దీపికను ఆడిపోసుకోవడం సరైనదేనా?
ఆరు రోజుల చిత్రీకరణ తర్వాత తనకు ఒక అంతర్జాతీయ సినిమాలో ఆఫర్ రావడంతో ఆ ప్రాజెక్టు నుంచి నిర్ద్వంద్వంగా తప్పుకుంది.
By: Tupaki Desk | 25 May 2025 3:28 PM ISTదీపిక పదుకొనే అకస్మాత్తుగా ప్రభాస్- సందీప్ వంగా `స్పిరిట్` నుంచి తప్పుకోవడం చాలా విమర్శలకు తావిచ్చింది. సోషల్ మీడియాలో ఈ భామ చాలా పెద్ద నేరం చేసిందని ప్రచారం సాగుతోంది. దేశంలో ఎదురేలేని పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నే కాదని అంటుందా? భారతదేశంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ వంగాకే అడ్డు చెబుతుందా? .. ప్రస్తుతం ఫిలింకారిడార్ లో కొనసాగుతున్న చర్చ ఇది.
రోజుకు 6 గంటల పని, సెట్లో కొన్ని సౌకర్యాలు, తన స్టార్ డమ్ రేంజుకి తగ్గట్టు పారితోషికాన్ని దీపిక కోరిందని, తన నవజాత శిషువుతో సమయం గడపాలి గనుక, దర్శకుడు సందీప్ వంగా కండీషన్లకు కుదరదని దీపిక సూటిగా చెప్పేసి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టును వదులుకున్నందుకు చాలామంది దీపికను తప్పు పడుతున్నారు. సందీప్ వంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనను తాను నిరూపించుకున్న పాపులర్ డైరెక్టర్. అతడిని కాదనడం సరికాదని కూడా అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఎవరి కారణాలు వారికి ఉంటాయని కూడా మరో కోణంలో ఈ ఇన్సిడెంట్ ని కొందరు విశ్లేషిస్తున్నారు.
కొన్ని నెలల క్రితమే జన్మించిన తన బిడ్డ కోసం సమయం కేటాయించడం ఏ కన్నతల్లికి అయినా చాలా తప్పనిసరి అవసరం. దానికి ఉన్న ప్రాధాన్యత ఇక దేనికీ ఉండదు. అలాగే ఇలాంటి కీలక సమయంలో తన టైమ్ ని ఇస్తోంది కాబట్టి దానికి తగ్గట్టు భారీగా పారితోషికాన్ని దీపిక డిమాండ్ చేసిందని ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. భారీ ప్రాజెక్ట్ కాబట్టి తన కాల్షీట్లు చాలా కేటాయించాల్సి రావడం కూడా తనకు పెద్ద సమస్యాత్మకం.
అంతేకాదు దీపిక పదుకొనే ఇంతకుముందు కూడా ఓసారి ఇలానే ఓ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఆరు రోజుల చిత్రీకరణ తర్వాత తనకు ఒక అంతర్జాతీయ సినిమాలో ఆఫర్ రావడంతో ఆ ప్రాజెక్టు నుంచి నిర్ద్వంద్వంగా తప్పుకుంది. దానికి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఈ రెండు సందర్భాలు ప్రత్యేకమైనవి. రెండు ప్రత్యేకమైన కారణాలు దీపికను కఠినంగా మార్చాయనేది స్పష్ఠంగా అర్థమవుతోంది. అయినా ఇవన్నీ ఆలోచించేందుకు నెటిజనులకు సమయం ఎక్కడిది? తనకంటూ ఒక బ్రాండ్ వేసుకుని పెద్ద స్టార్ గా ఉన్న దీపిక తనకు కావాల్సిన సౌకర్యాలను కోరుకోవడం తప్పు ఎలా అవుతుంది? అని ఆలోచించారా? పద్మావత్ నటిగా 600 కోట్ల వసూళ్లను సాధించిన ఘనత దీపికకు మాత్రమే ఉందని ఎవరైనా గ్రహించారా? అయినా ఒక అమ్మ స్థానంలో ఉండి, లేదా ఒక సక్సెస్ ఫుల్ అగ్ర హీరోయిన్ హోదాలో ఉండి దీని గురించి ఆలోచించేవారికే ఇది అర్థమవుతుంది.
