వాళ్లకిప్పుడు కావాల్సింది అది మాత్రమే!
మరి ఇప్పుడు కాంబినేషన్ కంటే కంటెంట్ పై దృష్టి పెట్టాల్సిన స్టార్ డైరెక్టర్ ఎవరున్నారు? అంటే ప్రధానంగా ముగ్గురు సంచలనాలు కనిపిస్తున్నారు.
By: Tupaki Desk | 11 July 2025 1:00 AM ISTఇటీవలే నిర్మాత దిల్ రాజు ఓ మాట అన్నారు. కాంబినేషన్లు కాదు. కంటెంట్ ని నమ్మి సినిమా చేయాలని. కాంబినేషన్లు అన్నది కేవలం మార్కెటింగ్ కోసం తప్ప అంతకు మించి సాధించేదేమి ఉండదని...కేవలం కంటెంట్ మాత్రమే జనాల్ని థియేటర్ కు తీసుకొస్తుందని బలంగా చెప్పారు. ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ వీళ్లంతా పాన్ ఇండియా స్టార్లు అయింది కంటెంట్ తో మాత్రమేననన్నారు. బలమైన కంటెంట్ కి కాంబి నేషన్ తొడైతే వర్కౌట్ అవుతుంది గానీ..కాంబినేషన్లు నమ్మి సినిమలు చేస్తే వర్కౌట్ అవ్వదని ఖరా ఖండీగా చెప్పేసారు.
మరి ఇప్పుడు కాంబినేషన్ కంటే కంటెంట్ పై దృష్టి పెట్టాల్సిన స్టార్ డైరెక్టర్ ఎవరున్నారు? అంటే ప్రధానంగా ముగ్గురు సంచలనాలు కనిపిస్తున్నారు. వాళ్లే శంకర్, మణిరత్నం, పూరి జగన్నాధ్. కొంత కాలంగా వీళ్ల సినిమాలు ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వడం. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం. ప్రతిగా తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోవడం. చివరకు మణిరత్నం అయితే 'థగ్ లైఫ్' విషయంలో ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పారంటే సన్నివేశం ఎంత దారుణంగా ఉందో అద్దం పడుతుంది.
శంకర్-మణిరత్నం సినిమాలు అగ్ర తారలతోనే రూపొందు తుంటాయి. వాటికి బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది. ప్రత్యేకించి శంకర్ సినిమాల్లో హైప్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిర్మాత కోట్లు కోట్లు పెట్టాల్సిందే. డబ్బు మంచి నీళ్లలో ఖర్చు అవుతుంది. రిలీజ్ తర్వాత సినిమా చూస్తే ఆ పాటి స్టోరీకి సంవత్సరాలు టైమ్ తీసుకోవాలా? అన్న ఒక్క విమర్శ మోయాల్సిన పరిస్థితి. `2.0` తర్వాత శంకర్ కి సరైన ఒక్కటి కూడా లేదు.
'ఇండియన్ 2', 'గేమ్ ఛేంజర్' రెండు చిత్రాల్లో తడి తమాషా ఎక్కువ అన్నట్లే ఉంటాయి. ఏ మాత్రం కథాబలం లేని చిత్రాలుగా తేలిపోయాయి. దీంతో 'ఇండియన్ 3' రిలీజ్ కు కూడా నోచుకోని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. 'పొన్నియన్ సెల్వన్'తో మణిరత్నం రూట్ మార్చారంటే? 'థగ్ లైఫ్' తో మళ్లీ పాత చింతకాయ పచ్చడే రుచి చూపించారు. రొటీన్ కథతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.
ఈ రెండు సినిమాలు కూడా కాంబినేషన్ హైప్ తో వచ్చినవే. ఆ హైప్ తో థియేటర్ కి వెళ్లి చూస్తే కథా బలం లేని చిత్రాలుగా తేలిపోయాయి. పూరి సినిమాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. `ఇస్మార్ట్ శంకర్` ఆడినా? ఆ తర్వాత చేసిన `లైగర్`, `డబుల్ ఇస్మార్ట్` ప్లాప్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు రొటీన్ స్టోరీలే. దీంతో పూరి కాంబినేషన్ కంటే కంటెంట్ మీద దృష్టి పెట్టాలని ఓపెన్ గానే అభిమానులు అభి ప్రాయపడ్డారు. మరి అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల విషయంలో ఈ నయా డైరెక్టర్లు ఎంత బలమైన కంటెంట్ తో వస్తారో చూడాలి.
