Begin typing your search above and press return to search.

శాటిలైట్ ఢమాల్.. పుష్ప-2నే రుజువు

ఒకప్పుడు టీవీ ఛానెల్లో ఓ కొత్త సినిమా తొలిసారి టెలికాస్ట్ అవుతుంటే.. మామూలు హడావుడి ఉండేది కాదు.

By:  Tupaki Desk   |   25 April 2025 8:58 PM IST
శాటిలైట్ ఢమాల్.. పుష్ప-2నే రుజువు
X

ఒకప్పుడు టీవీ ఛానెల్లో ఓ కొత్త సినిమా తొలిసారి టెలికాస్ట్ అవుతుంటే.. మామూలు హడావుడి ఉండేది కాదు. దాని గురించి విపరీతంగా పబ్లిసిటీ చేసేవాళ్లు. యాడ్స్ మోతెక్కిపోయేవి. సినిమా ఎంత నిడివి ఉంటే.. అంత నిడివితో యాడ్స్ పడేవి. అయినా ప్రేక్షకులు ఓపిగ్గా సినిమా చూసేవాళ్లు. టీవీలో కొత్త సినిమా చూడడం అప్పట్లో గొప్ప వినోదంగా ఉండేది. కానీ తర్వాతి కాలంలో రోజులు మారిపోయాయి. ఓటీటీలు వచ్చి టీవీ ఛానెళ్లలో సినిమాలకు విలువ లేకుండా చేశాయి. నిర్మాతలు కూడా భారీగా వస్తున్న డిజిటల్ హక్కుల ఆదాయాన్ని చూసుకుని శాటిలైట్‌ను లైట్ తీసుకున్నారు. దీంతో శాటిలైట్ మార్కెట్ కుప్పకూలిపోయింది. కొత్త సినిమాలను టీవీ ఛానెళ్లలో వేస్తే చూసే జనం తగ్గిపోయారు. దీంతో టీఆర్పీలు పడిపోయాయి.

ఒకప్పుడు పెద్ద సినిమా ఏదైనా టీవీలో వస్తే 20కి తగ్గేది కాదు టీఆర్పీ. కానీ ఇప్పుడు పదికి అటు ఇటుగా ఉంటోంది. గత ఏడాది థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, ఓటీటీలో కూడా కొన్ని వారాల పాటు ట్రెండ్ అయిన ‘పుష్ప-2’ చిత్రాన్ని ఇటీవల ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేయగా.. టీఆర్పీ 12కు అటు ఇటుగా వచ్చింది. ఒకప్పుడు బన్నీ చిత్రాలకు టీఆర్పీ 20కి తగ్గేదే కాదు. ఇప్పుడు ఈ రేటింగ్ కూడా చాలా ఎక్కువే అనుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పెద్ద సినిమాలను చాలామంది థియేటర్లలోనే చూసేస్తున్నారు. అక్కడ మిస్ అయినా ఓటీటీలో బ్రేక్ లేకుండా చూసుకోవచ్చు. రిపీట్స్ వేసుకోవచ్చు. అలాంటిది ఒక పర్టికులర్ టైంలో యాడ్స్ మధ్య సినిమా చూడాలంటే ఇప్పుడు పెద్ద టాస్కే. కాబట్టే టీఆర్పీలు రావట్లేదు. శాటిలైట్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. చాలా సినిమాలను నామమాత్రపు రేట్లతో టీవీ ఛానెళ్లు కొంటున్నాయి. ఆ రేటు కూడా గిట్టుబాటు కావడం కష్టంగా ఉంది.