వార్-2, కూలీ.. ఎలా యూజ్ చేసుకుంటాయో మరి?
రిలీజ్ కు ముందు వార్-2, కూలీ సినిమాలపై భారీ అంచనాలు క్రియేట్ అయినా.. విడుదలయ్యాక మాత్రం సినీ రివర్స్ అయింది.
By: M Prashanth | 18 Aug 2025 4:29 PM ISTస్వాతంత్ర్య దినోత్సవ కానుకగా కూలీ, వార్-2 సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు అన్ని విషయాల్లో పోటీపడ్డ రెండు చిత్రాలు.. ఆగస్టు 14వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించినా.. ఆడియన్స్ అంచనాలను మాత్రం అందుకోలేదని చెప్పాలి.
రిలీజ్ కు ముందు వార్-2, కూలీ సినిమాలపై భారీ అంచనాలు క్రియేట్ అయినా.. విడుదలయ్యాక మాత్రం సినీ రివర్స్ అయింది. పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేకపోయాయి. రివ్యూస్ కూడా సానుకూలంగా పొందలేకపోయాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిన్నటి వరకు మంచి వసూళ్లు రాబట్టాయి.
ఓపెనింగ్స్ లో కూలీ మూవీ పైచేయి సాధించింది. కోలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. వీకెండ్ లో మరిన్ని వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా సాధించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వార్-2 ఓపెనింగ్స్ లో కూలీ కన్నా వెనుకబడి ఉన్నా.. తర్వాత వీకెండ్ లో మాత్రం బాగా పుంజుకుంది. రూ.200 కోట్లకు చేరువలోకి వచ్చింది.
అయితే ఇప్పుడు సోమవారం నుంచే రెండు సినిమాలకు అసలు పరీక్ష మొదలైంది. ఎందుకంటే వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టిన రెండు సినిమాలు.. వీక్ డేస్ లో బాక్సాఫీస్ వద్ద నిలబడడం పెద్ద సవాలే. ముఖ్యంగా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మహావతార్ నరసింహ ఈ మధ్య కాస్త సైలెంట్ అయినా ఇప్పుడ మళ్లీ పుంజుకుని మంచి వసూళ్లు రాబడుతోంది.
అదే సమయంలో కూలీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 60-70 శాతం మధ్య రికవరీ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 80 శాతం కూడా రికవరీ చేసుకుందని సమాచారం. ఇప్పుడు వీక్ డేస్ లో కూడా సాలిడ్ వసూళ్లు రాబడితే కూలీ మూవీ బ్రేక్ ఈవెన్ ను అందుకోవడం చాలా ఈజీ. లేకుంటే కాస్త ఇబ్బందనే చెప్పాలి.
మరోవైపు.. వార్-2 మూవీ వసూళ్లు డ్రాప్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అందుకే తెలుగులో అనుకున్న విధంగా షేర్ అందుకోవడం అనుమానమే. ఇప్పటి వరకు సగం కూడా రికవరీ చేసినట్లు లేదని సమాచారం. దీంతో నష్టాలు భారీగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రెండు సినిమాలకు ఈ వారం ఎలాంటి చిత్రాలు రిలీజ్ లేకపోవడం కలిసొచ్చే విషయం. మరి దాన్ని ఏ మేరకు యూజ్ చేసుకుంటాయో చూడాలి.
