Begin typing your search above and press return to search.

గ్లింప్స్: బాహుబ‌లిని కొట్టేలా చియాన్ క‌ర్ణ‌?

ఈ వీడియోని వీక్షించ‌గానే, బాహుబ‌లి 2 క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ ని మించి భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ని క‌ర్ణ సినిమాలో చూపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది

By:  Tupaki Desk   |   25 Sep 2023 4:07 AM GMT
గ్లింప్స్: బాహుబ‌లిని కొట్టేలా చియాన్ క‌ర్ణ‌?
X

మణిరత్నం 'పొన్నియ‌న్ సెల్వన్ 2'లో ఆదిత్య‌ కరికాలన్‌గా తన ఆవేశపూరితమైన నటనతో ఇటీవల ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన చియాన్ విక్రమ్ పా.రంజిత్ ప్ర‌యోగాత్మ‌క చిత్రం 'తంగళన్' షూటింగ్‌ను కూడా ముగించాడు. ఆ త‌ర్వాత చియాన్ ఏ కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. త‌దుప‌రి అత‌డి ఎంపిక ఎలా ఉంటుందో చూడాల‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ఇప్పుడు విక్రమ్ అభిమానులకు స్వీట్ న్యూస్ అందింది. దర్శకుడు ఆర్.ఎస్.విమ‌ల్ మెగా ఎపిక్ 'సూర్యపుత్ర మహావీర్ కర్ణ' చిత్రీకరణ త్వరలో పునఃప్రారంభించనున్నట్లు తన ఫేస్‌బుక్ పేజీలో అధికారికంగా ప్రకటించారు. విక్రమ్ టైటిల్ రోల్‌లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించిన ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లి కొన్ని యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ అప్ప‌ట్లో ర‌క‌ర‌కాల‌ కారణాలతో కొన్నేళ్లుగా చిత్రీక‌ర‌ణ‌ నిలిచిపోయింది.

విక్రమ్ దీని నుంచి వైదొలిగాడ‌ని ప్ర‌చార‌మైంది. అయితే ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్ విమల్ తన ఫేస్‌బుక్‌లో 'సూర్యపుత్రన్ కర్ణన్ రోలింగ్ త్వరలో' అనే సందేశాన్ని విక్రమ్ స్టిల్‌తో పోస్ట్ చేసాడు. కర్ణ ఈ చిత్రంలో ఫుటేజ్ నుండి ఫోటోగ్రాఫ్ బ‌య‌టికి రాగానే అంత‌టా క్యూరియాసిటీ ఏర్ప‌డింది. ప్రొడక్షన్ హౌస్ మిగిలిన నటీనటులు- సిబ్బందికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మ‌రోవైపు క‌ర్ణ‌కు సంబంధించిన తాజా వీడియో గ్లిమ్స్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది.

ఈ వీడియోని వీక్షించ‌గానే, బాహుబ‌లి 2 క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ ని మించి భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ని క‌ర్ణ సినిమాలో చూపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. పొన్నియ‌న్ సెల్వ‌న్ క్లాసీ సినిమా. ఇందులో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ను మించి క‌థ కీల‌కంగా ర‌న్ అవుతుంది. కానీ మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి పాత్ర‌తో భారీ వార్ ఎపిసోడ్స్ తో ర‌క్తి క‌ట్టించేందుకు త‌మిళ తంబీలు రెడీ అవుతున్నారు. చూస్తుంటే బాహుబ‌లిని కొట్టేలా మ‌రో భారీ వారియ‌ర్ సినిమాని తీయాల‌న్న క‌సి క‌నిపిస్తోంది. ఈ చిత్రం కోసం విక్ర‌మ్ ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, విజువ‌ల్ గ్రాఫిక్స్ షాట్స్ కానీ చాలా భారీత‌నంతో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. వ‌ర‌ల్డ్ క్లాస్ వారియ‌ర్ సినిమాని తెర‌కెక్కించాల‌న్న క‌సి ఈ విజువ‌ల్ లో క‌నిపించింది.

మ‌రోవైపు చియాన్ విక్రమ్ మరో డిలే ప్రాజెక్టును విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వ‌స్తున్న డిలే ప్రాజెక్ట్ 'ధృవ నచ్చతిరమ్' కూడా ఈ దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23న అధికారిక ప్రకటన వెలువడనుంద‌ని స‌మాచారం. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.