రీమిక్సుల్లో ఇలాంటి రిస్కు అవసరమా?
క్లాసిక్ సినిమాలను రీమేక్ చేయడంలోనే కాదు.. క్లాసిక్ డే పాటలను రీమిక్స్ చేయాలన్నా అది రిస్కుతో కూడుకున్నది.
By: Tupaki Desk | 24 April 2025 12:00 AM ISTక్లాసిక్ సినిమాలను రీమేక్ చేయడంలోనే కాదు.. క్లాసిక్ డే పాటలను రీమిక్స్ చేయాలన్నా అది రిస్కుతో కూడుకున్నది. ఆ పాత మధురాలను మెచ్చిన అభిమానులను సంతృప్తి పరిచేలా మోడ్రన్ వెర్షన్ ని తెరపైకి తేవాలంటే దానికి దర్శకనిర్మాతల్లో, క్రియేటర్లలో చాలా యూనిక్ క్వాలిటీ ఉండాలి. సృజనాత్మక ప్రక్రియలో పక్కదారి పట్టకుండా, ప్రతిదీ ఎంతో అందంగా, అద్భుతంగా మునుపటి త్రోబ్యాక్ వెర్షన్ ని మించిన తెలివితేటలతో కొత్త వెర్షన్ ని రూపొందించాల్సి ఉంటుంది.
మునుపటి సినిమా లేదా పాటలో స్టార్ల స్థాయికి తగ్గట్టు ఇప్పటి నటీనటుల స్టార్ డమ్ రేంజు కూడా ఉండాలి. అలా కాకుండా తక్కువ రేంజు స్టార్లతో తిరిగి రీమేక్ లు లేదా రీమిక్సులు చేస్తే దానిని సహించేందుకు అభిమానులు సిద్ధంగా లేరు. ఇలాంటి క్రియేటర్లకు ట్రోలింగ్ ఎదురవ్వడం ఖాయం. ఇప్పుడు లవ్ ఆజ్ కల్ (2009) మూవీ నుంచి చోర్ బజారి పాటను రాజ్ కుమార్ రావు, వామిక గబ్బి స్టార్లుగా నటించిన `భూల్ చుక్ మాఫ్` కోసం రీమిక్స్ చేసారు.
సైఫ్ ఖాన్ - దీపిక లాంటి అగ్ర తారలు నర్తించిన ఈ పాటలో రాజ్ కుమార్ రావు - వామికల ఆరంగేట్రాన్ని ఫ్యాన్స్ మెచ్చుకోలుగా చూడటం లేదు. తనిష్క్ బాగ్చి - ప్రీతమ్ జోడీ సంగీతంలో సునిధి చౌహాన్ - నీరజ్ లాంటి గాయనీగాయకుల ఆలాపనతో సాగిన ఈ రీమిక్స్ లో నాటి జ్ఞాపకాలు మిస్సయ్యాయనే విమర్శ ఎదురైంది. పాత పాటల్లోని తీయందాన్ని చెడగొట్టి ఇప్పుడు కొత్త సినిమా మార్కెటింగ్ కోసం ఉపయోగించుకోవాలని అనుకోవడం సరికాదని కూడా విమర్శిస్తున్నారు. తక్షణం అందరి దృష్టిని ఆకర్షించేందుకు క్లాసిక్స్ ని ఉపయోగించుకోవాలని ఆలోచించడం సరికాదని కూడా విమర్శిస్తున్నారు.
త్రోబ్యాక్ పాటల్లో కనిపించే స్టార్ల స్థాయిని విస్మరించడం కూడా విమర్శలకు తావిస్తోంది. అయినా ఇలా పాత పాటలపై ఆధారపడే కంటే బాలీవుడ్ ఒరిజినల్ క్రియేటివిటీ కోసం పాకులాడితే మంచిదని నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు.
