కల్నల్ సోఫియా కవల సోదరి.. బాలీవుడ్ షేకవ్వాలంతే!
`ఆపరేషన్ సింధూర్` సైనిక బ్రీఫింగ్ లో అత్యంత ఆకర్షణీయమైన మహిళా అధికారిగా కల్నల్ సోఫియా ఖురేషి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 May 2025 5:06 AM`ఆపరేషన్ సింధూర్` సైనిక బ్రీఫింగ్ లో అత్యంత ఆకర్షణీయమైన మహిళా అధికారిగా కల్నల్ సోఫియా ఖురేషి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఒక భారతీయ మహిళ నుదిటిన సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రమూకల అంతం చూసామని ప్రకటిస్తూ, మహిళా అధికారి సోఫియా ఖురేషి ఆపరేషన్ గురించి మాట్లాడటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే అదే సమయంలో సోఫియా ఖురేషి ట్విన్ సిస్టర్ గురించిన వార్తలు కూడా మీడియాలో సంచలనం సృష్టించాయి. సోఫియా భారత సైన్యంలో కీలక అధికారిగా ధైర్యవంతమైన ఆపరేషన్లతో ఆకర్షిస్తే, తన కవల సోదరి డాక్టర్ షైనా సున్సారా తన అందంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తూ కనిపించారు. ఆమె ఎవరు? బాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తున్నారా? అంటూ యూత్ ఆరాలు తీసారు. అయితే ఈ ఆరాల్లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
కల్నల్ సోఫియా ఖురేషి- డాక్టర్ షైనా సున్సారా కవల సోదరీమణులు. తన సోదరి సైనిక బ్రీఫింగ్ ఇచ్చేప్పుడు తనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో టీవీ చూడాల్సిందిగా చెప్పారు. వెంటనే టీవీ ఆన్ చేసి చూస్తే సోఫియా అద్భుత ప్రసంగం, తన సోదరి యూనిఫాంలో నిటారుగా నిలబడి కనిపించగా, దానిని గర్వంగా, విస్మయంతో చూశారు షైనా. తన సోదరిని జాతీయ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో చూడడం తీవ్ర భావోద్వేగాన్ని కలిగించింది. ఇది కుటుంబ గర్వానికి సంబంధించినది మాత్రమే కాదు.. జాతీయ గర్వానికి సంబంధించిన విషయం కూడా. ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ ద్వారా బలంగా ప్రతిస్పందించామని చెబుతూనే, భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా ఖురేషి ప్రశంసించారు.
అక్కా చెల్లెళ్ల మూలాలను చూస్తే దేశ భక్తులుగా రకరకాల కోణాల్లో వారి మూలాలు ఆసక్తిని కలిగించాయి. ముఖ్యంగా డాక్టర్ షేనా సున్సారా వడోదర వండర్ ఉమెన్ గా, అందాల రాణిగాను ఎంతో పాపులర్. శ్రీమతి గుజరాత్, శ్రీమతి ఇండియా ఎర్త్ 2017 .. శ్రీమతి యునైటెడ్ నేషన్స్ 2018 పురస్కారాలను గెలుచుకున్న అందాల రాణి ఆమె. సైనా సున్సారా 2018లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కారం అందుకున్నారు. వీటన్నిటికీ మించి ఆమె గొప్ప పర్యావరణ వేత్త. గుజరాత్ అంతటా 1,00,000 చెట్లను నాటడానికి సైనా సున్సారా చొరవ తీసుకున్నారు. ఆమె జాతీయ - అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నారు. తన సోదరి కల్నల్ సోఫియా దేశసేవలో అందరికీ స్ఫూర్తినిస్తే సైనా సున్సారా చాలా మార్గాల్లో నేటితరానికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే సైనా సున్సారా బాలీవుడ్ లో ప్రవేశించి ఉంటే అగ్ర కథానాయికగా ఎదిగేదని కూడా ఇప్పుడు అభిమానులు అంచనా వేస్తున్నారు.