Begin typing your search above and press return to search.

'కామ్రేడ్ కల్యాణ్' మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   9 Oct 2026 4:57 AM IST
కామ్రేడ్ కల్యాణ్ మూవీ రివ్యూ
X

‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ విష్ణు- మహిమ నంబియార్- సత్య- టామ్ షైన్ చాకో- సుదర్శన్- రాధిక శరత్ కుమార్- సాయిచంద్- శత్రు- ఉపేంద్ర లిమాయే తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్

రచన: భాను-నందు-కోన వెంకట్

నిర్మాత: వెంకట కృష్ణ

దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ళ

సీరియస్ సినిమాలతో మొదలుపెట్టి.. కామెడీ వైపు టర్న్ అయి.. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. సామజవరగమన.. సింగిల్.. శ్వాగ్ లాంటి చిత్రాలతో అలరించిన అతను.. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ అవతారం ఎత్తాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో శ్రీవిష్ణు అలరించాడా? చూద్దాం పదండి.

కథ:

కళ్యాణ్ (శ్రీవిష్ణు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో తొంభైవ దశకంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మాడుగుల అనే ఊరికి చెందిన కుర్రాడు. అక్కడ ఒక థియేటర్ లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒరియా అమ్మాయి సితార దేవి (మహిమ నంబియార్)తో అతను ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె తెలుగమ్మాయే అని.. ఒక పెద్ద సమస్యలో చిక్కుకుని ఆ ఊరికి వచ్చిందని తెలుస్తుంది. ఆమెను ఆ సమస్య నుంచి బయటపడేయడం కోసం అనూహ్యంగా నక్సలైట్ అవతారం ఎత్తాల్సి వస్తుంది కళ్యాణ్. సింపుల్ అనుకున్న విషయం కాస్తా సీరియస్ అయి అతను అడవుల్లో అన్నలతో పాటు అడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకీ సితారకు వచ్చిన సమస్యేంటి.. దానికి కళ్యాణ్ నక్సలైట్ కావడానికి సంబంధమేంటి.. ఈ ఉచ్చు నుంచి అతను బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

నక్సలిజం అన్నది చాలా సీరియస్.. సెన్సెటివ్ సబ్జెక్ట్. హీరో ఆ అవతారం ఎత్తాడంటే ఆ కథ నడిచే టోనే వేరుగా ఉంటుంది. కానీ శ్రీ విష్ణు ఏమో ఈ మధ్య వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్న హీరో. ఉన్నట్లుండి అతను ఇంత సీరియస్ పాత్ర ఎందుకు చేస్తున్నాడబ్బా అనుకున్నారంతా. కానీ తీరా చూస్తే ఇది కూడా కామెడీ సినిమానే అని ప్రోమోలు క్లారిటీ ఇచ్చాయి. మరి సీరియస్ సబ్జెక్టులో కామెడీ ఎలాగబ్బా అనే సందేహాల మధ్య ‘కామ్రేడ్ కళ్యాణ్ థియేటర్లో కూర్చుంటే.. ఈ కథ కొంచెం మింగుడుపడనట్లే సాగుతుంది. నక్సలైట్లు ఇంత సిల్లీగా వ్యవహారాలు నడుపుతారా.. పోలీసులు ఇంత డమ్మీగా ఉంటారా.. ఒక మామూలు కుర్రాడు ఇద్దరితో ఇలా ఆడేసుకుంటాడా అనిపించేలా ఇందులో కథ నడుస్తుంది. కానీ కథ-పాత్రల గురించి ఎక్కువ ఆలోచించకుండా.. లాజిక్కులేమీ పట్టించుకోకుండా.. కేవలం కామెడీ మీదే ఫోకస్ చేసి నవ్వుకుంటాం అంటే మాత్రం శ్రీవిష్ణు అండ్ గ్యాంగ్ టైంపాస్ వినోదాన్ని అందిస్తుంది.

‘కామ్రేడ్ కళ్యాణ్’లో నక్సలిజంను కామెడీగా ఏమీ చూపించలేదని.. సిచువేషన్లన్నీ సీరియస్ గానే ఉంటాయని.. కానీ చూసే ప్రేక్షకులకు మాత్రం ఫన్నీగా అనిపించి నవ్వుకుంటారని చెప్పాడు శ్రీవిష్ణు. ఐతే తను చెప్పినంత సీరియస్ గా ఏమీ ఈ కథ నడవలేదు. చాాలా కన్వీనియెంట్ గా.. చాలా తేలికగా కథను నడపించారిందులో. తన అవసరం కోసం అనుకోకుండా నక్సలైట్ వేషంవేసిన హీరో.. ఒరిజినల్ నక్సలైట్లు-పోలీసుల మధ్య చిక్కుకుని నానా తంటాలు పడే ఈ సినిమా లైన్ నిజానికి భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ లైన్ ను పకడ్బందీగా చెబితే.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ క్రేజీ మూవీ అయ్యేది. కానీ లైన్ బాగున్నప్పటికీ.. ఈ వ్యవహారాన్ని అవసరమైన తీవ్రతతో చూపించలేదు. కామెడీ సినిమాలో ఇంటెన్సిటీ ఎందుకు అనిపించొచ్చు. కానీ శ్రీవిష్ణు చెప్పినట్లు ఆ సీరియస్నెస్ ఉంటేనే కథ పండుతుంది. సిచువేషన్ ను సీరియస్ గా చూపించి అందులోంచి నవ్వులు పండించవచ్చు. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ రైటర్లు కానీ.. దర్శకుడు కానీ.. ఈ కథను ఎక్కడా సీరియస్ గా చెప్పే ప్రయత్నం చేయలేదు. కథనంతా కూడా కామెడీగానే డీల్ చేశారు. దాని వల్ల భలేగా అనిపించాల్సిన సినిమా కాస్తా.. జస్ట్ ఓకే అనిపించేలా తయారైంది.

తన జీవితాన్నే రిస్కులో పెట్టుకుని హీరో నక్సలైట్ అయిపోవడానికి ఇందులో బలమైన కారణం కనిపించదు. హీరోయిన్ కోసం ఇదంతా చేస్తాడని చూపిస్తారు కానీ.. ఆమెతో అతడి ప్రేమకథను సరిగా బిల్డ్ చేయకపోవడం.. హీరో ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన ఎమోషన్ లేకపోవడం వల్ల ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేం. ఇక నక్సలైట్లలో కలిసిపోయాక హీరో వేసే ఎత్తుగడలు.. దానికి దళం నాయకులు స్పందించే తీరు.. నక్సలైట్లను పట్టుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు.. మంత్రి గారి కిడ్నాప్ వ్యవహారం.. వేటినీ సీరియస్ గా తీసుకోని విధంగా.. కొంచెం సిల్లీగా నడిపించారు. కానీ కథ-పాత్రలు ఎలా ఉన్నాయన్నది పక్కనపెడితే.. ‘కామ్రేడ్ కళ్యాణ్’లో కామెడీ డోస్ కు అయితే ఢోకా లేదు. ముందే అన్నట్లు లాజిక్కులు పక్కన పెట్టి ఇందులో కామెడీ పంచులను ఎంజాయ్ చేయొచ్చు.

శ్రీవిష్ణు క్యారెక్టర్ నుంచి ప్రేక్షకులు ఆశించే సెటైరికల్ ఫన్ ఇందులో కూడా వర్కవుట్ అయింది. అతడి వన్ లైనర్స్ బాగా పేలాయి. సత్య రూపంలో అతడికి భలే తోడు దొరికాడు. ఇద్దరూ కలిసి కొన్ని సీన్లలో భలే కామెడీ చేశారు. శ్రీ విష్ణు కోసం సత్య రాసే ఇంగ్లిల్ లవ్ లెటర్ సీన్.. శ్రీవిష్ణు-సత్య నక్సలైట్ల మధ్య చిక్కుకున్నాక పడే పాట్ల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు.. హిలేరియస్ గా అనిపిస్తాయి. ఇద్దరూ తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తారు. వారి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా సూపర్ ఫాంలో ఉన్న సత్య.. మరోసారి చక్కిలిగింతలు పెట్టాడు. తన పాత్ర బాాగానే పేలింది. వెన్నెల కిషోర్ ఉన్నది ఒక్క సీన్లోనే అయినా.. మాస్ మెచ్చే కామెడీతో అలరించాడు. శ్రీవిష్ణు తన మీద తాను పంచ్ వేసుకోవడమే కాదు.. అతడితో పాటు ఇండస్ట్రీ జనాల మీద.. వేరే సినిమాల రెఫరెన్సులతో వేసిన పంచులు పేలాయి. టామ్ షైన్ చాకో పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా ఊహించుకుంటాం కానీ.. దాన్ని సరిగా డిజైన్ చేయలేదు. అది ఇటు కామెడీగానూ లేక.. అటు అంత సీరియస్ గానూ సాగక అంతగా ఇంపాక్ట్ వేయలేకపోయింది. తొలి గంటలో కొన్ని కామెడీ సీన్ల వరకు ఓకే అనిపించే ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఇంటర్వెల్ దగ్గర క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. కానీ దాన్ని నిలబెట్టే స్థాయిలో ద్వితీయార్ధం సాగలేదు. పడుతూ లేస్తూ సాగే ద్వితీయార్ధంలో కూడా అక్కడక్కడా కామెడీ వర్కవుట్ అయింది. చివరికి ఓ సందేశంతో ముగిసే ‘కామ్రేడ్ కళ్యాణ్’ అంత గొప్ప అనుభూతిని ఇవ్వదు. అలా అని ఇది బోర్ కొట్టించే సినిమా కూడా కాదు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ వినోదం కోసమైతే ఒక లుక్కేయొచ్చు.

నటీనటులు:

శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ కు బాగా కుదిరే పాత్రే పడింది ‘కామ్రేడ్ కళ్యాణ్’లో. తన వరకు ప్రతి సన్నివేశంలోనూ ఎంటర్టైన్ చేశాడు. తన నుంచి ఆశించే వినోదాన్ని అతను ఇచ్చేశాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్లను కూడా బాగా పలికించాడు. మహిమ నంబియార్ చూడ్డానికి బాగుంది. నటన కూడా ఓకే. తన పాత్ర అంత బలంగా లేకపోయినా.. మహిమ పెర్ఫామెన్స్ అయితే బాగానే సాగింది. సత్య ఈ సినిమాకు పెద్ద ఆకర్షణగా మారాడు. కొన్ని సన్నివేశాల్లో శ్రీవిష్ణును మించి నవ్వించాడు. తన హావభావాలు.. పంచులు బాగా పేలాయి. సుదర్శన్ కూడా తన వంతుగా కామెడీ డోస్ ఇచ్చాడు. వెన్నెల కిషోర్ కనిపించిన కాసేపు హంగామా చేసి వెళ్తాడు. నక్సలైట్ నాయకులుగా సాయిచంద్.. శత్రు ఇద్దరూ బాగా చేశారు. ఉపేంద్ర లిమాయే కామెడీ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. రాధిక శరత్ కుమార్ పాత్రను మొదట్లో చూసి ఏదో అనుకుంటాం కానీ.. ఆమెను సరిగా ఉపయోగించుకోలేదు. తన పాత్రను తేల్చిపడేశారు. శ్రీకాంత్ అయ్యంగార్.. రఘుబాబు.. సరయు.. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

‘కామ్రేడ్ కళ్యాణ్’లో టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. పల్లెటూరు.. అడవి నేపథ్యంలో సన్నివేశాలను సహజంగా.. అందంగా తీర్చిదిద్దాడు. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. విజయ్ బుల్గానిన్ పాటలు ఒక మోస్తరుగా అనిపిస్తాయి. ఒరియా అమ్మాయి పాట వినసొంపుగా సాగింది. బీజీఎం బాగానే కుదిరింది. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఏమీ ఢోకా లేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చుపెట్టారు. క్వాలిటీ చూపించారు. ఇక రైటింగ్ విషయానికి వస్తే ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూల కథ బాగుంది. ‘సామజవరగమన’తో పేరు సంపాదించిన భాను-నందు క్రియేట్ చేసిన కామెడీ సిచువేషన్లు.. పంచులు కూడా పేలాయి. కానీ స్క్రిప్టులో బిగి మాత్రం లేదు. నక్సలిజం మీద కథను మరీ ఇంత నాన్ సీరియస్ గా నడిపించడం మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. దర్శకుడు జానకిరామ్ మారెళ్ళ కామెడీని బాగానే డీల్ చేయగలడనడానికి అనేక సన్నివేశాలు రుజువుగా నిలుస్తాయి. తన కామెడీ ఫ్లో బాగుంది. కానీ సీరియస్ గా కథ చెప్పాల్సిన చోట మాత్రం మరీ తేలిగ్గా నడిపించేశాడు.

చివరగా: కామ్రేడ్ కళ్యాణ్..శ్రీవిష్ణు-సత్యల కామెడీ కోసం

రేటింగ్ - 2.75/5