కూలీ ఓవర్సీస్ బిజినెస్.. పవర్ఫుల్ డీల్ తో కొత్త రికార్డు!
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'కూలీ' ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది
By: Tupaki Desk | 18 Jun 2025 6:12 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'కూలీ' ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా, అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతుండటంతో టోటల్ ఇండియన్ సినిమా మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో రజనీ పాత్ర నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందట. ఆయన పక్కన నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, జూనియర్ ఎంజీఆర్, రేబా మోనికా జాన్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.
సినిమా థీమ్ కూడా ఆసక్తికరంగా ఉండబోతోంది. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో కథ నడవనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి అద్భుత స్పందన లభించింది. అనిరుధ్ సంగీతం, మాస్ విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ థియేటర్లకు రానుంది.
తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అన్ని భాషల కలిపి ఓవర్సీస్ రైట్స్‌ను ఏకంగా రూ.81 కోట్లుకి డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. కోలీవుడ్ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో ఇదొక రికార్డు లాంటి డీల్‌గా నిలిచింది. ఇది రజనీకాంత్ క్రేజ్, లోకేష్ మార్క్‌కు నిదర్శనం. ఇప్పటికే తమిళం, తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం పెద్దపెద్ద సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్‌లో ఇంత భారీ బిజినెస్ సాధించడం రజనీ కెరీర్‌లోనే బిగ్ రికార్డ్ గా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ముఖ్యంగా USA, GCC, UK, ఆస్ట్రేలియా, మలేషియా మార్కెట్లలో ఈ సినిమా పై ఆడియెన్స్‌లో అంచనాలు బిగ్ రేంజ్ లో ఉన్నాయి. టీజర్ లోనే వింటేజ్ రజనీ మాస్ యాంగిల్‌ని చూపించిన లోకేష్.. సినిమా మొత్తం ఎలాగుంటుందో ఊహించుకోవచ్చు.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ ఉన్నప్పటికీ.. ఓవర్సీస్ బిజినెస్ తాలూకు ఈ రికార్డు డీల్ ఈ హైప్‌ని మరో మెట్టు ఎక్కించింది. బిజినెస్ పరంగా ఎంతటి రికార్డులు సాధించినా.. కంటెంట్ బలమే సినిమా నిజమైన విజయం అని మేకర్స్ నమ్ముతున్నారు. మరి ఈ భారీ సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.