Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'కూలీ'

50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన క్రేజీ మూవీ.. కూలీ.

By:  Tupaki Desk   |   14 Aug 2025 4:26 PM IST
మూవీ రివ్యూ : కూలీ
X

‘కూలీ’ మూవీ రివ్యూ

నటీనటులు: రజినీకాంత్- అక్కినేని నాగార్జున- ఉపేంద్ర- సౌబిన్ షాహిర్- సత్యరాజ్- శ్రుతి హాసన్- ఆమిర్ ఖాన్ తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్

మాటలు: రాకేందు మౌళి

నిర్మాత: కళానిధి మారన్

స్క్రీన్ ప్లే: లోకేష్ కనకరాజ్- చంద్రు అన్బళగన్

కథ-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన క్రేజీ మూవీ.. కూలీ. సౌత్ ఇండియాలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. నాగార్జున విలన్ పాత్ర చేయడం.. ఆమిర్ ఖాన్-ఉపేంద్ర ప్రత్యేక పాత్రల్లో నటించడంతో దీని హైప్ ఇంకా పెరిగింది. మరి ఆ హైప్ కు తగ్గ సినిమానేనా ఇది? తెలుసుకుందాం పదండి.

కథ: దేవా (రజనీకాంత్) విశాఖపట్నంలో ఒక మాన్షన్ నడిపే నడి వయస్కుడైన వ్యక్తి. అతడి స్నేహితుడైన రాజశేఖర్ (సత్యరాజ్) అనుమానాస్పదంగా చనిపోవడంతో తన మరణానికి కారణం ఎవరో తెలుసుకునే పనిలో పడతాడు దేవా. పోర్టులో అక్రమ వ్యాపారం చేసే సైమన్ (నాగార్జున) గ్యాంగ్ దీని వెనుక ఉన్నట్లు అర్థం చేసుకుని.. వాళ్ళ మనిషిలా కలిసిపోయి తన మిషన్ మొదలు పెడతాడు దేవా. ఇంతకీ రాజశేఖర్ నేపథ్యం ఏంటి.. సైమన్ మనుషులు అతడిని ఎందుకు చంపారు.. పోర్టులో అడుగు పెట్టిన దేవా సైమన్ గురించి ఏం తెలుసుకున్నాడు.. చివరికి తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఒక ఖైదీ.. ఒక విక్రమ్.. కేవలం ఈ రెండు పెద్ద హిట్లతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్. ‘కూలీ’కి ఎక్కడ లేని హైప్ వచ్చిందంటే అందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను మించి లోకేష్ ముఖ్య కారణం అంటే అతిశయోక్తి కాదు. ఐతే అతను ప్రతిసారీ అద్భుతాలు చేయలేడని.. మాస్టర్.. లియో లాంటి సినిమాలు రుజువు చేశాయి. ఈ రెండు చిత్రాల్లో ఏదో జరిగిపోతున్నట్లు విపరీతమైన బిల్డప్ ఉంటుంది కానీ.. తీరా చూస్తే ఏమీ ఉండదు. ముఖ్యంగా ‘లియో’ తన స్టోరీ టెల్లింగ్ తల బొప్పి కట్టించేసింది. అదొక పొరపాటు అనుకోవడానికేమీ లేదని ‘కూలీ’తో రుజువు చేశాడు లోకేష్. ఈ సినిమాతో అతనేం చెప్పదలుచుకున్నాడో.. ఇందులో ఏ పాత్ర ఏంటో.. ఏ సన్నివేశం ఉద్దేశమేంటో తెలుసుకోవడానికి మళ్లీ మళ్లీ సినిమా చూడాల్సిందే. అయినా అర్థమవుతుందన్న గ్యారెంటీ లేదు. లోకేష్ కష్టపడలేదు.. కసరత్తు చేయలేదు అని చెప్పలేం కానీ.. తాను ఏం రాసినా ఏం తీసినా చెల్లిపోతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా తీశాడా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. లెక్కకు మిక్కిలి క్యారెక్టర్లను పెట్టి.. ప్రతిదానికీ ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉన్నట్లుగా చూపించాడు కానీ.. రజినీ చేసిన హీరో పాత్ర సహా ఏదీ సరైన ఇంపాక్ట్ వేయదు ‘కూలీ’లో. కథలో కొన్ని కొత్త పాయింట్లు.. కొన్ని ఎలివేషన్ సీన్లు.. స్టైలిష్ టేకింగ్ వల్ల ‘కూలీ’ అక్కడక్కడా ఎంగేజ్ చేస్తుంది కానీ.. రజినీ-లోకేష్ కాంబినేషన్ మీద పెట్టుకున్న అంచనాలకు దరిదాపుల్లో కూడా ఈ సినిమా నిలవదు.

ఏ సినిమా అయినా.. మొదలైన అరగంటకో.. గంటకో.. లేదంటే ఇంటర్వెల్ సమయానికి అయినా కథేంటి.. పాత్రలేంటి అన్నది అర్థం కావాలి. కానీ ‘కూలీ’ సినిమా విషయంలో మాత్రం శుభం కార్డు పడ్డాక కూడా శేష ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి. ఎంతో బిల్డప్ తో మొదలై.. ఏదో చేసేయాలని ప్రయత్నించి.. చివరికి పెద్దగా ఇంపాక్ట్ లేకుండా ముగిసే సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. మొబైల్ క్రిమేషన్ అంటూ ఓ కొత్త పాయింటుతో ఆరంభంలో ‘కూలీ’ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇదేదో బాగుందే అంటూ ఆశగా సినిమాలో ఇన్వాల్వ్ అవుతాం. రజినీ పాత్ర ఎలాంటి మలుపు తీసుకుంటుందో.. నాగ్ చేసిన సైమన్ పాత్రలో ఏం మర్మం ఉందో.. సౌబిన్ షాహిర్ ఏం మ్యాజిక్ చేస్తాడో.. ఉపేంద్ర.. ఆమిర్ ఖాన్ పాత్రలతో ఏం ట్విస్టులు ఇస్తారో అని ఉత్కంఠగా సినిమా చూస్తుంటే.. ఒక్కో పాత్ర నీరుగారిపోవడం మొదలువుతుంది. రజినీ చేసిన దేవా పాత్రే తుస్సుమనిపించేయడంతో ఉత్సాహం చల్లబడిపోతుంది. సైమన్ క్యారెక్టర్లో నాగార్జున కేవలం లుక్స్ తో మాత్రమే ఆకట్టుకుంటాడు తప్ప.. ఆ పాత్ర ప్రవేశించే వరకు ఇచ్చే బిల్డప్ కి.. తర్వాత అది ప్రవర్తించే తీరుకు పొంతన ఉండదు. హీరో-విలన్ మధ్య ఫేసాఫ్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే.. వారి మధ్య పేలవమైన సన్నివేశాలతో క్యూరియాసిటీ అంతా పోగొట్టేశాడు లోకేష్ కనకరాజ్.

తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న హీరో.. హీరో నెట్వర్క్ లోకి ఎలా ప్రవేశిస్తాడు.. ఎంత చాకచక్యంగా అక్కడి విషయాలన్నీ తెలుసుకుని తన లక్ష్యాన్ని సాధిస్తాడు అని చూస్తే.. అవన్నీ చాలా సింపుల్ గా జరిగిపోతాయి. మొదట్లో ఆసక్తికరంగా అనిపించే ‘మొబైల్ క్రిమేషన్’ కాన్సెప్ట్ తర్వాత సిల్లీగా తయారవుతుంది. విలన్ హీరోను అంత సులభంగా ఎలా నమ్మేస్తాడో.. హీరో అందరినీ అంత సింపుల్ గా ఎలా బోల్తా కొట్టించేస్తాడో అర్థం కాదు. విలన్.. అతడి గ్యాంగుతో హీరో రకరకాల ప్లే చేస్తుంటాడు కానీ.. ఏదీ లాజికల్ గా అనిపించదు. సౌబిన్ షాహిర్ చేసిన దయా పాత్రను రకరకాలుగా ట్విస్ట్ చేసి పడేయడంతో అతను ఎంత బాగా పెర్ఫామ్ చేసినా సరే ఆ క్యారెక్టర్ జనాలకు ఎక్కదు. మొబైల్ క్రిమేషన్.. స్మగ్లింగ్.. ఆర్గాన్ ట్రాఫికింగ్.. అంటూ చాలా కాన్సెప్టుల మీద కథను నడిపించినా.. దేన్నీ లోకేష్ సరిగా డీల్ చేయలేకపోయాడు. ఏదీ ఎక్కువసేపు ప్రేక్షకుల అటెన్షన్ ను నిలిపి ఉంచలేకపోయింది.

ప్రథమార్ధం అయినా కొంత ఎంగేజ్ చేస్తుంది కానీ.. రెండో అర్ధంలో తొలి గంట అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. నాగ్ పాత్ర ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో అని ఆశిస్తే.. అది పక్కకు వెళ్లిపోయి సౌబిన్ హైలైట్ అయిపోయాడు. రజినీ పాత్ర చివరి అరగంట ముందు వరకు నామమాత్రంగా అనిపిస్తుంది. చివర్లో సూపర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఆ పాత్రకు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. వరస్ట్ చూపించి తర్వాత కొంచెం బెటర్ గా అనిపించే సన్నివేశాలతో ‘కూలీ’కి కాస్త మెరుగైన ముగింపునిచ్చాడు లోకేష్ కనకరాజ్. దేవా పాత్రకు సంబంధించి ట్విస్ట్ ఇస్తూ సాగే చివరి అరగంటను ‘కూలీ’లో కాస్త ఎంగేజింగ్ ట్రాక్ గా చెప్పుకోవచ్చు. ఆఖర్లో రోలెక్స్ తరహాలో ఆమిర్ పాత్రను తీసుకొచ్చి ఏదో చేయాలని చూశారు కానీ.. అదంతా ప్రభావవంతంగా లేదు. ఓవరాల్ గా చూస్తే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్పిస్తే ‘కూలీ’లో ప్రేక్షకులు కోరుకునే స్థాయి మెరుపులు లేవు. సినిమా చూడాలనుకునేవాళ్లు అంచనాలను సాధ్యమైనంత తగ్గించుకుంటే మంచిది.

నటీనటులు: లోకేష్ దర్శకత్వంలో రజినీకాంత్ అనగానే ప్రేక్షకులు ఎంతో ఊహించుకుంటారు. కానీ దేవా పాత్రలో ఆయన మ్యాజిక్ చేయలేకపోయారు. ఆ పాత్ర హాఫ్ బేక్డ్ అనిపిస్తుంది. చివర్లో రజినీ మార్కు ఎలివేషన్లతో ఆయన అభిమానులకు కొంచెం కడుపు నిండుతుంది కానీ.. ఓవరాల్ గా మాత్రం నిరాశ తప్పదు. రజినీ చేసిన ఫైట్లు ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించవు. చాలా చోట్ల ఆయన పాత్ర నామమాత్రంగా అనిపిస్తుంది. సైమన్ పాత్రలో నాగార్జున కూడా అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయారు. నాగ్ లుక్ అదిరిపోయింది కానీ.. కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు కానీ.. ఆ పాత్ర మాత్రం అనుకున్నంత గొప్పగా లేదు. నాగ్ పెర్ఫామెన్స్ ఓకే. శ్రుతి హాసన్ కథలో కీలకమైన పాత్రలో రాణించింది. సత్యరాజ్ తక్కువ సన్నివేశాల్లోనే ఇంపాక్ట్ చూపించాడు. పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో బెస్ట్ మాత్రం సౌబిన్ షాహిరే. దయా పాత్రలో అతను అదరగొట్టాడు. ఉపేంద్ర గురించి చెప్పడానికేమీ లేదు. ఆమిర్ ఖాన్ తక్కువసేపే కనిపించినా తన ముద్రను చూపించాడు. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం: ‘కూలీ’ సినిమాకు తెర వెనుక అనిరుధ్ రవిచందర్ బాగానే డ్యూటీ చేశాడు. చాలా వరకు నీరసంగా సాగే సినిమాలో ఊపు తేవడానికి అతను గట్టి ప్రయత్నమే చేశాడు. తన పాటలు.. నేపథ్య సంగీతం రెండూ హుషారు పుట్టించేలా సాగాయి. మోనికా పాటలో తన మ్యూజిక్ అదిరిపోయినా.. దాని ప్లేస్మెంట్-టేకింగ్ అంత గొప్పగా లేవు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. లోకేష్ అభిరుచికి తగ్గట్లు నైట్ ఎఫెక్ట్ లో సన్నివేశాలను ఆకర్షణీయంగా తీశాడు. సన్ పిక్చర్స్ వాళ్ల నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఎన్నో అంశాల కలబోతతో ఏదో చేసేయాలని చూశాడు కానీ.. తెర మీద వాటి ప్రభావం అంతంతమాత్రమే. తన రైటింగే తేడా కొట్టేసింది. ఏ పాత్రనూ సరిగా తీర్చిదిద్దకపోవడం.. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండడం.. నరేషన్ చాలా చోట్ల బోరింగ్ గా సాగడంతో ‘కూలీ’ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. కాస్త కుదురుగా కథ చెప్పడం మీద అతను దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని ‘కూలీ’ నొక్కి చెబుతుంది.

చివరగా: కూలీ.. కంటెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ

రేటింగ్-2.5/5