Begin typing your search above and press return to search.

'దురంధర్‌'లో దావూద్ సినీ లింకులు ఎక్కడ?

మరోవైపు కుల్ భూషణ్ యాదవ్ కేసు చాలా ఆస‌క్తిక‌రమైన‌ది. పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నట్లుగా యాదవ్ గూఢచారి కాదు. అత‌డు ఇరాన్‌లో నేవీ ప్రాజెక్టుపై పనిచేసారు.

By:  Sivaji Kontham   |   26 March 2026 12:00 PM IST
దురంధర్‌లో దావూద్ సినీ లింకులు ఎక్కడ?
X

`దురంధర్` ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ఎలాంటి రాజ‌మ‌ర్యాద‌లు చేసేదో చూపించారు. దావూద్ భార‌త‌దేశాన్ని ఎలా అత‌లాకుత‌లం చేయాల‌నుకున్నాడు? అయితే అత‌డికి ముంబై సినీ పరిశ్రమతో ఉన్న చీకటి సంబంధాలను ఈ సినిమాలో ఎందుకు ప్రస్తావించలేదనే ప్రశ్న అలానే ఉంది. ముఖ్యంగా దావూద్ - మందాకినీ ఎఫైర్ ను కూడా చూపించే అవకాశం ఉన్నా, మేకర్స్ ఆ దిశగా వెళ్లకపోవడం గమనార్హం. సినీ ప్రముఖులతో దావూద్‌కు ఉన్న సంబంధాలను కనీసం చర్చించనేలేదు.

రాజకీయ కోణంలో చూస్తే దావూద్ ఇబ్రహీంను పట్టుకునే లేదా హతం చేసే గొప్ప అవకాశం భారత్‌కు లభించినా అప్పట్లో మహారాష్ట్ర రాజకీయ నేత ఒక‌రు అతడిని కాపాడారనే వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పటి మహారాష్ట్ర మంత్రి తో మాఫియా లింకుల‌పై ప్ర‌చారం సాగింది. అండర్ వరల్డ్ - రాజకీయాల మధ్య ఉన్న అపవిత్ర కలయిక వల్లనే దావూద్ తప్పించుకోగలిగాడనే వాదనలు ఉన్నాయి. దేశ భద్రత కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయనే విశ్లేష‌ణ‌లు సాగాయి. అయితే ఈ అంశాన్ని చాలా టోన్ డౌన్ చేస్తూ సినిమాలో చూపించారు.

మరోవైపు కుల్ భూషణ్ యాదవ్ కేసు చాలా ఆస‌క్తిక‌రమైన‌ది. పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నట్లుగా యాదవ్ గూఢచారి కాదు. అత‌డు ఇరాన్‌లో నేవీ ప్రాజెక్టుపై పనిచేసారు. అయితే అక్కడ ఒక టెర్రర్ గ్రూప్ ఆయనను కిడ్నాప్ చేసి ఐఎస్ఐకి అప్పగించిందని, ఇరాన్ భూభాగంలోనే ఆయన అరెస్ట్ జరిగిందని కూడా ప్ర‌చారం ఉంది. కుల్ భూషణ్ ఒక సామాన్య భారతీయుడు మాత్ర‌మే.. అయినా పాకిస్తాన్ కావాలనే అత‌డిపై గూఢచారి ముద్ర వేసింది.

అంతర్జాతీయ గూఢచర్య రాజకీయాల విష‌యానికి వ‌స్తే... అమెరికాలో వికాస్ యాదవ్ అరెస్ట్.. భారత్‌లో జరిగిన ఒక రహస్య ఆపరేషన్ ని కూడా `దురంధ‌ర్`లో ఉప‌యోగించుకున్నారు. ఇటీవ‌ల భార‌త‌దేశంలోని మిజోరాంలో ఉక్రెయిన్ వాసులతో కలిసి స్పైయింగ్ చేస్తున్న ఒక అమెరికన్ వ్యక్తిని భారత దర్యాప్తు సంస్థలు పట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘటన రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉత్కంఠకు దారితీసింది. నిఘా వర్గాల మధ్య జరిగే లోతైన వ్యూహాలకు ఇది నిదర్శనం.

ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలోనే ఢిల్లీలోని అమెరికన్ అంబాసిడర్ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిసార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ``మా మనిషిని మీరు పట్టుకున్నారు.. మీ మనిషి మా దగ్గర ఉన్నాడు`` అనే రీతిలో అమెరికా- భార‌త రాయ‌భారుల మ‌ధ్య‌ చర్చలు జరిగాయని.. చివరకు ఇద్దరు వ్యక్తులను పరస్పరం మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా తెలుస్తోంది. ఇలాంటి తెరవెనుక వాస్తవాలు జియో పాలిటిక్స్‌లో ఎంతటి కీలక పాత్రను పోషిస్తాయో వింటుంటేనే ఆస‌క్తి రేకెత్తుతోంది.