'డీసీ' మూవీ రివ్యూ
దేవదాస్ (లోకేష్ కనకరాజ్) తన తల్లిని చంపిన వాళ్లను చంపి చిన్నతనంలోనే జైలుకి వెళ్తాడు. తిరిగొచ్చాక రౌడీగా మారిన అతను అనేక నేరాల్లో భాగం అవుతాడు.
By: Tupaki Desk | 7 Aug 2026 2:40 PM IST'డీసీ' మూవీ రివ్యూ
నటీనటులు: లోకేష్ కనకరాజ్ - వామిక గబ్బి - సంజన కృష్ణమూర్తి - కస్తూరిరాజా తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: ముకేష్
నిర్మాత: కళానిధి మారన్
రచన - దర్శకత్వం: అరుణ్ మాదేశ్వరన్
ఖైదీ.. విక్రమ్.. లియో.. కూలీ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన చిత్రం.. డీసీ. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ - తెలుగు భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: దేవదాస్ (లోకేష్ కనకరాజ్) తన తల్లిని చంపిన వాళ్లను చంపి చిన్నతనంలోనే జైలుకి వెళ్తాడు. తిరిగొచ్చాక రౌడీగా మారిన అతను అనేక నేరాల్లో భాగం అవుతాడు. పోలీసుల ఆయుధాలను కొల్లగొట్టి.. ఒక ఎస్ఐని చంపిన కేసులో తనను వెతుకుతుండడంతో తన గ్యాంగుతో కలిసి అతను పారిపోతాడు. ఈ ప్రయాణంలో అతడికి వేశ్య అయిన చంద్ర (వామిక గబ్బి) పరిచయం అవుతుంది. ఈ పరిచయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.. ఇంకో పక్క దేవదాస్ కోసం పోలీసుల గాలింపు ఎక్కడిదాకా వచ్చింది.. చివరికి దేవదాస్ - చంద్రల జీవితాలు ఏ తీరానికి చేరాయి అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ: సినిమా అంత గొప్పగా లేకపోయినా పాటల వల్ల ఆడేయడం ఒకప్పటి రోజుల్లో జరిగేది. చరిత్రలో అందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అలాంటి మ్యాజిక్స్ జరగట్లేదు. అందుకు మారిన పరిస్థితులు.. ప్రేక్షకుల అభిరుచి కారణం. ఈ రోజుల్లో కేవలం మ్యూజిక్ వల్ల ఒక సాధారణమైన సినిమా కూడా మెరుగ్గా అనిపించడం చాలా అరుదే. ఆ అరుదైన జాబితాలో ‘డీసీ’ నిలుస్తుంది. ఈ సినిమా కథ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఒక రౌడీ తన గ్యాంగుతో కలిసి ఒక నేరం చేసి పారిపోవడం.. అతణ్ని పోలీసులు వెంబడించడం.. రెండు వర్గాల మధ్య పోరాటం.. ఇలా చివరిదాకా ఒకటే పాయింట్ మీద నడుస్తుంది ‘డీసీ’ కథ. మధ్యలో ఈ కథలోకి హీరోయిన్ ఎంటరవుతుంది. ఇద్దరి మధ్య కూడా పెద్ద పెద్ద సీన్లేమీ ఉండవు. సినిమా అంతా ఒకరి మీద ఒకరు ఎటాక్ చేయడం.. కాల్పులు.. కత్తిపోట్లు.. రక్తపాతమే.. అంతకుమించి ఏమీ ఉండదు. అయినా సరే.. ‘డీసీ’ బోర్ కొట్టకుండా సాగిపోయేలా చేయడంలో అరుణ్ మాదేశ్వరన్ టేకింగ్ కొంత పాత్ర పోషిస్తే.. మేజర్ క్రెడిట్ అనిరుధ్ రవిచందర్ కే చెందుతుంది. ఏదో యజ్ఞం చేస్తున్నట్లుగా మామూలు బీజీఎం కొట్టలేదు అనిరుధ్ ఈ సినిమా కోసం. కేవలం బీజీఎం కోసం సినిమా చూడొచ్చు అని చెప్పే స్థాయిలో అతను విజృంభించాడు. సింపుల్ కథాకథనాలు.. పరిమిత పాత్రలతో ‘డీసీ’ కంటెంట్ పరంగా యావరేజ్ అనిపిస్తుంది కానీ.. అనిరుధ్ బీజీఎం ఈ సినిమా అనుభూతిని పెంచుతుంది.
సినిమాలో ఒకే రకమైన సన్నివేశం రెండోసారి చూస్తే చిరాకొస్తుంది. కానీ ‘డీసీ’ సినిమాలో 70-80 శాతం సీన్లు ఒకేలా అనిపించినా పెద్దగా ఫ్రస్టేట్ అవ్వం. హీరో గ్యాంగ్ పోలీసుల మీద ఎటాక్ చేయడం.. లేదంటే పోలీసులు తన గ్యాంగ్ మీద దాడికి దిగడం.. సినిమా అంతా మళ్లీ మళ్లీ ఇవే సీన్లు చూస్తాం. ఒకసారి కత్తులు విజృంభిస్తే.. ఇంకోసారి తుపాకీల మోత మోగుతుంది. కానీ ఈ ఎటాక్ అన్నది మాత్రం కామన్. కానీ సన్నివేశాల్లో కనిపించని వైవిధ్యాన్ని.. తన బీజీఎంలో చూపించాడు అనిరుధ్. విపరీతమైన హింసతో ముడిపడ్డ సన్నివేశాలను రొమాంటిసైజ్ చేస్తూ అతను ఇచ్చిన బీజీఎం థీమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు అనిరుధ్ తన బీజీఎంతో. ఇక దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ హింసాత్మక సన్నివేశాలను కూడా పొయెటిక్ స్టయిల్లో తీశాడు. వయొలెన్స్ చాలా సన్నివేశాల్లో హద్దులు దాటిపోయినా సరే.. వేరే సినిమాల్లో కలిగే జుగుప్సాకరమైన భావన ఇందులో కలగదు. చాలా వరకు వయొలెన్సుకి బలమైన రీజన్ ఉండడంతో పాటు టేకింగ్-బీజీఎం చాలా స్టైలిష్ గా సాగడం వల్ల ఆ సీన్లు వర్కవుట్ అయ్యాయి.
దాదాపు రెండున్నర గంటల నిడివి ఉన్న ‘డీసీ’లో ప్రేక్షకులు కొంచెం కొత్తదనం ఫీలయ్యేది హీరోయిన్ పాత్ర ప్రవేశంతోనే. వేశ్యాగృహాల్లో మగ్గే అమ్మాయిల బ్యాక్ స్టోరీలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఇందులో కూడా భిన్నమేమీ కాదు. కాకపోతే హీరోయినే వేశ్య కావడం.. ఆమెలోని భావోద్వేగ కోణాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేయడం.. వామిక బాగా నటించడం.. తనతో ముడిపడ్డ కొన్ని క్రేజీ సీన్లు-డైలాగుల వల్ల సినిమాలో ఆ పాత్ర ప్రత్యేకతను చాటుకుంది. ఇక గ్యాంగ్ స్టర్ పాత్రలో లోకేష్ కనకరాజ్ ను చూడడం కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అంతర్ముఖుడైన రౌడీ పాత్రకు అతను సూటయ్యాడు. ఆ పాత్ర కూడా బాగానే పండింది. ఈ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ కూడా వర్కవుట్ అయింది. ఈ రెండు ప్రధాన పాత్రలే సినిమాను తమ భుజాల మీద నడిపించాయి. ఎక్కువ నాటకీయత లేకుండా పాత్రలను.. సన్నివేశాలను మలిచిన విధానం బాగుంది. ఐతే కథ ఎక్కడా సర్ప్రైజింగ్ గా అనిపించదు. సినిమాలో ఎక్కువ పరిణామాలేమీ జరిగిపోవు. ఒకే లైన్ మీద మామూలుగా సాగిపోతుంటుంది. కానీ రొటీన్ సీన్లనే సాంకేతిక హంగులు జోడించి అందంగా ప్రెజెంట్ చేయడం వల్ల వాటితో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కేవలం స్టైలిష్ టేకింగ్-బీజీఎం కోసం.. ప్రధాన పాత్రధారుల పెర్ఫామెన్స్ కోసం ‘డీసీ’పై ఒక లుక్కేయొచ్చు.
నటీనటులు: లోకేష్ కనకరాజ్ నటుడిగా అదరగొట్టేశాడు అని చెప్పలేం కానీ.. దేవదాస్ పాత్రకు సూటయ్యాడు. పెద్దగా హావభావాలు పలికించకుండా సీరియస్ గా కనిపించే పాత్రలో అతను ఒదిగిపోయాడు. తన గెటప్.. బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు బాగా కుదిరాయి. సినిమాలో షో స్టీలర్ అంటే వామిక గబ్బినే. కథలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా సరే.. అదిరిపోయే పెర్ఫామెన్సుతో ప్రేక్షకులను కట్టిపడేసింది వామిక. ఇలాంటి పాత్రను అందరూ ఒప్పుకోరు. ఒప్పుకున్నా నటనతో మెప్పించలేరు. కానీ వామికలోని పెర్ఫామర్ ఈ పాత్రను మరో స్థాయిలో నిలబెట్టింది. కాసేపే కనిపించిన సంజన కృష్ణమూర్తి తన అందంతో ఆకట్టుకుంది. హీరోను వెంటాడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేసిన నటుడు బాగా చేశాడు. హీరో గ్యాంగులోని పాత్రధారులు.. అలాగే సేట్ క్యారెక్టర్ చేసిన నటుడు కూడా ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘డీసీ’కి తిరుగులేదు. ముందే అన్నట్లు అనిరుధ్ తన బీజీఎంతో ఈ సినిమాకు ప్రాణం పోశాడు. అతడి కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రాల్లో ఇదొకటి. అంతగా డ్యూటీ చేశాడతను. ముకేశ్ ఛాయాగ్రహణం కూడా చాలా బాగా సాగింది. సన్ పిక్చర్స్ ప్రమాణాలకు తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. అరుణ్ మాదేశ్వరన్ రైటింగ్ కంటే టేకింగ్ ఆకట్టుకుంటుంది. ఒక మామూలు కథనే అందంగా తెరపై ప్రెజెంట్ చేశాడు. దర్శకుడి అభిరుచిని చాటే సన్నివేశాలు చాలానే ఉన్నాయీ సినిమాలో. ముఖ్యంగా తొలిసారి తన గది దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిన వేశ్య భావోద్వేగాన్ని చూపించే సన్నివేశాల్లో దర్శకుడి మార్కు కనిపిస్తోంది.
చివరగా: డీసీ.. అనిరుధ్ షో
రేటింగ్ - 2.5/5
