సెట్లో కార్మికుల పని గంటలు హక్కులపై దీపిక పోరాటం?
ప్రభాస్ స్పిరిట్ నుంచి దీపిక పదుకొనేను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తొలగించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 Jun 2025 9:51 AM ISTప్రభాస్ స్పిరిట్ నుంచి దీపిక పదుకొనేను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తొలగించిన సంగతి తెలిసిందే. ఎనిమిది గంటల పని దినాన్ని వ్యతిరేకించిన దీపిక దీంతో పాటు, అదనంగా ఇంకా చాలా కండిషన్లు పెట్టడంతో ఈ సినిమా నుంచి తొలగించారని కథనాలొచ్చాయి. బిడ్డ తల్లులకు పని చేసే సమయాన్ని ఆరు గంటలకే పరిమితం చేయాలని దీపిక కోరినట్టు కథనాలొచ్చాయి.
అదంతా అటుంచితే ఇప్పుడు దీపిక పదుకొనే సెట్లో ఆర్టిస్టులు, కార్మిక సిబ్బందికి పని గంటలు, సౌకర్యాలు హక్కులు విషయంలో తాను చాలా కాలంగా పోరాడుతున్నట్టు వెల్లడించింది. స్పిరిట్ నుంచి వైదొలిగాక ఈ నిర్ణయం తీసుకోలేదు. తాను కొన్నేళ్లుగా పని గంటల విషయంలో నిర్మాతలతో పోరాడుతున్నట్టు వెల్లడించింది. సెట్లలో 8 గంటలు మించి పని చేసే సిబ్బందిని చూస్తున్నాను. ఉదయం తొందరగా వస్తారు.. డ్యూటీ ముగిసాక కూడా చాలా ఆలస్యంగా ఇంటికి వెళతారని, ఇది సరికాదని, ఎక్కువ సమయం పని చేస్తే, గంటల లెక్కన వారికి అదనపు భత్యం చెల్లించాలని దీపిక డిమాండ్ చేసింది. హీరోలు, దర్శకులు వంటి వారికి అదనపు పని గంటలు పని చేస్తే రివార్డులు దక్కుతాయి కానీ తెరవెనక పని చేసే సిబ్బందికి అలాంటి పరిస్థితులు ఉండవని దీపిక అన్నారు.
అధిక పని ఒత్తిడి ప్రొడక్ట్ నాణ్యతపై ప్రభావం చూపుతుందని దీపిక పదుకొనే వాదించారు. తాను డిప్రెషన్ కారణంగా చాలా విషయాలు తెలుసుకున్నానని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యమని అర్థమైందని దీపిక వెల్లడించింది. జీవితంలో సమతుల్యత సాధించకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని దీపిక అన్నారు. కార్పొరెట్ కల్చర్ లో కూడా పని గంటల ఒత్తిడి తగ్గాలని, ఉద్యోగుల జీవితాలు మారాలని తాను కోరుకున్నట్టు వెల్లడించింది. తాను నిర్మాతగా రూపొందించే సినిమాలకు సెట్లలో ఇదే పని గంటల నియమం వర్తింపజేస్తానని దీపిక పేర్కొంది. చేసే పని, లైఫ్ స్టైల్ విషయంలో సమతుల్యతను కాపాడుకోకపోతే ఆరోగ్యం పరంగా చాలా సమస్యలు తలెత్తుతాయని దీపిక అంది. సమస్యల్ని ఎదుర్కొన్న తర్వాత ధృఢంగా ఒక నిర్ణయం తీసుకున్నానని కూడా తెలిపింది దీపిక.
అయితే స్పిరిట్ నుంచి దీపికను తొలగించడానికి చాలా కారణాలే ఉన్నాయి. 6 గంటల పనిదినాల డిమాండ్ తో పాటు 20 కోట్ల పారితోషికం లాభాల్లో వాటా కోరిందని, తన సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతే భరించాలని దీపిక డిమాండ్ చేసినట్టు కథనాలొచ్చాయి. లిప్ సింక్ కోసం తెలుగు పదాలు చెప్పనని కూడా దీపిక తెగేసి చెప్పింది. ప్రచార కార్యక్రమాలకు రాలేనని చెప్పినట్టు కూడా గుసగుసలు వినిపించాయి.
