'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ రివ్యూ
By: Tupaki Desk | 14 Feb 2026 7:05 AM IST'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ రివ్యూ
నటీనటులు: సంతోష్ శోభన్ - మానస వారణాసి - రాజీవ్ కనకాల - యోగిబాబు - గోపరాజు రమణ - తదితరులు
సంగీతం: ఆదిత్య రవీంద్రన్
ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్
నిర్మాణం: యువి క్రియేషన్స్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్
మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఓటీలో వచ్చిన ‘ఏక్ మిని కథ’ మినహాయిస్తే హీరోగా థియేటర్లలో హిట్టు రుచి చూడక ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’తో షాక్ తిన్న అమ్మాయి మానస వారణాసి. ఈ ఇద్దరూ జంటగా తమిళ కుర్రాడైన అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రూపొందించిన చిత్రం.. కపుల్ ఫ్రెండ్లీ. ప్రేమికుల దినోత్సవ కానుకగా వచ్చిన లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో చూద్దాం.
కథ:
శివ (సంతోష్ శోభన్) చదువు పూర్తి చేసినా ఉద్యోగం దొరక్క ఇబ్బందిపడుతుంటాడు. బతుకు తెరువుకోసం అతను చెన్నైలో బైక్ ట్యాక్సీ నడుపుకుంటూ ఉంటాడు. మిత్ర (మానస వారణాసి)కి ఇంట్లో పెళ్లి చేస్తాం అనడంతో అది తప్పించుకోవడానికి జాబ్ పేరుతో చెన్నైకి వస్తుంది. అనుకోకుండా తన హాస్టల్ ఖాళీ చేయాల్సి రావడంతో శివ బైక్ మీద తిరుగుతూ కొత్త హాస్టల్ కోసం వెతికినా ఫలితం లేకపోకపోతుంది. దీంతో శివ మీద నమ్మకముంచి తన రూంకే వెళ్లి దాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఐతే కొని రోజులకు ఇద్దరూ ప్రేమలో పడి లివిన్ కు రెడీ అవుతారు. తర్వాత శివకు ఉద్యోగం వస్తుంది కానీ.. మిత్ర మాత్రం ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరికీ గొడవ వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుంది. మరి శివ-మిత్ర మళ్ళీ కలుస్తారా లేదా? వీళ్ళ లివ్ ఇన్ రిలేషన్ గురించి ఇంట్లో వాళ్లకు ఎలా తెలుస్తుంది? తర్వాత ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
‘కపుల్ ఫ్రెండ్లీ’ టైటిల్ ను మార్చి ‘ఫ్రెండ్లీ కపుల్’ అని పెడితే ఈ సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు చెప్పినా.. అందుకు ఒప్పుకోకుండా ఆ టైటిలే కొనసాగించి ‘ఎ’ సర్టిఫికెట్ తీసుకుంది చిత్ర బృందం. ట్రైలర్లో ఇంటిమేట్ సీన్ల ఛాయలు కనిపించడంతో ‘ఎ’ సర్టిఫికెట్ ఉండడం ప్లస్ అవుతుందనుకున్నారేమో.. ఇది యూత్ కోసం తీసిన మసాలా సినిమా కావచ్చు అని సందేహించిన వాళ్లూ ఉన్నారు. ఐతే ఈ చిత్రంలో లిప్ లాక్స్ ఉన్నాయి.. బెడ్ రూమ్ సీన్సూ ఉన్నాయి. కానీ అవి యువతను ఉద్రేకపరచడానికి వేసిన ‘మసాలా’ ఎంతమాత్రం కాదు. సినిమా చూసిన ఎవ్వరికైనా అవి కథలో భాగంగా.. కథకు అవసరంలా.. రియలిస్టిగ్గా అనిపిస్తాయే తప్ప వాటిని మరో దృష్టితో చూడరు. టైటిల్ మార్చకపోవడంలోనే కాదు.. కథను నిజాయితీగా చెప్పడంలోనూ ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీం ఎక్కడా రాజీ పడలేదు. నేటితరం అబ్బాయిలు.. అమ్మాయిల మనస్తత్వాలకు అద్దపడుతూ.. ఈ కాలం రిలేషన్షిప్స్ మీద మెచ్యూర్డ్ టేక్ లాగా అనిపిస్తుంది ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇంత వాస్తవికంగా.. ఆహ్లాదకరంగా.. పరిణతితో ప్రేమకథను డీల్ చేసిన సినిమాలు అరుదే.
ఒక అబ్బాయి.. అమ్మాయి కలిసి లివిన్లో ఉండే నేపథ్యంలో కథలు తెలుగు తెరపై కొత్తేమీ కాదు. కానీ ఈ తరహా కథలు అనగానే వాటిని తీసే విధానం.. ప్రేక్షకులు చూసే కోణమే వేరు. ఈ తరహా కథను చాలా సిన్సియర్ గా చెప్పిన సినిమాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిలుస్తుంది. ఇందులో హీరో - హీరోయిన్ పాత్రల పరిచయం దగ్గర్నుంచి కొత్తగా అనిపిస్తాయి. ఇది సినిమా అనే ఫీలింగ్ మొదట్లోనే కొట్టుకుపోతుంది. నిజంగా ఒక అబ్బాయి-అమ్మాయి మధ్య నడిచే కథను వాళ్ల పక్కనే ఉండి చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఎక్కడా వాతావరణం కృత్రిమంగా అనిపించకుండా.. రియల్ లొకేషన్లలో సినిమా తీయడం.. సంభాషణల దగ్గర్నుంచి అన్నీ సహజంగా అనిపించడం వల్ల ఈ కథతో పాత్రలతో ఈజీగా ట్రావెల్ చేస్తాం. ఇలాంటి పాత్రలు.. కథాకథనాలు కొత్తగా అనిపించకపోయినా.. ట్రీట్మెంట్ మాత్రం ఫ్రెష్ గా అనిపించడం వల్ల సన్నివేశాలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి.
ప్రథమార్ధం అంతా ప్రేమకథ సరదాగా హుషారుగా సాగితే.. ఎమోషన్ల మీద నడిచే సెకండాఫ్ సీరియస్ గా అనిపిస్తుంది. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాల్లో పతాక సన్నివేశాలను మనం ఒకలా ఊహించుకుంటాం. కానీ తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ క్లైమాక్సుకు తమిళ టచ్ ఇచ్చాడు. చివరికి గుండె బరువెక్కుతుంది. కన్నీళ్లు కూడా వస్తాయి. ఒకప్పుడంటే ఇలాంటి ఘట్టాలను మన ప్రేక్షకులు జీర్ణించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు అంగీకరిస్తున్నారు కాబట్టి అది సినిమాకు ప్రతికూలత కాదు. చాలా వరకు రియలిస్టిగ్గా సాగే సినిమాలో కొన్ని చోట్ల స్వేచ్ఛ తీసుకున్నారు. ఎలాంటి పరిచయం లేని ఓ బైక్ ట్యాక్సీ నడుపుకునే వ్యక్తిని నమ్మి ఓ అమ్మాయి.. రోజంతా తనతో బైక్ మీద తిరగడం.. తనకు హాస్టలే దొరక్కపోవడం.. తనతో గదిని పంచుకోవడం లాంటివి కొంచెం అతిగా అనిపిస్తాయి. సినిమాలో కొంచెంత తమిళ ఫ్లేవర్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ప్రథమార్ధం ఉన్నంత వేగంగా సెకండాఫ్ లేదు. కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. కానీ హీరో హీరోయిన్ల కథలోనే కాక హీరో అన్నావదినల తాలూకు ఎమోషన్ కూడా పండింది. ఓవరాల్ గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన స్పెషల్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలుస్తుంది.
నటీనటులు:
సంతోష్ శోభన్ రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నందుకు మంచి ఫలితమే వచ్చింది. మంచి కథను ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్న కథ కోసం నటుడిగా ఏం చేయాలో అదంతా చేశాడు. అతను ఎంతో ఇన్వాల్వ్ అయి చేసిన సినిమా అని సినిమా అంతటా కనిపిస్తూనే ఉంటుంది. ఎంతో పరిణతితో తన పాత్రను పోషించాడు సంతోష్. ఇటు సరదా సన్నివేశాల్లోనే కాక అటు ఎమోషనల్ సీన్లలో చాలా బాగా నటించాడు. మానస వారణాసి హీరోకు దీటుగా నిలబడింది. కొన్ని సన్నివేశాల్లో సంతోష్ ను డామినేట్ చేసింది. సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణ. అందంతోనే కాక అభినయంతోనూ ఆకట్టుకున్న మానస రూపంలో తెలుగు సినిమాకు ఓ మంచి తెలుగు హీరోయిన్ దొరికినట్లే. రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గోపరాజు రమణ కూడా బాగా చేశాడు. యోగిబాబు.. మరో నటుడు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా కూడా ‘కపుల్ ఫ్రెండ్లీ’ మెప్పిస్తుంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాగుంది. రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడంతో నేచురల్ విజువల్స్ వచ్చాయి. ఆదిత్య రవీంద్రన్ సంగీతం సినిమాకు ఆకర్షణగా మారింది. సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఆహ్లాదకరమైన పాటలు.. నేపథ్య సంగీతం అందించాడు. యువి వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. అశ్విన్ చంద్రశేఖర్ కొత్త దర్శకుడైనా అందంగా.. పరిణతితో ఈ ప్రేమకథను డీల్ చేశాడు. ఆధునిక ప్రేమల మీద చక్కటి అవగాహనతో యూత్ కనెక్ట్ అయ్యేలా స్టోరీని నడిపించిన అతను.. ఇంటిమేట్ సీన్లయినా కథకు అవసరమైన స్థాయిలోనే ఉపయోగించుకున్నాడు. సెకండాఫ్ లో కొంత ల్యాగ్.. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం తప్పిస్తే.. దర్శకుడి పనితనానికి మంచి మార్కులు పడతాయి.
చివరగా: కపుల్ ఫ్రెండ్లీ.. ఒక మంచి ప్రేమకథ
రేటింగ్ : 3/5
