ఆ ఇద్దరిని డెస్టినీ వెంటాడుతోందా?
ఎంతటి వారైన విధి ఆడే వింతనాటకం ముందుమోకరిల్లాల్సిందే. విధికి ఎవరూ అతీతులు కాదు.
By: Tupaki Desk | 24 Dec 2025 8:00 PM ISTఎంతటి వారైన విధి ఆడే వింతనాటకం ముందుమోకరిల్లాల్సిందే. విధికి ఎవరూ అతీతులు కాదు. టైమ్ వచ్చింది కదా అని అన్నీ చేస్తూ వెళుతుంటే డెస్టినీ కచ్చితంగా ఏదో ఒక రోజు వారి ఆటకట్టిస్తుంది. సాండల్‌వుడ్, మల్లూవుడ్ హీరోల విషయంలో ఇదే జరుగుతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆ హీరోలు మరెవరో కాదండోయ్ కన్నడ హీరో దర్శన్, మలయాళ హీరో దిలీప్. ఈ ఇద్దరు హీరోలకు ఆయా భాషల్లో మంచి పేరుంది.
విభిన్నమైన సినిమాలతో హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. స్టార్‌లుగా ఎదిగారు. కన్నడ ఇండస్ట్రీలో మాస్ హీరోగా దర్శన్‌కు ప్రత్యేకమైన గుర్తింపుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచిన సినిమాలని కన్నడలో రీమేక్‌లుగా చేసి దర్శన్ హీరోగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. నటుడు అంబరీష్, సుమలత దంపతులకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన దర్శన్ ఒకే ఒక్క తప్పుతో పాతాళానికి పడిపోయాడు. అభిమాని రేణు స్వామి హత్య కేసులో ఇరుక్కుని ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
ప్రియురాలు పవిత్ర గౌడకు అభిమాని రేణు స్వామి అసభ్యకర మెసేజ్‌లు పంపించాడనే కోపంతో అతన్ని అత్యంత పాశవికంగా హత్య చేయించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న దర్శన్ ఇప్పడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు. కన్నడ నాట పెను సంచలనం సృష్టించిన ఈ వ్యవహరం దర్శన్ కెరీర్ చివరి అంకాని చేర్చింది అనడంలో సందేహం లేదు. ఈ కేసులో ఇరుక్కున్న దర్శన్ జైలుకు రావడానికి ముందే తను అంగీకరించిన సినిమాలని పూర్తి చేశాడు.
ఈ నేపథ్యంలోనే దర్శన్ నటించిన `ది డెవిల్` మూవీ విడుదలైంది. దర్శన్ డ్యుయెల్ రోల్‌లో నటించిన ఈ మూవీని ప్రేక్షకులు తీరస్కరించి షాక్ ఇచ్చారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో కన్నడ నాట దర్శన్ పై కామెంట్‌లు వినిపిస్తున్నాయి. డెస్టినీ వెంటాడుతోందని, ఇక అతని కెరీర్ ముగిసినట్టేనని కామెంట్‌లు చేస్తున్నారు. ఇదే తరహాలో మలయాళ హీరో దిలీప్‌పై కూడా కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో దిలీప్‌కు హీరోగా తిరుగులేని గుర్తుంపున్న విషయం తెలిసిందే.
దిలీప్ నటించిన చాలా వరకు సినిమాలు తెలుగులో రీమేక్ అయి సూపర్ హిట్ అనిపించుకున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి మంచి పేరుతెచ్చుకున్న దిలీప్ ఒకే ఒక్క సంఘటనతో అందరి దృష్టిలో బ్యాడ్ ఫెలో అయిపోయాడు. నటి మంజువారియర్‌ని వివాహం చేసుకుని ఆ తరువాత తనతో విడిపోయిన దిలీప్ మలయాళం, తమిళం, తెలుగుసినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ కు సంబంధించిన ఓ సంఘటన కారణంగా వార్తల్లో నిలిచాడు.
2017లో కేరళలోని కొచ్చీ సమీపంలో హీరోయిన్ షూటింగ్ ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా కొంత మంది దుండగులు ఆమె కారులోకి చొరబడి తనని కిడ్నాప్ చేశారు. రెండు గంటలపాటు కదులుతున్న కారులోనే ఆమెని లైంగిక వేధింపులకుగురి చేశారు. వీడియోలు తీశారు. ఈ కేసులో ప్రదాన నిందితుడుతో సహా పర్సర్ సునీతో కలిపి పది మందిని అరెస్ట్ చేశారు. హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల వెనుక దిలీప్ కుట్రకోణం ఉందని ఆరోపణలు రావడంతో దిలీప్‌ని కూడా అరెస్ట్ చేశారు. 2017లో కేరళ కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
2017 నుంచి కొనసాగిన ఈ కేసు 2025 డిసెంబర్ 8న కోర్టు తుది తీర్పుని వెలువరుస్తూ దిలీప్‌ని నిర్దోషిగా తేల్చింది. మిగతా వారిని దోషులుగా భావించి వారికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన నేపథ్యంలో దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కుట్ర చేసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, ఈ విషయంలో నటికి న్యాయం జరగలేదని వాపోయింది. ఇదిలా ఉంటే దిలీప్ నటించిన `భా భా బ` డిసెంబర్ 18న విడుదలై బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది. మోహన్‌లాల్, ఎస్.జె.సూర్య గెస్ట్ రోల్స్‌లో కనిపించినా ఫలితం లేకుండా పోవడంతో డెస్టినీ దెబ్బ దిలీప్ మొదలైందని, ఆ నటి పాపం తగలడం మొదలైందని మలయాళ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
