ఒకసారి ఆ పాత్ర చేశాక వేరే పాత్రలు చేయలేను
దీపికా చిఖాలియా. మహారాష్ట్రకు చెందిన దీపికా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు.
By: Tupaki Desk | 4 July 2025 1:03 PM ISTదీపికా చిఖాలియా. మహారాష్ట్రకు చెందిన దీపికా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్ సీరియల్ లో దీపిక సీత పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందడంతో పాటూ ఎందరో ప్రశంసల్ని కూడా అందుకున్నారు. ఈమె తెలుగులో యమపాశం, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాల్లో కూడా నటించారు.
అయితే ఇండస్ట్రీలో ఎప్పుడు రామాయణం గురించి మాట్లాడుకున్నా రామాయణ్ లో సీతగా నటించిన దీపిక గుర్తొస్తారు. తాజాగా బాలీవుడ్ లో నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ లోని పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ కోసం దీపికను సంప్రదించారని వార్తలు రావడంతో వాటిపై ఆమె రెస్పాండ్ అయి క్లారిటీ ఇచ్చారు.
రామాయణ టీమ్ కు సంబంధించిన వారెవరూ తనను సంప్రదించలేదని, అయినా ఒకసారి రామాయణంలో సీతగా నటించాక, ఆ కథలో వేరే పాత్రలేవీ పోషించలేనని, చేయగలనో లేదో కూడా తాను చెప్పలేనని దీపిక అన్నారు. కానీ శివపురాణం, మహాభారతం లాంటి గొప్ప కథల్లో ఏదైనా ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
గతంలో కూడా దీపికా చిఖాలియా ఈ విషయంపై పలుమార్లు మాట్లాడారు. కొన్ని సీరియల్స్ లో కౌసల్య క్యారెక్టర్ కోసం మేకర్స్ తనను సంప్రదించగా, ఒప్పుకోవాలో వద్దనాలో తెలియక ఎంతగానో ఆలోచించి గందరగోళానికి గురయ్యానని ఆమె తెలిపారు. ఇక బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణ విషయానికొస్తే రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించనుండగా, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. రామాయణ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం వచ్చే డాది దీపావళికి రిలీజ్ కానుంది.
