతుల కల్పనకే కాకుండా ఈ నిధుల ద్వారా ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నారు. నాటక రంగంలో రాణించాలనే కోరిక ఉన్నా? ఆర్థిక స్థోమత లేక వెనుకబడిపోతున్న ఎంతోమంది వర్ధమాన నటులు , సాంకేతిక నిపుణులకు ఈ విరాళం గొప్ప అవకాశంగా మారనుంది. డెంజెల్ ఇచ్చిన ప్రోత్సాహంతో వారి కలలు నెరవేరనున్నాయి.

కళలకు ఇచ్చే ప్రాధాన్యత:

నేటి డిజిటల్ యుగంలో సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యత నాటక రంగానికి లభించడం లేదనే భావన చాలామందిలో ఉంది. అయితే ప్రతి గొప్ప నటుడికి పునాది నాటక రంగమేనని నమ్మే డెంజెల్ వాషింగ్టన్, థియేటర్ ఆర్ట్స్‌ను బ్రతికించుకోవాలనే లక్ష్యంతో ఈ విరాళం ఇచ్చారు. కళాకారుల ప్రతిభను గుర్తించి వారికి సరైన వేదికను అందించడమే అసలైన సేవా కార్యక్రమమని ఈ చర్య ద్వారా రుజువు చేశారు.

వెల్లువెత్తుతున్న ప్రశంసలు:

హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డెంజెల్ వాషింగ్టన్ చేసిన ఈ విరాళంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. స్వయంకృషితో ఎదిగి సమాజానికి, కళారంగానికి తిరిగి ఇవ్వడంలో ఆయన చూపిన చొరవను పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కొనియాడుతున్నారు. ఆయన అందించిన ఆర్థిక సాయం ద్వారా ఫోర్డ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి మరెంతో మంది అద్భుతమైన కళాకారులు భవిష్యత్తులో వెలుగులోకి రావడం ఖాయం.