మూవీ రివ్యూ : ‘డెకాయిట్’
By: Tupaki Desk | 10 April 2026 9:42 AM ISTడెకాయిట్ మూవీ రివ్యూ
నటీనటులు: అడివి శేష్- మృణాల్ ఠాకూర్- అనురాగ్ కశ్యప్- ప్రకాష్ రాజ్- కామాక్షి భాస్కర్ల- జైన్ మేరీ ఖాన్- సునీల్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నేపథ్య సంగీతం: జ్ఞాన్
ఛాయాగ్రహణం: ధనుష్ భాస్కర్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
కథ-స్క్రీన్ ప్లే: అడివి శేష్- షనీల్ డియో
దర్శకత్వం: షనీల్ డియో
‘క్షణం’ మొదలుకుని.. ‘హిట్-2’ వరకు పకడ్బందీ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కథానాయకుడు అడివి శేష్. తన కొత్త చిత్రం ‘డెకాయిట్’ మీద కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
హరి దాస్ (అడివి శేష్) రాయలసీమ ప్రాంతంలోని హిందూపురానికి చెందిన తక్కువ కులం కుర్రాడు. అతను ఉన్నత కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్)ను ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోవడమే కాదు.. హరి జైలు పాలవుతాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న అతను.. తాను ఇలా కావడానికి సరస్వతినే కారణమని రగిలిపోతుంటాడు. ఎలాగైనా జైలు నుంచి తప్పించుకుని.. సరస్వతి మీద పగ తీర్చుకోవాలని చూస్తున్న అతడికి ఓ అవకాశం వస్తుంది. దాన్ని అతను ఉపయోగించుకున్నాడా.. సరస్వతి మీద ప్రతీకారం తీర్చుకున్నాడా.. ఇంతకీ గతంలో వీరి మధ్య ఏం జరిగింది.. నిజంగా హరి జైలు పాలవడానికి సరస్వతినే కారణమా.. ఇన్నేళ్ల తర్వాత సరస్వతి ఏ స్థితిలో ఉంది.. తిరిగి సరస్వతిని కలిశాక ఆమెతో హరి ప్రయాణం ఎలా సాగింది.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
కొన్ని సినిమాలకు దర్శకుడి మీద అంచనాలుంటాయి. కొన్ని చిత్రాలకు హీరో మీద అంచనాలు పెట్టుకుంటాం. కొన్ని సినిమాలకు నిర్మాతల్ని చూసి ఎక్కువ ఊహించుకుంటాం. ఆయా వ్యక్తులు అప్పటిదాకా తీసిన సినిమాలు వారి మీద అంచనాలు పెంచుకునేలా చేస్తాయి. వాళ్లు నెలకొల్పిన ప్రమాణాలకు తక్కువగా కంటెంట్ ఉంటే నిట్టూరుస్తాం. తెలుగులో గత దశాబ్ద కాలంలో ఒక హీరో సినిమా అంటే చాలా బలమైన కంటెంట్ ఉంటుందని ధీమాగా థియేటర్లకు ప్రేక్షకులు వచ్చేలా చేసిన హీరో అడివి శేష్. స్వతహాగా దర్శకుడు, రచయిత అయిన శేష్.. తనలాంటి అభిరుచి ఉన్న టీంలతో పని చేస్తూ ‘క్షణం’ నుంచి ‘హిట్-2’ వరకు పకడ్బందీ థ్రిల్లర్లు అందించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎప్పట్లాగే బాగా టైం తీసుకుని.. తనూ రచనలో భాగమై.. ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన ‘డెకాయిట్’ మీద ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇలాంటి అంచనాలతో చూసేటపుడు కథ మొదలుకుని ప్రతి విషయంలోనూ ఒక ‘స్టాండర్డ్’ ఆశిస్తారు ప్రేక్షకులు. అవి తమ ఆలోచన పరిధిని మించి.. శేష్ ‘రేంజ్’లోనే ఉండాలని కోరుకుంటారు. కానీ ఈసారి శేష్ తాను నెలకొల్పిన ప్రమాణాలను అందుకోలేకపోయాడు. అందరూ తీసే సగటు థ్రిల్లర్ల స్థాయికి దిగిపోయాడు. కాబట్టి ప్రేక్షకులకు నిరాశ తప్పదు. మామూలుగా చూస్తే ఇది ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు బాగానే ఎంగేజ్ చేస్తుంది. కానీ శేష్ నుంచి సెట్ చేసిన ‘స్టాండర్డ్’ ప్రకారం చూస్తే ఇది ఆశించినంత కిక్కు ఇవ్వదు.
అడివి శేష్ సినిమాలంటే కథ పకడ్బందీగా ఉండాలి. లాజిక్కులు మిస్ కాకూడదు. ట్విస్టులు పేలిపోవాలి. స్క్రీన్ ప్లే ఉక్కిరి బిక్కిరి చేయాలి. సన్నివేశాలు ఆశ్చర్యపరచాలి. పాత్రలు అంతుబట్టని విధంగా ఉండాలి. మన ఆలోచన స్థాయిని మించి అన్నీ ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ తెరపై ఏం జరుగుతుందో ముందే ఊహించేయగలిగితే.. సన్నివేశాల్లో లాజిక్కులు మిస్ అయితే.. ఎమోషన్ బలంగా లేకపోతే నిరాశచెందనడం సహజం. ‘డెకాయిట్’ విషయంలో అదే జరుగుతుంది. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ‘డెకాయిట్’ ఎక్కడా బోర్ అయితే కొట్టించదు. శేష్ సినిమాల్లో ఎప్పుడూ కనిపించే రేసీ స్క్రీన్ ప్లేతో కథ ఎక్కడా ఆగదు. సన్నివేశాలు పరుగులు పెడుతుంటాయి. కొన్ని సీన్లు మంచి కిక్ ఇస్తాయి కూడా. కానీ సినిమా మొత్తంగా ఇవ్వాల్సినంత కిక్కు ఇవ్వలేదు. ‘యే దిల్ మాంగే మోర్’ అన్నట్లుగా ఇంకా ఏదో ఆశిస్తుంటాం. కానీ నిరాశ తప్పదు. అందుకు ప్రధాన కారణం.. ప్రధాన పాత్రలను-కథలోని కీలకమైన విషయాలను బలంగా తీర్చిదిద్దకపోవడం.. ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం. ముఖ్యంగా లీడ్ పెయిర్ మధ్య ప్రేమ సన్నివేశాలను కానీ.. వారి మధ్య ఎడబాటుకు దారి తీసే సన్నివేశాలను కానీ ప్రభావవంతంగా చూపించకపోవడంతో ఎమోషన్ పండలేదు. అదే సినిమాకు అతి పెద్ద మైనస్.
తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నాశనం చేయాలి అనేంతగా హీరోయిన్ మీద హీరో అదే పనిగా రగిలిపోతున్నాడంటే.. అందుకు కారణాన్ని తన కోణంలో చాలా బలంగా.. కన్విన్సింగ్ గా చూపించాలి. కానీ ‘డెకాయిట్’లో అది జరగలేదు. ఈ సీన్లో కథ మలుపు తిరగాలి తప్పదు కాబట్టి తిప్పారు.. అతను అపార్థం చేసుకోవాలి తప్పదు కాబట్టి చేసుకున్నాడు అన్నట్లుగా ఆ ఎపిసోడ్ నడుస్తుంది. అందులోనే కాక ముఖ్య సన్నివేశాల్లో ట్విస్టులు కూడా బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది తప్ప.. ఆర్గానిగ్గా అనిపించలేదు. హీరో పాత్ర చిత్రణ సైతం గందరగోళంగా అనిపిస్తుంది సినిమాలో. జైల్లో ఉండగా అతడికి ఇచ్చే బిల్డప్.. తర్వాత ప్రవర్తించే తీరుకు.. గతంలో జరిగిన దానికి పొంతన లేదు. ఇక కరోనాలో ఒక హాస్పిటల్ దోపిడీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు.. ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేసిన తీరు చూసి మొదట్లో ఏదో ఊహించుకుంటాం. కానీ తర్వాత తుస్సుమనిపించేశారు. ఐతే ఇలా ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. ‘కొన్ని థ్రిల్లింగ్ ఎపిసోడ్లు ‘డెకాయిట్’ను వాచబుల్ అనిపించేలా చేశాయి. ముఖ్యంగా హీరో జైలు నుంచి తప్పించుకునే ఎపిసోడ్ ప్రథమార్దానికి హైలైట్ గా నిలుస్తుంది. ఆపై పోలీసులకు చిక్కినట్లే చిక్కి ఎస్కేప్ అయ్యే సీన్ కూడా బాగా తీశారు. 20 నిమిషాల పతాక సన్నివేశాలు కూడా బాగా పండాయి. సినిమా మొత్తంలో ఎమోషన్ వర్కవుట్ అయింది అక్కడే. హీరో పాత్రకు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ బాగుంది. సినిమాలో శేష్ మార్కు స్పష్టంగా కనిపించేది అక్కడే. ఇదే మెరుపులు మిగతా చోట్ల కూడా ఉండుంటే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను బలంగా తీర్చిదిద్దుకుని ఉంటే ‘డెకాయిట్’ లెవెల్ వేరుగా ఉండేది. ముందే అన్నట్లు ఇది మామూలు కళ్లతో చూస్తే ఓకే అనిపించే థ్రిల్లర్. కానీ ‘శేష్’ సినిమా కదా అని ఎక్కువ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
అడివి శేష్ పెర్ఫామెన్స్ ఎప్పటిలానే బాగుంది. కానీ రాయలసీమ భాష-యాస అతడికి అంతగా కుదరలేదు. ఐతే పదేళ్లు జైలు జీవితం గడిపి కర్కశంగా మారిన వ్యక్తిగా తన అప్పీయరెన్స్.. హావభావాలు ఓకే అనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో శేష్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషన్ బాగా పండించాడు. మృణాల్ ఠాకూర్ ను సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ అని చెప్పొచ్చు. శేష్ ను డామినేట్ చేసే స్థాయిలో ఆమె సరస్వతి పాత్రను పండించింది. ఎక్కడా వంక పెట్టలేని స్థాయిలో నటించింది. భావోద్వేగాలు పండించడంలో తన ప్రత్యేకతను ఆమె మరోసారి చాటుకుంది. అనురాగ్ కశ్యప్.. ప్రకాష్ రాజ్ పాత్రలు అనుకున్నంత స్థాయిలో లేవు. అనురాగ్ నటన వరకు ఓకే అనిపించాడు. ప్రకాష్ రాజ్ గురించైతే చెప్పడానికి ఏమీ లేదు. సునీల్ పర్వాలేదు. కామాక్షి భాస్కర్ల బాగానే చేసింది. మృణాల్ భర్తగా నటించిన ఆర్టిస్టు ఆకట్టుకున్నాడు. జైన్ మేరీ ఖాన్ పాత్రలో పెద్దగా విషయం లేదు. తన నటన ఓకే.
సాంకేతిక వర్గం:
‘డెకాయిట్’ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతోనే సాగింది. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. బాగా ఖర్చు పెట్టి సినిమా తీశారు. ధనుష్ భాస్కర్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. భీమ్స్ సిసిరోలియో పాటలు ఓకే అనిపిస్తాయి. జ్ఞాన్ నేపథ్య సంగీతం సినిమాలో మేజర్ హైలైట్. సినిమా రేసీగా అనిపించేలా చేయడంలో.. కీలకమైన సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో బీజీఎం కీలక పాత్ర పోషించింది. అబ్బూరి రవి మాటలు సంభాషణల్లో ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా శేష్-రవి కలయికలో వచ్చే చిత్రాల్లో పాత్రలు నర్మగర్భంగా మాట్లాడుకుంటాయి. డైలాగులకు అదే విశిష్ఠత తెచ్చిపెడుతుంది. కానీ ఈ చిత్రంలో క్యారెక్టర్లు అలాగే మాట్లాడుకుంటాయి కానీ.. డైలాగుల్లో మాత్రం పదును లోపించింది. శేష్-షనీల్ డియో కలిసి వండిన కథలో విషయం ఉంది కానీ.. ఈసారి శేష్ మార్కు స్క్రీన్ ప్లే మాయాజాలం మిస్సయింది. సినిమాలో బిగి కనిపించలేదు. దర్శకుడిగా షనీల్ ఓకే అనిపించాడు.
చివరగా: డెకాయిట్.. ఓకే అనిపించే థ్రిల్లర్
రేటింగ్ - 2.75/5
