Begin typing your search above and press return to search.

కామెడీలో ఉండాల్సిన ఆ లక్ష్మణ రేఖ ఏంటి?

ముఖ్యంగా రోస్ట్ కామెడీ - స్టాండప్ కామెడీ పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబ సమస్యలను లేదా విడాకుల వంటి సున్నితమైన అంశాలను బహిరంగంగా విమర్శించడం ఒక ఫ్యాషన్‌గా మారింది.

By:  Srikanth Kontham   |   13 April 2026 7:00 PM IST
కామెడీలో ఉండాల్సిన ఆ లక్ష్మణ రేఖ ఏంటి?
X

హాస్యం మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఒక గొప్ప సాధనం. అయితే నేటి కాలంలో కామెడీ స్వరూపం పూర్తిగా మారిపోతోంది. ముఖ్యంగా రోస్ట్ కామెడీ - స్టాండప్ కామెడీ పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబ సమస్యలను లేదా విడాకుల వంటి సున్నితమైన అంశాలను బహిరంగంగా విమర్శించడం ఒక ఫ్యాషన్‌గా మారింది. భావప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కు. కానీ అది మరొకరి వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నప్పుడు అది హాస్యం అనిపించుకోదు.

సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన వారి వ్యక్తిగత జీవితంపై ఎవరికైనా జోకులు వేసే హక్కు ఉంటుందనుకోవడం పొరపాటే అవుతుంది. ప్రతి మనిషికి ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. వారి వైవాహిక బంధాలు, కుటుంబ కలహాలు , ఆరోగ్య సమస్యలను వెక్కిరిస్తూ నవ్వులు పూయించడం నైతికంగా సమంజసం కాదు. హాస్యం అనేది ఎదుటివారిని నవ్వించాలి తప్ప వారిని మానసిక వేదనకు గురిచేసేలా వారి ప్రతిష్టను దిగజార్చేలా ఉండకూడదు.

దురదృష్టవశాత్తు నేటి డిజిటల్ యుగంలో వ్యూస్ , పాపులారిటీ కోసం చాలామంది కమెడియన్లు హాస్యానికి, వ్యక్తిగత దూషణకు మధ్య ఉండాల్సిన ఆ సన్నని రేఖను దాటుతున్నారు. ఒక వ్యక్తి వైఫల్యాలను ,బాధను వేదికపై తమాషాగా ప్రదర్శించినప్పుడు అది చూసే ప్రేక్షకులకు తాత్కాలిక వినోదాన్ని ఇవ్వచ్చు. కానీ అది సమాజంలో ఒక చెడు సంప్రదాయానికి దారితీస్తుంది. విమర్శ అనేది ఒక వ్యక్తి చేసే పని లేదా విధానంపై ఉండాలి తప్ప వారి వ్యక్తిగత జీవితంపై కాదని గుర్తించాలి.

స్టాండప్ కమెడియన్లు తరచుగా భావప్రకటన స్వేచ్ఛను ఒక కవచంగా వాడుతున్నారు. అయితే ఏ స్వేచ్ఛ కూడా సంపూర్ణమైనది కాదు. సామాజిక బాధ్యత లేని స్వేచ్ఛ అరాచకానికి దారితీస్తుంది. ముఖ్యంగా దేశంలో సెలబ్రిటీల పట్ల అభిమానులకు ఉండే భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోకుండా చేసే కొన్ని ర‌కాల వ్యాఖ్యలు అనవసరమైన వివాదాల‌కు, సోషల్ మీడియా దాడులకు కారణమవుతున్నాయి. ఆరోగ్యకరమైన హాస్యం ఎప్పుడూ ఒకరిని కించప రచకుండానే నవ్వులు పూయిస్తుంది. కమెడియన్లు తమ సృజనాత్మకతను మెరుగుపరుచుకోవాలి తప్ప ఇతరుల బలహీనతలపై ఆధారపడకూడదు.

జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దిగ్గజాలు ఎవరినీ నొప్పించకుండానే అద్భుతమైన హాస్యాన్ని పండించారు. నేటి తరం కొంత మంది ద‌ర్శ‌కులు, కమెడియన్లు కూడా ఆ లక్ష్మణ రేఖను గౌరవిస్తూ బాధ్యతా యుతమైన హాస్యాన్ని అందించినప్పుడే ఆ రంగానికి గౌరవం పెరుగుతుంది. లేనిపక్షంలో కామెడీ అనేది కేవలం ఒక వ్యక్తిగత దూషణల వేదికగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్న‌ది అంతే వాస్త‌వం.