Begin typing your search above and press return to search.

20 ఏళ్ల నిరీక్షణ..100 మంది దుర్మార్గులపై పోరాటం.. నోలన్ 'ది ఒడిస్సీ' కథ ఇదే!

నోల‌న్ తెర‌కెక్కించిన 'ది ఒడిస్సీ' సినిమా కోసం ఇన్నాళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించి నేడు జ‌నం థియేట‌ర్ల‌కు పోటెత్తారు.

By:  Sivaji Kontham   |   17 July 2026 3:49 PM IST
20 ఏళ్ల నిరీక్షణ..100 మంది దుర్మార్గులపై పోరాటం.. నోలన్ ది ఒడిస్సీ కథ ఇదే!
X

నోల‌న్ తెర‌కెక్కించిన `ది ఒడిస్సీ` సినిమా కోసం ఇన్నాళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించి నేడు జ‌నం థియేట‌ర్ల‌కు పోటెత్తారు. భార‌త‌దేశంలో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఖాన్ ల సినిమాకు కూడా లేదంటే అతిశ‌యోక్తి కాదు. మొద‌టి రోజు ఈ చిత్రం ఏకంగా 20 కోట్లు వ‌సూలు చేయ‌డం అనేది ఒక చ‌రిత్ర‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల వ‌ద్ద నోలాన్ ఫ్యాన్స్ హంగామా స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.

ఇదిలా ఉంటే నోల‌న్ 'ది ఒడిస్సీ' సినిమాని చూసి అర్థం చేసుకోవాలంటే, హోమ‌ర్ `ది ఒడిస్సీ` క‌థ గురించి, అందులోని పాత్ర‌ల గురించి ముందే తెలుసుకుంటే.. థియేట‌ర్ల‌లో ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ ఉండ‌ద‌ని విశ్లేషిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన.. విశిష్ఠ‌మైన మహాకావ్యాలలో 'ది ఒడిస్సీ' క‌థ‌కు ఎంతో ప్రాచుర్యం ఉంది. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ గ్రీకు అంధ మహాకవి హోమర్ దీనిని రచించారు. గ్రీకులకు - ట్రోజన్లకు మధ్య జరిగిన సుదీర్ఘ యుద్ధం నేపథ్యంలో సాగే `ఇలియడ్` కావ్యానికి ఇది కొనసాగింపు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' చిత్రానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పాజిటివ్ సమీక్షలు వస్తున్నాయి. అయితే నోలన్ ఈ వెండితెర వింతను అర్థం చేసుకోవాలంటే.. ప్రేక్షకులు ముందుగా హోమర్ రాసిన మూల కథను తెలుసుకోవడం ఎంతో అవసరం.. లేదంటే సినిమాను పూర్తిగా ఆస్వాధించడం కష్టమవుతుంది.

ఈ పురాణ గాథలోని ప్రధాన ఇతివృత్తం అంతా 'ఇథాకా' ద్వీపపు రాజైన ఒడిస్సియస్ చుట్టూ తిరుగుతుంది. ట్రోజన్ యుద్ధంలో గ్రీకుల గెలుపు కోసం `ట్రోజన్ గుర్రం` అనే ఒక వినూత్న ఉపాయాన్ని పన్ని యుద్ధాన్ని ముగించిన ఒడిస్సియస్... తన స్వగ్రామానికి తిరిగి ప్రయాణమవుతాడు. అయితే యుద్ధం ముగిసిన తర్వాత అతను చేసిన కొన్ని పొరపాట్లు..చూపిన అహంకారం వల్ల సముద్ర దేవుడైన పోసైడన్ ఆగ్రహానికి గురవుతాడు. ఫలితంగా.. కేవలం కొన్ని వారాల్లో పూర్తి కావాల్సిన అతడి తిరుగు ప్రయాణం... పదేళ్ల పాటు సాగిన ఒక మహా ఘోర సముద్ర పోరాటంగా మారిపోతుంది. దర్శకుడు నోలన్ ఈ ఒడిస్సియన్ తిరుగు ప్రయాణాన్ని.. అందులోని అడుగడుగునా ఎదురయ్యే వింతలను స్క్రీన్ పై అద్భుతంగా చూపించారని ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒడిస్సియస్.. అతడి సైన్యం మానవాతీత శక్తులను, భయంకరమైన వింత జీవులను ఎదుర్కొంటారు. నొసటిపై ఒకే కన్ను ఉండే నరమాంస భక్షక రాక్షసుడు పాలిఫెమస్.. మనుషులను జంతువులుగా మార్చే మంత్రగత్తె సిర్సి... మధురమైన గానంతో నావికులను ఆకర్షించి చంపేసే సైరన్లు వంటి ఎన్నో ప్రమాదకరమైన సవాళ్లను ఒడిస్సియస్ తన అసమాన తెలివితేటలతో దాటుకుంటూ వస్తాడు. ఈ క్రమంలో తన అనుచరులందరినీ కోల్పోయి... చివరకు ఒంటరిగా ప్రాణాలతో... ఎన్నో కష్టాల నడుమ తన సొంత రాజ్యానికి చేరుకుంటాడు.

ఎన్నో పోరాటాల‌లో గెలిచి చివ‌రికి త‌న రాజ్యంలో అడుగుపెట్టిన ఒడిస్సియస్‌కు అంతకంటే పెద్ద సవాలు ఎదురవుతుంది. అతడు చనిపోయాడని భావించి.. అతడి భార్య పెనెలోపిని వివాహం చేసుకుని రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి వంద మందికి పైగా దుర్మార్గులైన శత్రువులు రాజభవనంలోనే కాపు కాసి తిష్టవేసి ఉంటారు. పతివ్రత అయిన పెనెలోపి తన భర్త వస్తాడనే నమ్మకంతో సుమారు 20 ఏళ్ల పాటు (యుద్ధం - ప్రయాణ కాలం కలిపి) వారిని తన చాకచక్యంతో అడ్డుకుని నిలబడటం ఒక వండర్ అని చెప్పాలి. చివరకు ఒడిస్సియస్ తన కుమారుడైన టెలిమాకస్ .. నమ్మకమైన సేవకుడు యుమేయస్ సహాయంతో మారువేషంలో వచ్చి.. ఆ వంద మంది దుర్మార్గులైన శత్రువులందరినీ అంతమొందించి తన భార్యను, రాజ్యాన్ని దక్కించుకుంటాడు.

ఈ కావ్యం కేవలం రాక్షసులు, దేవతల కథ మాత్రమే కాదు. ఇందులో ఉన్న పాత్రల ప్రవర్తన మానవ నైజానికి అద్దం పడుతుంది. ఒడిస్సియస్ పాత్ర ద్వారా మానవ మేధస్సు, పట్టుదల ఎంతటి సవాళ్లనైనా ఎదురించగలవని నిరూప‌ణ అవుతుంది. అలాగే పెనెలోపి పాత్ర స్త్రీ శక్తికి, సహనానికి నిదర్శనంగా నిలుస్తుంది. పాశ్చాత్య సంస్కృతి, సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన ఈ గ్రీకు పురాణం, నేటికీ ఆధునిక నవలలకు.. హాలీవుడ్ చిత్రాలకు ఒక ప్రధాన మూలకథా వనరుగా నిలుస్తూనే ఉంది. అందుకే ఈ అద్భుతమైన ప్రయాణ గాథను ముందే తెలుసుకుని థియేటర్ కి వెళ్తే నోలన్ సృష్టించిన దృశ్య కావ్యాన్ని వంద శాతం ఎంజాయ్ చేయవచ్చు.