Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూల‌పై నిషేధం అంత ఈజీ కాదు!

సినిమా రివ్యూల‌పై నిషేధం విధించాల‌ని, రిలీజ్ రోజునే రివ్యూలు ఇచ్చేసే ప‌ద్ద‌తికి అడ్డుక‌ట్ట వేయాల‌ని గ‌త కొంత కాలంగా ప‌లు ఇండ‌స్ట్రీల్లో తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుతున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2025 10:31 AM IST
సినిమా రివ్యూల‌పై నిషేధం అంత ఈజీ కాదు!
X

సినిమా రివ్యూల‌పై నిషేధం విధించాల‌ని, రిలీజ్ రోజునే రివ్యూలు ఇచ్చేసే ప‌ద్ద‌తికి అడ్డుక‌ట్ట వేయాల‌ని గ‌త కొంత కాలంగా ప‌లు ఇండ‌స్ట్రీల్లో తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇది సాధ్యం అయ్యే ప‌ని కాదు. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌లో భాగంగా రివ్యూల‌ని నిషేధించ‌డం వీలు కాద‌ని ప‌లు సంద‌ర్భాల్లో రుజువైంది. అయినా స‌రే కొంత మంది నిర్మాత‌లు దీనిపై ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా ఫైట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా త‌మిళ నిర్మాత‌ల సంఘం సినిమా విడుద‌లైన మూడు రోజుల వ‌ర‌కు రివ్యూలు రాకుండా నిషేధించాల‌ని మ‌ద్రాసు హైకోర్టులో పిటీష‌న్ వేసింది.

అయితే ఈ పిటీష‌న్‌పై గురువారం మ‌రోసారి విచార‌ణ చేసిన కోర్టు రివ్యూల‌పై నిషేధం విధించ‌డానికి నిరాక‌రించింది. ఈ పిటీష‌న్‌ను జ‌స్టిస్ ఆనంద్ వెంక‌టేష్ కొట్టివేశారు. ఈ సంద‌ర్భంగా రివ్యూల‌ని నిషేధించ‌డం అంటే భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. నిర్మాత‌లు వాస్త‌వానికి దూరంగా ఉన్న‌దాన్ని కోరుకుంటున్నార‌ని జ‌స్టిస్ ఆనంద్ వెంక‌టేష్ స్ప‌ష్టం చేసి షాక్ ఇచ్చారు. సోష‌ల్ మీడియా యుగంలో రివ్యూలు పోస్ట్ చేయ‌కుండా ఆప‌డం అసాధ్యం అన్నారు. రివ్యూలు మంచివైనా చెడ్డ‌వైనా ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని, వాటిని నిషేధించ‌డం అంటే భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మే అవుతుంద‌న్నారు.

సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్ తో పాటు ఇత‌ర ప్లాట్ ఫామ్స్ కూడా భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కిందికే వ‌స్తాయ‌ని, వాటిలో ఇచ్చే రివ్యూస్‌ని ప్రాక్టిక‌ల్‌గా బ్యాన్ చేయ‌డం అసాధ్యం అని తేల్చి చెప్పారు. నిర్మాత‌లు సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి పాజిటివ్ రివ్యూల‌నే ఆశిస్తున్న‌ట్ట‌యితే వాస్త‌విక ప‌రిస్థితుల‌ని అంగీక‌రించాల‌న్నారు. కాబ‌ట్టి రివ్యూల‌ని నిషేధించ‌లేమ‌ని ఈ సంద‌ర్భంగా తేల్చి చెప్పారు. అంతే కాకుండా అజ‌హ‌ర్‌బైజాన్ వంటి దేశంలో పెట్టిన రివ్యూని తాము ఎలా నిషేధించ‌గ‌ల‌మ‌న్నారు. సోష‌ల్ మీడియాలో మేము కూడా ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నామ‌న్నారు.

ఒక సినిమాని ఓ వ్య‌క్తి విమర్శించినంత మాత్రాన దాన్ని మ‌రో వ్య‌క్తి గుడ్డిగా న‌మ్ముతాడ‌ని ఎలా అనుకుంటారు. అభిప్రాయాలు అనేవి వ్య‌క్తికి వ్య‌క్తికి భిన్నంగా ఉంటాయి` అని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే గ‌త కొంత కాలంగా టాలీవుడ్‌లోనూ రివ్యూల నిషేధంపై చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. సినిమా పూర్తిగా చూడ‌కుండానే సోష‌ల్ మీడియా వేదిక‌గా రివ్యూలు పెడుతున్నార‌ని, అలా చేయ‌డం వ‌ల్ల సినిమా ఫ‌లితంపై ప్ర‌భావం ప‌డుతోంద‌ని టాలీవుడ్ నిర్మాత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తంచేయ‌డం తెలిసిందే. ఇండియా ప్ర‌జాస్వామ్య దేశం. ఇక్క‌డ భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ ఉంది. ఈ విష‌యాన్ని తెలిసి కూడా రివ్యూల‌పై నిషేధం విధించాల‌ని వాదించ‌డం అర్థం లేని ప‌ని, రివ్యూల‌ని ఆపాల‌నే ప‌ని ప‌క్క‌న పెట్టి మంచి క‌థ‌ల‌ని ఎంచుకుని ప్రేక్ష‌కుల‌కు కొత్త త‌ర‌హా సినిమాలు అందించ‌డంపై దృష్టిపెడితే మంచిద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.