కంగారు పడుతున్న దీపిక.. కారణమిదేనా?
సందీప్ వంగా `స్పిరిట్` నుంచి దీపిక పదుకొనే ఊస్టింగ్ సంచలనం అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jun 2025 11:48 PM ISTసందీప్ వంగా `స్పిరిట్` నుంచి దీపిక పదుకొనే ఊస్టింగ్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. దీనికి కారణం అదుపు తప్పిన ఫెమినిజం! ఆరు గంటల పని దినాలు... సెట్లో తెలుగు పదాలు పలకనని భీష్మించుకోవడం... 20కోట్ల పారితోషికం అదనంగా లాభాల్లో వాటా... ఇలా రకరకాల డిమాండ్లతో వంగాను ఉక్కిరి బిక్కిరి చేయడంతో అతడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
`స్పిరిట్` నుంచి తొలగించాక దీపికను `కల్కి 2898 ఏడి` సీక్వెల్ నుంచి తొలగించేందుకు ఆస్కారం ఉందని కథనాలొచ్చాయి. చాలా గొంతెమ్మ కోర్కెలతో వేగలేక భారీ ఫ్రాంఛైజీ సినిమాల నుంచి తొలగిస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే ఈ ప్రచారానికి దీపిక పదుకొనే పీఆర్ ఖంగు తిన్నట్టే కనిపిస్తోంది. వెంటనే తమాయించుకుని ఇప్పుడు దీపిక అంత పెద్ద తప్పు ఏం చేసిందని? బిడ్డతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంది.. అది కూడా తప్పేనా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
వీలున్న ప్రతిసారీ `బిడ్డతో సమయం` అనే ట్యాగ్ ని వాడేస్తోంది దీపిక పీఆర్. నిజానికి సమస్య ఆరుగంటల పనిదినం కాదు.. హద్దు మీరిన ఫెమినిజం.. అది తగ్గాలనే సందీప్ డోస్ ఇచ్చాడు. దానిని అర్థం చేసుకోకుండా, ఇప్పుడు దీపిక పీఆర్ లు తెలివి తక్కువ ప్రకటనలు చేయడం అసమంజసంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
బాలీవుడ్ హంగామాకు దీపిక పీఆర్ లీకుల వివరం ఇలా ఉంది. దీపిక కేవలం పని గంటలకు సంబంధించి కొన్ని షరతులు విధించింది. తన కూతురితో సమయాన్ని గడపాలని కోరుకుంది.. అందువల్ల ఆమె అంతులేని పని చేయడానికి సిద్ధంగా లేదు. అయితే కల్కి 2 నిర్మాతలు దీపికను తొలగించారనే వార్తలు అస్సలు నిజం కాదు! అని పీఆర్ తన తొట్రుపాటును ప్రదర్శించింది. సినిమా ఇంకా చిత్రీకరణకు వెళ్లకుండా అప్పుడే సెట్స్‌లో ఘర్షణ ఎలా ఉంటుంది? నిజానికి షూటింగ్ దాదాపు ఒక సంవత్సరం తర్వాత ప్రారంభమవుతుంది. అంతేకాకుండా దీపికా పదుకొనే `కల్కి 2898 AD`లో కీలక భాగం. మొదటి భాగం కథ దీపిక చుట్టూ తిరుగుతుంది. సీక్వెల్‌లో కూడా ఆమెకు కీలక పాత్ర ఉంది.. అంటూ బాలీవుడ్ హంగామా తన కథనంలో ప్రచురించింది.
అంతేకాదు.. దీపిక `అసమంజసమైన` డిమాండ్ల కారణంగా, సినిమాల నుండి తొలగిస్తున్నారనే కథనాలను వండుతున్నారు. ఈ పుకారు ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ... స్పిరిట్ తర్వాత వరుసగా అవకాశాలు కోల్పోతోంది... ఇది దీపిక కెరీర్‌ను ప్రభావితం చేస్తుంది`` అని పేర్కొన్నట్టు కథనం వెలువరించింది. కానీ ఈ వార్తలను ప్రచారం చేసే వారు గమనించాల్సినది ఒకటి ఉంది. దీపికను `స్పిరిట్` నుంచి తొలగించినా కానీ, అల్లు అర్జున్-అట్లీ సినిమాను సొంతం చేసుకున్న విషయం మర్చిపోతున్నారు! షారుఖ్ ఖాన్ `కింగ్` కోసం కూడా సంతకం చేసింది. కల్కి 2 లోను నటిస్తుంది. ఒక ప్రొఫెషనల్ కాని నటి ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎలా దక్కించుకోగలదు? అని ప్రశ్నిస్తూ పీఆర్ ప్రచారం చేయించుకోవడం వారి తొట్రుపాటను, కంగారును బయటపెట్టింది. మొత్తానికి దీపిక పీఆర్వోల ఓవరాక్షన్ కి అక్షింతలు గట్టిగానే పడినట్టున్నాయి. అందుకే ఇప్పుడు బాలీవుడ్ మీడియాల్లో దీపికపై పాజిటివ్ కథనాలు వండి వారుస్తున్నారు. సందీప్ వంగా విసిరిన పంచ్ గట్టిగానే పని చేస్తోంది!!
