సుహానాకు తల్లిగా దీపిక?
వెండితెరపై తల్లి పాత్రలో నటించేందుకు నాటి మేటి కథానాయికలు ఎవరూ వెనకాడలేదు.
By: Tupaki Desk | 8 April 2025 7:00 AM ISTవెండితెరపై తల్లి పాత్రలో నటించేందుకు నాటి మేటి కథానాయికలు ఎవరూ వెనకాడలేదు. కానీ ఇటీవలి కాలంలో కొన్ని హద్దులు నిర్ణయించుకుని అగ్ర నాయికలు ఈ తరహా పాత్రలకు దూరమయ్యారు. కానీ కొందరు మాత్రమే అరుదుగా ఈ రూల్ ని బ్రేక్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తల్లిగా నటించినా తమకు కనీసం అవార్డు రావాలనే తపన నేటితరంలో కొందరు నాయికలకు ఉంది.
నయనతార, సాయిపల్లవి లాంటి కథానాయికలు మదర్ పాత్రల్లో నటించేందుకు వెనకాడలేదు. ఇప్పుడు బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనే తల్లిగా నటించేందుకు అంగీకరించారని తెలుస్తోంది. షారూఖ్ ఖాన్ ఓం శాంతి ఓం చిత్రంతో కథానాయికగా పరిచయమైన దీపిక, ఇప్పుడు షారూఖ్ నటిస్తున్న కింగ్ చిత్రంలో తల్లి పాత్రకు ఓకే చెప్పారని తెలిసింది. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రం చేస్తున్న ఈ సినిమాలో సుహానాకు తల్లిగా దీపిక కనిపించనుందట.
ఖాన్ సరసన ఎదిగిన బిడ్డకు తల్లిగా నటించే పాత్రధారిని వెతికిన దర్శకుడు చివరికి ఈ కీలక పాత్ర కోసం దీపికా పదుకొనేను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పీపింగ్ మూన్ కథనం ప్రకారం.. సుహానా ఖాన్ తల్లిగా ఖాన్ మాజీ ప్రేయసిగా నటించడానికి దీపిక ఓకే చెప్పారు. దీపిక ఎక్స్ టెంట్ చేసిన అతిధి పాత్రలో కనిపిస్తుంది. కానీ కథలో ప్రధాన సంఘర్షణను ఈ పాత్ర ఎలివేట్ చేస్తుంది. యాధృచ్ఛికంగా `కల్కి 2898 ఏడి`లో కడుపులో బిడ్డను మోసే గర్భిణి పాత్రలో నటించిన దీపికకు ప్రమోషన్ రానుంది. ఇది గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. పైగా రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి నాయిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. `పఠాన్` ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అతడు ప్రస్తుతం స్క్రిప్ట్‌లో పరిపూర్ణత సాధించడంపై దృష్టి పెడుతున్నాడు. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.
షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ లో దీపికా పదుకొనే నటించింది. ప్రస్తుతం ఆరవ సారి ఈ జోడీ తిరిగి రిపీటవుతోంది. ఇందులో షారుఖ్ ఖాన్ అనుభవజ్ఞుడైన కిల్లర్ పాత్రలో నటిస్తుండగా, అభిషేక్ బచ్చన్ ప్రత్యర్థి పాత్రలో కనిపించనున్నారు.
