'ఒకే ఒక్కడు' గుర్తొచ్చిందని సీఎం విజయ్ అన్నారు: యాక్షన్ కింగ్ అర్జున్
భారతీయ రాజకీయాల్లో సంచలనాలను సృష్టిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు.
By: Sivaji Kontham | 26 May 2026 11:36 PM ISTభారతీయ రాజకీయాల్లో సంచలనాలను సృష్టిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. టీవీకే నాయకుడిగా అతడి అఖండ రాజకీయ విజయాన్ని సీఎం హోదాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను అటు ప్రజలతో పాటు, ఇటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌తో కలిసి గతంలో `లియో` చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్న `యాక్షన్ కింగ్` అర్జున్ సర్జా ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్‌లో విజయ్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తామిద్దరం వ్యక్తిగతంగా కలుసుకున్నామని.. ఆ సమయంలో వారి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 1999 నాటి పొలిటికల్ క్లాసిక్ చిత్రం 'ముదల్వన్' (తెలుగులో ఒకే ఒక్కడు) భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయి. విజయ్ తమిళనాడు సీఎం సీటును అధిష్టించినప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన వందలాది మీమ్స్ ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. దీనిపై అర్జున్ స్పందిస్తూ.. తాను ఇటీవల సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఆ మీమ్స్ అన్నింటినీ విజయ్ చూశారని స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా తాను మొదటిసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తరుణంలో తనకు అర్జున్ నటించిన `ఒకే ఒక్కడు` సినిమానే గుర్తొచ్చిందని విజయ్ తనతో అన్నట్లు అర్జున్ మీడియా ముఖంగా పేర్కొన్నారు.
రీల్ లైఫ్ `ఒకే ఒక్కడు` అర్జున్, రియల్ లైఫ్ 'ముదల్వన్' విజయ్‌ను కలిసి అభినందించడమే కాకుండా ఆ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసారు. వారం క్రితం భేటీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని సోషల్ మీడియాల్లో షేర్ చేసారు. ఆ ఫోటోలకు ''మా ప్రియతమ ముదల్వన్ (నాయకుడు) సి. జోసెఫ్ విజయ్ తో..'' అంటూ ఎంతో గౌరవంగా క్యాప్షన్ ఇచ్చారు. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ.. వారి సంక్షేమ బాధ్యతలను భుజానకెత్తుకున్న సీఎం విజయ్‌కు భగవంతుడు మరింత శక్తిని, ఆయురారోగ్యాలను.. సరైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ అర్జున్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు రాజకీయ వర్గాల్లోనూ విజయ్ సాధించిన ఈ ఐకానిక్ విజయంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం విజయ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``వారు కేవలం కటౌట్లు పెట్టి గెలవలేదు`` అని పేర్కొంటూ విజయ్ సాధించిన ఘన విజయంపై ప్రశంసలు కురిపించారు. ఒక నటుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని.. ఇప్పుడు ప్రజా నాయకుడిగా మారి ఒకే ఒక్కడు తరహాలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న విజయ్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఒకప్పుడు థియేటర్లలో రికార్డులు సృష్టించిన దళపతి నేడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. అర్జున్ సర్జా అన్నట్లుగా.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ రియల్ లైఫ్ `ముదల్వన్` తమిళనాడు రాజకీయాల్లో మరింత బలమైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
