ఈ హీరోయిన్‌లా కాక్‌టైల్ కలపగలరా?
అందుకే కాక్ టైల్ విడుదలైన 13 సంవత్సరాలు గడిచినా కానీ, కాక్టెయిల్ 2 ప్రకటన అందరిలో ఉత్సాహం నింపింది.
By: Tupaki Desk | 6 July 2025 7:00 PM ISTఒక అమ్మాయి అబ్బాయి.. ఆ ఇద్దరి మధ్యలో మరో అమ్మాయి.. అసలు ఈ రోజుల్లో ఏది స్నేహమో, ఏది ప్రేమో! కనిపెట్టడమెలా? మంచిగా బుద్ధిగా ఉండే అమ్మాయిని అబ్బాయి ఎంపిక చేసుకుంటాడా లేదా నిత్యం మత్తులో జోగే, బాటిల్ లేనిదే జీవించలేని చిలిపితనం అల్లరి కలగలిసిన కొంటె అమ్మాయినే ప్రేమించాడా? అసలు లవ్ లో పడటానికి అమ్మాయిలో అబ్బాయి ఏం చూస్తాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది కాక్ టైల్ సినిమా. ఇందులో ప్రేమ, స్నేహం మధ్య కన్ఫ్యూజన్ ని కూడా దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెరోనికా- గౌతమ్- మీరా మధ్య స్నేహం, ప్రేమ, పరిణతి వగైరా అంశాలను లోతుగా ఆవిష్కరించిన ఎమోషనల్ రొమాంటిక్ రైడ్ అని అంగీకరించాలి.
ముఖ్యంగా ఈ సినిమాలో వెరోనికా పాత్రలో నటించిన దీపిక నటనకు ఫిదా కాని వారు ఉండరు. అసలు ఏ అమ్మాయితో స్నేహం చేయాలి? అని వెతికే గౌతమ్ (సైఫ్ ఖాన్) కి వెరోనికా (దీపిక) పరిచయం అయ్యాక కథంతా మారిపోతుంది. ఇక వెరోనికా- గౌతమ్- మీరా మధ్య స్నేహం కుదిరాక, ఆ ముగ్గురి ప్రయాణం ఎలా సాగింది? అన్న కథతో లైఫ్ లో రిలేషన్ షిప్స్ కాంప్లికేషన్స్ ని దర్శకుడు ఎంతో అందంగా మలిచాడు.
అందుకే కాక్ టైల్ విడుదలైన 13 సంవత్సరాలు గడిచినా కానీ, కాక్టెయిల్ 2 ప్రకటన అందరిలో ఉత్సాహం నింపింది. అయితే పార్ట్ 2లో దీపిక - డయానా పెంటీ స్థానంలో రష్మిక మందన్న, కృతి సనోన్ నటిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరు బుద్ధిమంతురాలైన గాళ్ ఫ్రెండ్.. ఎవరు కొంటె గాళ్ ఫ్రెండ్? అన్నది ఆసక్తిని పెంచుతోంది. ఇక ఆ ఇద్దరితో డీల్ చేసే వాడిగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అయితే ఒరిజినల్ (మొదటి భాగం)లో నటించిన దీపికను రీప్లేస్ చేసేది ఎవరు? కృతి సనోన్ లేదా రష్మిక. దీనికి ఇంకా చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ ఇద్దరిలో ఎవరికి ఆ అవకాశం వచ్చినా, దానిని దీపికతో మ్యాచ్ చేయగలరా? అంటూ క్లిష్ఠమైన ప్రశ్న ఎదురైంది.
నేటితరం అభినయనేత్రి కృతి సనోన్ కొంటెతనం నిండిన పాత్రల్లో అద్భుతంగా రాణించగలదు. అదే సమయంలో రష్మిక మందన్నను తక్కువగా చూడటానికేం లేదు. గాంభీర్యం ఉన్న సీరియస్ పాత్రలతో మెప్పించగలదు.. ఫన్ రైడ్ ఉన్న పాత్రలతోను రష్మిక ఆకట్టుకోగలదు. పుష్ప, పుష్ప 2 , సరిలేరు నీకెవ్వరు, యానిమల్ లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన రష్మికను చూడగలం. వీటన్నిటి కంటే భిన్నమైన క్లిష్ఠమైన పాత్రతో మెప్పించేందుకు రష్మిక సిద్ధంగా ఉందనే భావించాలి. దీపిక పదుకొనే కెరీర్ గ్రాఫ్ ని విపరీతంగా ప్రభావితం చేసింది వెరోనికా పాత్ర. ఇప్పుడు అదే తరహా పాత్రలో అవకాశం అందుకునే ఏ కథానాయికకు అయినా అది పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. కాక్ టైల్ కథ, పాత్రలు ఎలా వర్కవుటయ్యాయో అదే విధంగా కాక్ టైల్ 2 లోని కథ, కథనం, పాత్రలు అంతే రేంజులో వర్కవుటవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
