మూవీ రివ్యూ : దండోరా
‘కోర్ట్’ సినిమా తర్వాత శివాజీ చేస్తున్న సినిమా కావడంతో ‘దండోరా’పై అంచనాలు నెలకొన్నాయి.
By: Tupaki Desk | 25 Dec 2025 2:34 PM IST‘దండోరా’ మూవీ రివ్యూ
నటీనటులు: శివాజీ- నవదీప్- నందు- రవికృష్ణ- మనికా చిక్కాల- మౌనికా రెడ్డి- బిందు మాధవి- రాధ్య- అదితి భావరాజు తదితరులు
సంగీతం: మార్క్ కె రాబిన్
ఛాయాగ్రహణం: వెంకట్ శాఖమూరి
నిర్మాత: రవీంద్ర బెనర్జీ
రచన-దర్శకత్వం: మురళీకాంత్
‘కోర్ట్’ సినిమా తర్వాత శివాజీ చేస్తున్న సినిమా కావడంతో ‘దండోరా’పై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. కొత్త దర్శకుడు మురళీకాంత్ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
2004 - 2019 సంవత్సరాల మధ్య నడిచే కథ ఇది. మెదక్ దగ్గర్లోని ఓ పల్లెటూరులో కొన్ని కులాలకు శవాల్ని కాల్చడానికి స్థలం ఉంటే.. ఇంకొన్ని కులాలకు ఉండదు. ఆ ఊరిలో కులాభిమానం ఎక్కువగా ఉండే వ్యక్తి శివాజీ (శివాజీ). అతడి కూతురు సుజాత (మనికా చిక్కాల) వేరే కులానికి చెందిన రవి (రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. వీళ్లిద్దరూ తమ ప్రేమను ఎలా గెలిపించుకోవాాలా అని చూస్తున్న తరుణంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. దీంతో ఆ ఊరిలో కులచిచ్చు రాజుకుంటుంది. ఆ గొడవ ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికి ఆ ఊరి సమస్యలకు పరిష్కారం దొరికిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
కులం చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాలు తీయాలంటే తమిళ దర్శకులకే చెల్లు అనే పేరుంది. ఆ తరహా సినిమాలు తీయడంలో మన వాళ్లు కొంచెం వెనుకే. అలా అని మన దగ్గర తమిళనాడు తరహాలో కుల సమస్య లేదా అంటే అదేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని దారుణమైన ఘటనలు జరిగాయి. ఐతే సామాజిక సమస్యలను హార్డ్ హిట్టింగ్ గా చెబితే.. మన ప్రేక్షకులు చూడరనే ఒక అభిప్రాయం పడిపోవడం వల్లో ఏమో తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువగా జరగలేదు. కానీ ‘పలాస’ తరహాలో అప్పుడప్పుడూ మన దగ్గర కూడా ఈ టైపు కథలను బలంగా చెప్పే సినిమాలు వస్తుంటాయి. ‘దండోరా’ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. తమిళనాడులో జరిగిన ఒక వాస్తవ ఘటననే మన ప్రాంతానికి అన్వయించి హార్డ్ హిట్టింగ్ గా చెప్పే ప్రయత్నం జరిగింది ‘దండోరా’లో. మొత్తం బిగితో నడవకపోయినా.. కథనం కొంచెం ఎగుడుదిగుడుగా ఉన్నా.. కొన్ని బలమైన ఎపిసోడ్లు.. పవర్ఫుల్ పెర్ఫార్మెన్సులు.. ఆలోచింపజేసే డైలాగులు 'దండోరా'ను వర్త్ వాచ్ అనిపించేలా చేస్తాయి.
'దండోరా'లో కథకు ముఖ్యం అనిపించే పాత్రలు చాలా ఉన్నాయి. ఆ పాత్రల పరిచయం.. కథను ఎస్టాబ్లిష్ చెయ్యడం కోసం ప్రథమార్థంలో కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాడు దర్శకుడు. ఊరిలో కుల సమస్య.. దాని వల్ల ఒక వర్గానికి స్మశానం లేకపోవడం.. దీని మీద మంచి సీన్లు డైలాగులు పడ్డాయి ప్రథమార్థంలో. భిన్న కులాలకు చెందిన ప్రేమ జంట మధ్య సన్నివేశాలు ఒక మోస్తరుగా అనిపిస్తాయి. కామెడీ సీన్లు పెద్దగా పండలేదు. తొలి గంటలో దండోరా పెద్ద ఇంపాక్ట్ ఏమి వేయదు. కానీ కథానియాలుపు తిప్పే ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుల అటెన్షన్ రాబడుతుంది. ఇక్కడి నుంచి సిరియస్ టర్న్ తీసుకునే కథ చివరి వరకు మంచి ఇంటెన్సిటీతో సాగుతుంది.
ఒక ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ రాసి.. అందులో ఒక నటుడు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తే సినిమా గ్రాఫ్ ఎలా పెరుగుతుందో దండోరా సెకండ్ హాఫ్ ఉదాహరణ. ఫస్టాఫ్ వరకు ఒకలా ఉండే శివాజీ పాత్ర ద్వితీయార్థంలో ఇంకో టర్న్ తీసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సెకండ్ హాఫ్ ను డ్రైవ్ చేసేది ఆ పాత్రే. కోర్టు నేపథ్యంలో సాగే అర గంట సినిమాకు హైలైట్ గా నిలిచింది. అందులో శివాజీ పెర్ఫార్మెన్స్.. డైలాగ్స్ అదిరిపోయాయి. సినిమా ఆరంభ సన్నివేశానికి.. క్లైమాక్సుకి లింక్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. దండోరాలో కుల సమస్యకు సంబంధించి కొన్ని సీన్లు అతిగా అనిపించినా.. అక్కడక్కడా నాటకీయత ఎక్కువైనట్లు అనిపించినా ఓవరాల్ గా సినిమా మంచి ఇంపాక్ట్ వేస్తుంది. సామాజిక అంశాలతో ముడిపడ్డ హార్డ్ హిట్టింగ్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు దండోరా నచ్చుతుంది.
నటీనటులు:
శివాజీ కోర్ట్ సినిమా తర్వాత మరోసారి అదరగొట్టాడు. రెండు వేరియేషన్లు ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించాడు శివాజీ. సెకండ్ హాఫ్ మొత్తాన్ని అతనే నడిపించాడు. మనికా చిక్కాల.. రవికృష్ణ పల్లెటూరి ప్రేమ జంటగా బాగా సెట్ అయ్యారు. సర్పంచ్ పాత్రలో నవదీప్ కొత్త లుక్ తో కనిపించాడు. తన మరణ కూడా ఆకట్టుకుంది. నందు కూడా విభిన్న పాత్రలో మెప్పించాడు. బిందు మాధవి వేశ్య పాత్రలో కొత్తగా కనిపించి అలరించింది. మౌనిక రెడ్డి.. రాధ్య.. దేవి ప్రసాద్, అదితి బావరాజు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
మార్క్ కే రాబిన్ పాటలు ఒక మోస్తరుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. సన్నివేశాల్లో ఇంటెన్సిటీకి తగ్గట్లుగా ఆర్ఆర్ సాగింది. వెంకట్ శాఖమూరి ఛాయాగ్రహణం పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రచయిత - దర్శకుడు మురళీకాంత్ సామాజిక అంశాలతో కూడిన కథను ప్రభావవంతంగా చెప్పగలిగాడు. కథనం కొంచెం ఎగుడుదిగుడుగా సాగినప్పటికీ.. కొన్ని బలమైన ఎపిసోడ్లతో సినిమాకు బలం చేకూర్చాడు. మురళీకాంత్ డైలాగులు చాలా చోట్ల పేలాయి.
చివరగా : దండోరా.. హార్డ్ హిట్టింగ్
రేటింగ్: 2.5/5
