టాప్ హీరోయిన్ చైర్ ఇంకా ఖాళీగానే?
దశాబ్దం క్రితం టాప్ హీరోయిన్ అంటే? కొంత మంది భామల పేర్లు ప్రముఖంగా కనిపించేవి.
By: Srikanth Kontham | 5 March 2026 7:00 PM ISTదశాబ్దం క్రితం టాప్ హీరోయిన్ అంటే? కొంత మంది భామల పేర్లు ప్రముఖంగా కనిపించేవి. నయనతార, త్రిష, సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, అనుష్క ఇలావీరంతా టాలీవుడ్ లో టాప్ పోజిషన్ లో కొనసాగిన భామలే. తెలుగు పరిశ్రమలో ఎంతో స్థిరంగా సినిమాలు చేసిన నాయికలు. ఎంతో మంది కొత్త భామలొచ్చిన వారి పోటీని తట్టుకుని మార్కెట్ లో నిలబడి సత్తా చాటిన వారు. ఇతర భాషల్లో సినిమాలు చేసినా ప్రధానంగా టాలీవుడ్ లోనే ఫోకస్ అయ్యే ప్రయత్నం నిరంతరం కనిపించేది. అలా వారంతా టాలీవుడ్ లో ఎంతో ప్రత్యేకంగా నిలాచరు.
కానీ కొంత కాలంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ చైర్ మాత్రం ఖాళీగానే ఉందన్నది కాదనలేని నిజం.
ఈ పదేళ్ల కాలంలో ఎవరూ ఆస్థానాన్ని అందుకోలేకపోయారు. సాయి పల్లవి, రష్మికా మందన్నా, కీర్తి సురేష్ లాంటి వారు ఆస్థానాన్ని అందుకుంటారని మొన్నటి వరకూ అంచనాలుండేవి. కానీ వారంతా టాలీవుడ్ నుంచి డీవియేట్ అవుతున్నట్లే సన్నివేశం కనిపిస్తుంది. సాయి పల్లవి ఏనాడు టాలీవుడ్ పై పూర్తి ఫోకస్ తో సినిమాలు చేసింది లేదు. ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ సద్వినియోగం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది.
పైగా పాత్రల విషయంలో సెలక్టివ్ గా ఉండటం..దర్శకులకు తలకు మించిన భారంగా మారింది. ఈ మధ్య కాలంలో పూర్తిగా హిందీ సినిమాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తోంది. అక్కడ యువ హీరోలతోనైనా నటించడానికి సిద్దంగా ఉంటుంది గానీ టాలీవుడ్ సీనియర్ స్టార్స్ కి మాత్రం అంత ఉత్సాహంగా ఒకే చెప్పడం లేదు. నేషనల్ క్రష్ గా నీరాజనాలు అందుకుంటోన్న రష్మికా మందన్నా కూడా డబుల్ గేమ్ ఆడుతోంది. టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగినా? తన ట్యాలెంట్ ఇక్కడికే పరిమితం కాదంటూ బాలీవుడ్ పైనా దృష్టి పెట్టింది. అక్కడకు వెళ్లినప్పటి నుంచి హిందీ సినిమాలపై ఫోకస్ మళ్లించింది.
అలాగని టాలీవుడ్ కి పూర్తిగా దూరంగా కాలేదు. కొన్ని ఛాన్సులను హిందీ సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా వదులుకోవాల్సి వస్తోంది. పూజాహెగ్డే ఒకానొక దశలో టాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది అనుకున్నారు. కానీ అమ్మడు యాటిట్యూడ్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా పక్కనబెట్టింది. శ్రుతిహాసన్, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి లాంటి వారు చాలా మంది సినిమాలు చేసారు కానీ నిలదొక్కుకోలేదు. ఈ మధ్య కాలంలోనే జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ లాంటి వారు లాంచ్ అయ్యారు. కానీ వీళ్లు ఒకే భాషపై ఫోకస్ పెట్టడం లేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పనిచేయడం అన్నట్లే కనిపిస్తున్నారు. ఇలాగైతే ఇప్పట్లో టాలీవుడ్ లో హీరోయిన్ టాప్ చైర్ ని అందుకోవడం కష్టం.
