Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : డియర్

తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన జి.వి.ప్రకాష్ కుమార్.. నటుడు కూడా. అతను ఇప్పటికే రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడు.

By:  Tupaki Desk   |   12 April 2024 12:51 PM GMT
మూవీ రివ్యూ : డియర్
X

'డియర్' మూవీ రివ్యూ

నటీనటులు: జి.వి.ప్రకాష్ కుమార్-ఐశ్వర్య రాజేష్-రోహిణి-కాళి వెంకట్ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: జగదీష్ సుందరమూర్తి

నిర్మాతలు: వరుణ్ త్రిపురనేని-అభిషేక్ రామిశెట్టి-పృథ్వీరాజ్

రచన-దర్శకత్వం: ఆనంద్ రవిచంద్రన్

తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన జి.వి.ప్రకాష్ కుమార్.. నటుడు కూడా. అతను ఇప్పటికే రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడు. అతడి కొత్త చిత్రం 'డియర్' ఈ రోజే తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (జి.వి.ప్రకాష్ కుమార్) ఒక న్యూస్ ప్రెజెంటర్. ఒక పెద్ద ఛానెల్లో చేరి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి పేరు సంపాదించాలన్నది అతడి ఆశ. అతను దీపిక (ఐశ్వర్య రాజేష్)ను పెళ్లి చూపుల్లో ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఐతే దీపికకు గురకపెట్టే సమస్య ఉంటుంది. ఈ విషయం చెప్పకుండానే అర్జున్ ను పెళ్లి చేసుకుంటాడు. కానీ చిన్న సౌండ్ వచ్చినా నిద్ర మేల్కొనే అర్జున్.. పెళ్లి తర్వాత దీపిక సమస్య తెలిసి బెంబేలెత్తిపోతాడు. ఈ విషయంలో సర్దుకుందామని ప్రయత్నించినా కుదరదు. దీంతో దీపిక సమస్య వల్ల ఇద్దరూ దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ జంట ఏం చేసింది.. చివరికి ఏమైంది.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక కొత్త పాయింటుతో తెర‌కెక్కిన సినిమాను చూసిన‌పుడు ప్రేక్ష‌కుల‌కు ఒక మంచి అనుభూతి క‌లుగుతుంది. కానీ మ‌ళ్లీ అదే పాయింటు మీద ఇంకొక‌రు సినిమా తీస్తే.. మొద‌టి సినిమా కంటే బాగా తీసినా స‌రే ఆల్రెడీ ఇది చూసేశాం క‌దా అనే నిట్టూర్పు త‌ప్ప‌దు. అలాంటిది ముందు చూసిన సినిమాలో ఎంతో బాగా డీల్ చేసిన పాయింటుని త‌ర్వాత వ‌చ్చిన చిత్రంలో సాధార‌ణంగా చూపిస్తే ఎలా ఉంటుంది? స‌ంగీత ద‌ర్శ‌కుడు జి.వి.ప్ర‌కాష్ కుమార్ హీరోగా.. తెలుగమ్మాయి అయిన త‌మిళ న‌టి ఐశ్వ‌ర్య రాజేష్ జంట‌గా రూపొందిన డియ‌ర్ ఈ కోవ‌కు చెందిన సినిమానే. ప్ర‌ధాన పాత్ర‌ధారికి గుర‌క స‌మ‌స్య ఉంటే.. త‌న‌తో బెడ్ రూంను పంచుకునే వ్య‌క్తి ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఎంతో హృద్యంగా గుడ్ నైట్ అనే సినిమాలో చూపించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలిచింది టీం. డియ‌ర్ సైతం స‌రిగ్గా ఇదే కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన చిత్రం. గుడ్ నైట్ మూవీలో హీరోకు స‌మ‌స్య ఉంటే.. ఇక్క‌డ క‌థానాయిక‌కు ఆ ఇబ్బంది ఉన్న‌ట్లు చూపించారు. పైకి చిన్న స‌మ‌స్య‌లా క‌నిపించే ఈ విష‌యాన్ని గుడ్ నైట్ మూవీలో ఎంతో ఎఫెక్టివ్ గా చూపించి ప్రేక్ష‌కుల్లో ఒక ఎమోష‌న్ తీసుకొస్తే.. డియ‌ర్ మూవీలో మాత్రం ఏమాత్రం ఫీల్ లేని విధంగా ప్లాట్ పాయింట్ ను డీల్ చేసి ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు ద‌ర్శ‌కుడు ఆనంద్ ర‌విచంద్ర‌న్.

గుడ్ నైట్ మూవీతో పోలిక సంగ‌తి ప‌క్క‌న పెట్టి ఓపెన్ మైండ్ తో చూసినా డియ‌ర్ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌దు. క‌థానాయిక గుర‌క స‌మ‌స్యను వినోదానికి ఉప‌యోగించుకోవ‌డంతో పాటు దాని మీద ఎమోష‌న్ కూడా ర‌న్ చేయొచ్చు. కానీ రెండు విష‌యాల్లోనూ ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. హీరోయిన్ త‌న స‌మ‌స్య‌ను దాచి పెట్టి హీరోను పెళ్లి చేసుకోవ‌డం.. అత‌ను పెళ్లి త‌ర్వాత విష‌యం తెలిసి కంగారు ప‌డ‌డం.. ఈ ట్రాక్ అంతా కూడా ఒక మోస్త‌రుగా అనిపిస్తుంది. ఆరంభంలో కొంత ఆస‌క్తిక‌రంగా అనిపించాక డియ‌ర్ ట్రాక్ త‌ప్పుతుంది. గుర‌క వ‌ల్ల ఇద్ద‌రికీ ఇబ్బందిగా మార‌డంతో దాన్ని అధిగ‌మించ‌డానికి హీరో హీరోయిన్ క‌లిసి చేసే ప్ర‌య‌త్నాలు కూడా ఏమంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌వు. మొక్కుబ‌డిగా ఓ ప‌రిష్కారం ట్రై చేయ‌డం.. ఆ త‌ర్వాత స‌మ‌స్య ఇంకా పెద్దది కావ‌డం..దీంతో ఇద్ద‌రూ విడిపోవాల్సిన ప‌రిస్థితి రావ‌డం.. ఇలా క‌థ‌నం రాను రాను అనాస‌క్తిక‌రంగా మారుతుంది. న్యూస్ ప్రెజెంట‌ర్ అయిన హీరో.. ఒక పెద్ద ఇంట‌ర్వ్యూ చేయ‌బోతూ వెళ్లి టాయిలెట్లో నిద్ర పోవ‌డం అన్న‌ది మ‌రీ ఇల్లాజిక‌ల్ గా అనిపిస్తుంది.

ద్వితీయార్ధంలో త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుని హీరో హీరోయిన్లు ఎలా ఒక్క‌ట‌వుతారా అని చూస్తాం. హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలిశాక దీని చుట్టూ ఎమోష‌న్ కొంత ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. కానీ ఈ డ్రామా మీద క‌థను న‌డిపించ‌కుండా.. క‌థ‌ను ఇంకెక్క‌డికో తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. హీరో త‌ల్లిదండ్రులు క‌ల‌ప‌డం మీద న‌డిచే క‌థ‌నం మ‌రింత అనాస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య ఎమోష‌న్ అంతా ప‌క్క‌కు వెళ్లిపోయి ఈ వ్య‌వ‌హారం మీద క‌థ న‌డ‌వ‌డంతో డియ‌ర్ పూర్తిగా ప‌క్క‌దారి ప‌ట్టిన ఫీలింగ్ క‌లుగుతుంది. ముగింపు కోసం భారంగా ఎదురు చూడ‌డం త‌ప్ప ప్రేక్ష‌కుడు చేసేదేమి ఉండ‌దు. గుడ్ నైట్ చూసిన వాళ్లు డియ‌ర్ మూవీతో చాలా త్వ‌ర‌గా డిస్క‌నెక్ట్ అయిపోతారు. అది చూడ‌ని వాళ్ల‌కు కూడా ఇది కొత్త‌గా పంచే అనుభూతి ఏమీ ఉండ‌దు. ఒక చిన్న పాయింట్ మీద ఎంత చ‌క్క‌టి సినిమా తీయ‌వ‌చ్చో గుడ్ నైట్ ఉదాహ‌ర‌ణ‌గా నిలిస్తే.. అదే పాయింటుని ఎంత సాధార‌ణంగా డీల్ చేశారో చెప్ప‌డానికి డియ‌ర్ రుజువుగా నిలుస్తుంది. డియ‌ర్ టీం ఒక మంచి అవ‌కాశాన్ని వేస్ట్ చేసుకుంది.

నటీనటులు:

జి.వి.ప్ర‌కాష్ కుమార్ కు న‌ట‌న మీద చాలా ఆస‌క్తి ఉంది కానీ.. అత‌ను చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు మామూలుగా అనిపిస్తాయి. త‌న న‌ట‌నా అంతే. ఎక్కువ‌గా చికాకు పెట్టే క్యారెక్ట‌ర్లు చేసే జి.వి. డియ‌ర్ లో కూడా ఆ టైపు పాత్రే చేశాడు. ఏ ద‌శ‌లోనూ హీరో పాత్ర‌తో క‌నెక్ట్ కాలేం. అత‌ను త‌న న‌ట‌న‌తో కూడా ప్రేక్ష‌కుల‌ను అంతగా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ఎమోష‌న్ల‌ను పండించ‌లేక‌పోయాడు. ఐశ్వ‌ర్య రాజేష్ మాత్రం మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. త‌న పాత్ర‌.. న‌ట‌న సినిమాను కొంత డ్రైవ్ చేశాయి. ఆమె భావోద్వేగాల‌ను బాగా పండించింది. రోహిణి త‌న‌కు అల‌వాటైన త‌ల్లి పాత్ర‌లో బాగానే చేసింది. హీరో అన్న‌గా కాళి వెంక‌ట్ ఓకే. తండ్రి పాత్ర‌లో చేసిన న‌టుడు కూడా బాగానే చేశాడు.

సాంకేతిక వర్గం:

జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం ఓ మోస్త‌రుగా అనిపిస్తుంది. పాట‌లు సోసోగా సాగిపోయాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా అయితే లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే సాగింది. కొన్ని చోట్ల లేని ఎమోష‌న్ తీసుకురావ‌డానికి ఆర్ ఆర్ ద్వారా ట్రై చేశాడు జి.వి. జగదీష్ సుందరమూర్తి ఛాయాగ్ర‌హ‌ణం ప‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ఆనంద్ ర‌విచంద్ర‌న్ ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగుంది. బ‌హుశా గుడ్ నైట్ మూవీ రావ‌డానికి ముందే అత‌నీ సినిమాను మొద‌లుపెట్టి ఉండొచ్చు. అది రిలీజ్ అయ్యాక అయినా క‌థ‌నాన్ని మ‌రింత ఎఫెక్టివ్ గా.. ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేయాల్సింది. వినోదం.. ఎమోష‌న్లు పండించ‌డానికి స్కోప్ ఉన్న క‌థే అయినా.. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు త‌న నైపుణ్యాన్ని చూపించ‌లేక‌పోయాడు.

చివరగా: కాన్సెప్ట్ ఓకే.. ఎమోష‌న్ వీకే

రేటింగ్- 2.25/5