Begin typing your search above and press return to search.

లవర్ ఆ పని చేయలేదని.. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి స్కెచ్..

యూపీఎస్సీ అభ్యర్థి రామ్‌కేశ్‌ మీనా మరణం మొదట అగ్నిప్రమాదం అనిపించినా, పోలీసులు చేసిన లోతైన దర్యాప్తుతో అది ప్రణాళికబద్ధ హత్యగా తేలింది.

By:  Tupaki Desk   |   28 Oct 2025 12:27 PM IST
లవర్ ఆ పని చేయలేదని.. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి స్కెచ్..
X

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడి దారుణ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. యూపీఎస్సీ అభ్యర్థి రామ్‌కేశ్‌ మీనా మరణం మొదట అగ్నిప్రమాదం అనిపించినా, పోలీసులు చేసిన లోతైన దర్యాప్తుతో అది ప్రణాళికబద్ధ హత్యగా తేలింది. మృతుడి ప్రేయసే అతని ప్రాణాలను తీయడానికి తన మాజీ ప్రియుడితో కలిసి భయంకర కుట్ర పన్నడం ఈ కేసును మరింత షాకింగ్‌గా మార్చింది.

సహజీవనంతో మొదలు..

32 ఏళ్ల రామ్‌కేశ్‌ మీనా, సివిల్‌ సర్వీసుల పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఢిల్లీలోని తిమార్‌పూర్‌ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ విద్యార్థిని అమృతా చౌహాన్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న క్రమంలో ఈ రిలేషన్ షిప్ లో విభేధాలు పొడచూపాయి.

హత్యకు కారణమిదేనా?

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కీలక అంశం ప్రైవేటు వీడియోలు. రామ్‌కేశ్‌ తనకు, అమృతకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి హార్డ్‌డిస్క్‌లో భద్రపరచుకున్నాడు. అవి డిలీట్‌ చేయాలని అమృతా ఎన్ని సార్లు కోరినా రామ్‌కేశ్‌ నిరాకరించాడు. ఆ వీడియోలు బయటకు వస్తాయనే భయంతో అమృత ఆందోళనకు గురైంది. ఇక లాభం లేదనుకొని ఆమె తన మాజీ ప్రియుడు సుమిత్‌, మరో స్నేహితుడితో కలిసి రామ్‌కేశ్‌ను హత్య చేయడానికి పక్కా ప్లాన్‌ వేసింది.

మర్డర్ కు పక్కా స్కెచ్..

అక్టోబర్‌ 6న రాత్రి ముగ్గురూ తమ ముఖాలు కనిపించకుండా మాస్క్ లు వేసుకొని ఫ్లాట్‌లోకి ప్రవేశించారు. రామ్‌కేశ్‌ను హత్య చేసిన అనంతరం, ఈ ఘటనను అగ్నిప్రమాదంలా చూపించేందుకు శరీరంపై నెయ్యి, నూనె, వైన్‌ చల్లి నిప్పంటించారు. వంటగదిలోని గ్యాస్‌ సిలిండర్‌ను తెరిచి, తలుపు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కాసేపటికి భవనంలో పేలుడు సంభవించి, మృతదేహం పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ ఘటనను మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాల ద్వారా వాస్తవాన్ని వెలికితీశారు.

అవి ప్రమాదాలకు సంకేతమా?

ఈ కేసు ఆధునిక సంబంధాల సున్నిత స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ప్రేమలో నమ్మకం కోల్పేతే అది ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన చూపించింది. సాంకేతిక యుగంలో వ్యక్తిగత సంబంధాల గోప్యత కూడా ఆయుధంగా మారిన సందర్భమిది. ప్రైవేటు వీడియోలు, డిజిటల్‌ ఆధారాలు ఇప్పుడు ప్రేమలో ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి.

అమృత ప్రణాళిక కేవలం హత్య కాదు నమ్మకానికి, ప్రేమకు ద్రోహం. అగ్నిప్రమాదం వెనుక దాగిన ఈ కథ, భావోద్వేగాలను నియంత్రించకపోతే మనిషి ఎంత క్రూరంగా మారుతాడో సాక్ష్యంగా నిలిచింది.

పోలీసులు ప్రస్తుతం ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి, హార్డ్‌డిస్క్‌తో పాటు కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది — ప్రేమలో స్వార్థం నిండితే ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో ఇదో ఉదాహరణ.