Begin typing your search above and press return to search.

కారులో ప్రముఖ నటుడి మృతదేహం!

కారు వద్దకు వెళ్లి డోర్ తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది.

By:  Tupaki Desk   |   19 Nov 2023 3:46 PM GMT
కారులో ప్రముఖ నటుడి మృతదేహం!
X

ప్ర‌ముఖ మలయాళ నటుడు వినోద్ థామస్ (47) కన్నుమూశారు. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`లో అత‌డు ప్రత్యేక పాత్రలో కనిపించారు. అదే సినిమాను తెలుగులో `భీమ్లా నాయక్` పేరుతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు.

గత రాత్రి (నవంబర్ 18) కేరళలోని కొట్టాయం జిల్లాలోని బంబడి ప్రాంతంలోని హోటల్ పార్కింగ్ స్థలంలో చాలా సేపు కారు అనుమానాస్పదంగా ఆగి ఉంది. హోటల్ సిబ్బంది ఆ కార్ ని గమనించారు. కారు వద్దకు వెళ్లి డోర్ తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. వెంటనే తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. వారు కారును పరిశీలించి మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతడు మలయాళ నటుడు వినోద్ థామస్ అని తేలింది.

అయ్యప్పనుం కోషియం, నాతోలి ఏరు ఒకిత మీనాళ్ల చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించిన వినోద్ ఆక‌స్మిక మృతి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ ఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వినోద్ థామస్‌ను పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు ప్రకటించారు. మృతికి గల క‌చ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే వినోద్ థామస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. ఈ కేసులో వినోద్ థామస్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.