Begin typing your search above and press return to search.

ఫిల్మ్ ఇండస్ట్రీలో కులాలు.. చోటా ఏమన్నారంటే?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కులాల అంశం గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి.

By:  M Prashanth   |   11 March 2026 11:21 PM IST
ఫిల్మ్ ఇండస్ట్రీలో కులాలు.. చోటా ఏమన్నారంటే?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కులాల అంశం గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. తాజాగా నిర్వహించిన వదలా మూవీ గ్లింప్స్ ఈవెంట్‌ లో ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.

సీనియర్ నటీనటులు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ వదలా. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఆ చిత్రానికి ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌తో పాటు కిశోర్‌ నాయుడు కలిసి నిర్మిస్తుండ‌గా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కు చోటా కె నాయుడు హాజరవ్వగా.. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో మీడియా ప్రతినిధులు ఆయనకు కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ముఖ్యంగా.. 'మీ స్పీచ్ విన్నాక ఇలా అడుగుతున్నాం.. ఫిల్మ్ ఇండస్ట్రీలో కులాలు పోవంటారా? ఇంకా కులాల పేర్లతోనే ఒకరినొకరు పిలుచుకుంటారా? ట్యాగ్ లైన్స్ తప్పనిసరిగా ఉండాలా?' అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది.

ఆ ప్రశ్నకు స్పందించిన చోటా కె నాయుడు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 'నేను కాపు.. నా భార్య చౌదరీ.. నా కూతురిని రెడ్డి కుటుంబానికి ఇచ్చా. మరి ఇక్కడ ఎవరినీ ఏ కులంలోకి వెళ్లమని చెబుతారు? సినిమాకు అంటూ ఎలాంటి కులం ఉండదు. మేమంతా ఒకే కుటుంబం లాంటి వాళ్లం' అని ఆయన అన్నారు.

అదే సమయంలో, తనకు జగపతి బాబుతో ఉన్న స్నేహాన్ని చోటా కె నాయుడు ప్రస్తావించారు. 'నేను సరదాగా జగపతి బాబును చౌదరీ అని పిలుస్తాను. ఆయన నన్ను నాయుడు గారు అని పిలుస్తుంటారు. మా ఇద్దరి మధ్య అది ఒక చిన్న ఎటకారం మాత్రమే. మొదటి సినిమా నుంచి మేం అలాగే పిలుచుకుంటూ వస్తున్నాం' అని చెప్పారు.

'జగపతి బాబును చాలా మంది కూడా అలా పిలుస్తుంటారు. అది ఒక అలవాటు లాంటిదే' అని చెప్పారు. చోటా వ్యాఖ్యలతో పాటు ఆయన చెప్పిన వ్యక్తిగత ఉదాహరణలు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా తన కుటుంబంలో వివిధ కులాల మధ్య వివాహాలు జరిగాయని చెప్పడం ద్వారా సమాజంలో ఐక్యత అవసరమని ఆయన సూచించినట్లు కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సినీ పరిశ్రమలో కులాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని, అందరూ ఒక కుటుంబమంటూ చోటా కె నాయుడు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.