టాలీవుడ్ లో మొట్ట మొదటి రోల్స్ రాయ్స్ ఆయనదే!
టాలీవుడ్ లో రోల్స్ రాయిస్ కార్లు కలిగిన నటులు ఎంత మంది? అంటే కొంత మంది పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తుంటాయి.
By: Tupaki Desk | 18 July 2025 5:19 PM ISTటాలీవుడ్ లో రోల్స్ రాయిస్ కార్లు కలిగిన నటులు ఎంత మంది? అంటే కొంత మంది పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తుంటాయి. వారిలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి పేరు ఉంటుంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డార్లింగ్ ప్రభాస్ లు కూడా రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు అధికా రికంగా రోల్స్ రాయిస్ కలిగి ఉన్నారు. ఇంకా పలువురు నటులు దగ్గర ఉండే అవకాశం ఉంది. రామ్ చరణ్ వద్ద రోల్స్ రాయిస్ స్పెక్టర్ అనే ఎలక్ట్రిక్ కారును కలిగి ఉంది. దీని ధర దాదాపు 7.5 కోట్ల రూపాయలు ఉం టుందని అంచనా. ఇక ప్రభాస్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కలిగి ఉన్నారు. ఇది 2015 లో కొనుగోలు చేశారు.
మరి ఇండియాలోనే మొట్ట మొదట రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసిన తెలుగు నటుడు ఎవరు? అంటే? పాత తరం లెజండరీ నటుడు చిత్తూరు నాగయ్య అని తెలుస్తోంది. చిత్తూరు నాగయ్య సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశమే గర్వించిన నటుడు. నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా , నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎలనేలని సేవలందించారు. వ్యక్తిత్వంలోనూ ఎంతో గొప్ప మనిషి. దాతృ హృదయం గల వారు. కర్ణుడి హృదయం కల మనిషి. ఎంతో ఉన్నతమైన వ్యక్తి.
ఆయన పేరిట ఎన్నో అవార్డులు రివార్డులు. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి పద్మ శ్రీ అవార్డు ఆయనే అందుకున్నారు. అలాగే లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న తొలి తెలుగు నటుడు కూడా ఆయనే. తన పాత్రలకు తానే పాటలు పాడుకున్నారు. తనకు తానుగానే డైలాగులు చెప్పుకున్నారు. ఆ రోజుల్లోనే ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కూడా ముందుగా కొన్న నటుడు ఆయనే. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో రోల్స్ రాయిస్ కనిపించాయంటే? అందుకు ఆద్యుడు నాగయ్యే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నాగయ్యని చూసి ఓ అభిమాని ఏకంగా సన్యాసిగా మారాడు. దీంతో నాగయ్య `యోగి వేమన` అనే సినిమా కూడా చేసారు. యోగి వేమన సినిమా చూసిన అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఫిదా అయిపో యారు. సర్వేపల్లి తన భవంతికి పిలిపించి నాగయ్యని ఎంతో గౌరవించారు. నాగయ్యకు పాదాభి వందనం కూడా చేసారు. అంతటి లెజెండరీ నటుడు చివరి దశలో ఎంతో దుర్బర జీవితాన్ని గడిపారు. తినడానికి తిండి లేక...స్వర్గస్తులైతే దహన సంస్కారాలకు కూడా డబ్బులేకపోతే చందాలు వేసుకుని కార్యక్రమాలు పూర్తి చేసారు. దాతృహృదయం తో దానాలు చేయడంతో డబ్బు అంతా కరిగిపోయిందని..ఆ కారణంగానే నాగయ్యకు ఆ దుస్తితి వచ్చిందని పాత నటులు చెబుతుంటారు.
