Begin typing your search above and press return to search.

'దంగ‌ల్' సీక్వెల్ పై కొత్త హింట్!

బాక్సాఫీస్ వ‌ద్ద 2000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డును సృష్టించింది. అయితే ఈ స్థాయి వ‌సూళ్ల‌కు ప్ర‌ధాన కార‌ణం చైనా.

By:  Srikanth Kontham   |   31 May 2026 5:00 PM IST
దంగ‌ల్ సీక్వెల్ పై కొత్త హింట్!
X

అమీర్ ఖాన్ క‌థానాయ‌కుడిగా నితీష్ తివారీ తెర‌కెక్కించిన `దంగ‌ల్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 2000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డును సృష్టించింది. అయితే ఈ స్థాయి వ‌సూళ్ల‌కు ప్ర‌ధాన కార‌ణం చైనా. ఒక్క చైనా నుంచే వంద‌ల కోట్లు వ‌సూళ్లు రావ‌డంతోనే అంత పెద్ద విజ‌యం సాధ్య‌మైంది. చైనా వ‌సూళ్ల‌తోనే అంతర్జాతీయ వేదికపై దంగ‌ల్ మెరిసింది . ఈ చిత్రం సాధార‌ణ ప్రేక్షకుల‌తో పాటు క్రీడా రంగానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్లను సైతం ఎంతగానో ప్రేరేపించింది.

తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మహిళా ఫైటర్ షి మింగ్ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌పై అభిమానాన్ని పంచుకున్నారు. తనకు ఆమిర్ ఖాన్ నటన, ఆయన ఎంచుకునే కథాంశాలు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. `దంగల్` సినిమాలో అమీర్ అంకితభావం, ఒక తండ్రిగా తన కూతుళ్లను ఛాంపియన్లుగా మార్చడానికి పడిన తపన తనను వ్యక్తిగతంగా ఎంతో ఆకట్టుకుందని ప్రశంసించారు.

ఈ సందర్భంగా షి మింగ్ మ‌రో ఆసక్తికరమైన కోరికను వ్యక్తంచేశారు. `దంగల్` చిత్రానికి సీక్వెల్ వస్తే చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

ఒరిజినల్ చిత్రంలో కథ ముగిసినా? ఆ పాత్రల తదుపరి ప్రయాణం ఎలా సాగింది? అంతర్జాతీయ వేదికలపై వారు? ఎదుర్కొన్న మరిన్ని సవాళ్లు ఏంటి? అనే కోణంలో సరికొత్త కథను ఆవిష్కరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఒక ప్రొఫెషనల్ ఫైటర్‌గా, క్రీడా నేపథ్యం ఉన్న ఇలాంటి చిత్రాలు సమాజంలో మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. చైనాలో `దంగల్` చిత్రం సాధించిన విజయం ఆర్థికపరమైనది మాత్రమే కాదు. భారత్-చైనా దేశాల మధ్య ఒక గొప్ప సాంస్కృతిక వారధిని నిర్మించింది. చైనీస్ సమాజంలో కూడా కుటుంబ విలువలు, తండ్రి-కూతుళ్ల అనుబంధం, క్రీడల్లో మహిళల ఎదుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఉండటం వల్లే ఈ చిత్రం అక్కడి ప్రజల హృదయాలకు అంతగా దగ్గరయింది.

షి మింగ్ వంటి అంతర్జాతీయ ఫైటర్లు నేటికీ ఆ సినిమా గురించి మాట్లాడటం.. దాని ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది.ఆమిర్ ఖాన్‌కు చైనాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. `3 ఇడియట్స్`, `పి కే`, `దంగల్` చిత్రాల తో ఆయన చైనీస్ ఆడియన్స్‌కు ప్రియమైన విదేశీ నటుడిగా మారారు. ఆ సినిమా క‌థాంశం..పాత్ర‌లు భాషా సరిహద్దులను దాటి ప్రజలను ఎలా ఏకం చేయగలవో ? ఆమిర్ నిరూపించారు. అంతర్జాతీయ క్రీడాకారులు ఆయ‌న సినిమాల సీక్వెల్స్ కోసం అడగడం అమీర్ గ్లోబల్ స్టార్ పవర్‌కు ఓ సంకేతంగా చెప్పొచ్చు.