థియేటర్ల భవిష్యత్తుపై ఆందోళన.. అసలేం జరుగుతోంది?
మంచి కథ ఉన్నా, సమకాలీన సంభ్రమం ఉన్నా ప్రేక్షకులు థియేటర్లను ఎంతగా దూరంగా ఉంచుతున్నారో ఇది మరోసారి రుజువు చేసింది.
By: Tupaki Desk | 28 April 2025 11:12 AM ISTఈమధ్య కాలంలో థియేటర్లకు జనాలు రావడం లేదనే కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. అయితే ఎందుకు రావడం లేదనే విషయాన్ని మాత్రం అందరూ గ్రహించలేకపోతున్నారు. 100 సినిమాల్లో 10 సినిమాలు కూడా సక్సెస్ కావడం లేదనే వాదన గత 10 ఏళ్ళ నుంచి వినిపిస్తోంది. ఇది కేవలం ఒక టాలీవుడ్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీలలో ఇదే తీరు కనిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన ఇమ్రాన్ హష్మీ నటించిన గ్రౌండ్ జీరో మూవీకి దేశవ్యాప్తంగా పట్రీయాటిజం వాతావరణం ఉండగా కూడా థియేటర్లలో ఆశించిన స్పందన రాలేదు. మొదటి రోజు కేవలం 1 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రావడం పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
మంచి కథ ఉన్నా, సమకాలీన సంభ్రమం ఉన్నా ప్రేక్షకులు థియేటర్లను ఎంతగా దూరంగా ఉంచుతున్నారో ఇది మరోసారి రుజువు చేసింది. ఒకప్పుడు సినిమాలకు థియేటర్ అనేది తలపడని అనుభవంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు నిమిషాల్లో వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రేక్షకులకు ఇంట్లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ వంటి అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.. హాలీవుడ్‌లోనూ థియేటర్ల వ్యవస్థ దాదాపు ముగింపు దశలో ఉందని అన్నారు. ఈ మార్పు బలంగా మన తెలుగు పరిశ్రమలో కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద పండుగలు కాని, స్టార్ హీరోల సినిమాలు కాని వస్తే తప్ప, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా అరుదైన విషయం అయిపోయింది. సాధారణ సినిమాలు విడుదలైతే, మంచి టాక్ వచ్చినా కూడా ప్రేక్షకులు "ఓటీటీలో వస్తుంది కదా" అని ఎదురుచూస్తున్నారు.
ఇలా కొన్ని వారాల్లోనే ఓటీటీలో విడుదల అవ్వడం వల్ల థియేటర్ కాలక్షేపం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరో పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు ఓటీటీలు కూడా ఫ్రైడే రిలీజ్ ట్రెండ్‌ను పాటిస్తున్నాయి. థియేటర్ల సినిమాలతో డైరెక్ట్‌గా పోటీ పడడం వల్ల, ఒకే రోజు కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు వచ్చి ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కనీసం ఓటీటీ విడుదలలను సోమవారం నాటి ప్లాన్ చేస్తే, థియేటర్ సినిమాలకు మూడు రోజుల గడువు ఇచ్చినట్లయ్యేది. కానీ అలాంటి చర్యలు లేవు.
ఈ పరిస్థితుల్లో థియేటర్ వ్యవస్థ మరింత సంక్షోభంలోకి నెట్టబడే ప్రమాదం ఉంది. అసలు వ్యాపారం మొత్తం ఓటీటీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడే రోజులు రాబోతున్నాయి. ఒకప్పుడు థియేటర్ అనేది సంబరంగా ఉండేది. కానీ ఇప్పుడు, ఓటీటీలు ప్రతి ఇంట్లో ఒక సినిమాహాల్‌ను సృష్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమా ప్రేమికులు థియేటర్‌కు తిరిగి వచ్చే రోజులు మళ్లీ రావాలంటే, పరిశ్రమలో పెద్ద మార్పులు అవసరమే. లేదంటే.. త్వరలోనే థియేటర్‌లను గుర్తు చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి తప్పదని అనిపిస్తోంది.
