దీపికకు పీఆర్ అతితోనే చిక్కులు?
దీపిక కనీస మాత్రంగా కూడా దీనిని గమనించలేదు. పీఆర్ ప్రకటనలకు మద్ధతుగా నిలిచింది.
By: Tupaki Desk | 13 Jun 2025 9:00 AM ISTబలమైన పీఆర్ ఉంటే, దానిని సవ్యమైన పద్ధతిలో ఉపయోగించాలి. సినిమాలో అవకాశం రాలేదని, ఇది ''ఏ రేటెడ్ సినిమా.. ప్రజలు చూడలేరు!'' అనే భావన వచ్చేలా పీఆర్ తో ప్రచారం చేయిస్తే దానిని ఏమనాలి? దీపిక పదుకొనే దొరికిపోయింది ఇక్కడే. స్పిరిట్ నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని సందీప్ వంగా కుండ బద్ధలు కొట్టగానే దీపిక పీఆర్ ఆక్రోశం వెల్లగక్కింది. ''ఇదేమి సినిమా... ఇందులో నటించకపోతే నష్టం ఏంటి?'' అంటూ పీఆర్ రియాక్టయింది. దీపికను స్పిరిట్ నుంచి తొలగించినా కానీ, అల్లు అర్జున్ సినిమాలో నటిస్తోంది.. ఇదే గాక షారూఖ్ సరసనా కింగ్ లో నటిస్తోంది.. మరో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి! అంటూ దీపిక పీఆర్ ఓవరాక్షన్ చేసింది. బాలీవుడ్ హంగామా సహా పలు మీడియాల్లో దీపిక పీఆర్ పెయిడ్ ఆర్టికల్స్ రాయించిందని కూడా సౌత్ మీడియా గమనించింది.
అయితే పీఆర్ కి ఇంత అతి దేనికి? అసలు నయనతార, అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, సమంత .. వీరంతా అగ్ర కథానాయికలుగా హోదాను ఆస్వాధించడం లేదా? వీళ్లలో ఎవరైనా పీఆర్ తో ఎప్పుడైనా అతి చేయించారా? కనీసం కత్రిన, కరీనా, ప్రియాంక చోప్రా లాంటి దీపిక సహచర కథానాయికల పీఆర్ లు కూడా మరీ ఇంత హడావుడి ఎప్పుడూ చేచించనే లేదు. ఒకవేళ సినిమాలో అవకాశం కోల్పోతే, ఆ తర్వాత చడీ చప్పుడు లేకుండా వేరే ప్రాజెక్టులు వెతుక్కున్నారు కానీ, ఇది చెత్త కంటెంట్ ఉన్న సినిమా అని తక్కువ చేసి మాట్లాడలేదు.
దీపిక కనీస మాత్రంగా కూడా దీనిని గమనించలేదు. పీఆర్ ప్రకటనలకు మద్ధతుగా నిలిచింది. బాలీవుడ్ లో దీపిక నిస్సందేహంగా అగ్ర కథానాయిక. అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోయిన్. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. మరో కోణంలో చూస్తే పీఆర్ హంగామా ఎక్కువ ఉన్న కథానాయిక కూడా దీపిక పదుకొనే మాత్రమే. ఇతర కథానాయికలు పీఆర్ పేరుతో ఇంత రచ్చ ఏనాడూ చేయలేదు.. చేయరు. కారణం ఏదైనా ఈ పీఆర్ డామినేషన్ దీపిక ప్రతిభను కూడా అర్థం లేనిదిగా మార్చేట్టే కనిపిస్తోంది. ఒక్కోసారి తారలు మామూలుగా ఆలోచించినా వెంట ఉండే పీఆర్ లు కయ్యానికి కాలు దువ్వేలా నూరి పోయొచ్చు. అలాంటి కారణంతోనే దీపిక మరీ ఇలాంటి తప్పిదం చేసిందా? అంటూ ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. కనీసం ఇప్పటికి అయినా డ్యామేజ్ కంట్రోల్ కోసం దీపిక పదుకొనే ప్రయత్నిస్తే మంచిది. పీఆర్ ని అదుపులో ఉంచడం ద్వారా కూడా డ్యామేజీని తగ్గించగలదని సూచిస్తున్నారు.
