పాన్ ఇండియా సినిమాలో ఈ సారి ఛాన్స్ నాదే!
బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ లో చాలా కాలంగా కొనసాగుతుంది.
By: Srikanth Kontham | 13 May 2026 4:30 PM ISTబాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ లో చాలా కాలంగా కొనసాగుతుంది. ట్యాలెంటెడ్ బ్యూటీ. కానీ అమ్మడికి రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదు. అయినా నటిగా, నర్తకిగా ఏ రోజు ఖాళీగా లేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ని ముందకు తీసుకెళ్తోంది. ఈనేపథ్యంలో అమ్మడు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. గతంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా `ఉరి: ద సర్జికల్ స్ట్రైక్` లో ముఖ్యమైన పాత్ర కోసం తనను అనుకున్నారని కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
ఆ అవకాశం చేజారడం పట్ల అప్పట్లో కొంత బాధ కలిగినా? ఈసారి మాత్రం అదృష్టం మళ్లీ తలుపు తట్టిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు ఆదిత్య ధర్‌తో `సూఫీ` అనే ప్రాజెక్ట్ కోసం ఆమె 2012 సమయంలోనే చర్చలు జరిపారు. ఆ సినిమాలో చిత్రాంగదా కోసం ఆదిత్య అద్భుతమైన పాత్రను రాశారని కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా పట్టాలెక్కలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ సినిమా చేసి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని అభిప్రాయపడ్డారు. `ఉరి` తర్వాత ఆదిత్య ధర్ తెరకెక్కించిన `ధురంధర్` చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చిత్రంగద- ఆదిత్య ధర్‌కు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారట. ఈ సందర్భంగానే తమ పాత ప్రాజెక్టుల గురించి , భవిష్యత్తులో రాబోయే పాన్ ఇండియా సినిమాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఏ సినిమా చేసినా? అందులో ఈసారి పాన్ ఇండియా ఛాన్స్ నాదే అని చిత్ర ధీమా వ్యక్తం చేసింది. దీంతో వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్రంగద సింగ్, అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `మాతృభూమి` చిత్రంలో నటిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గాల్వన్ లోయలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఆగస్టులో సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని ఆశీస్తుంది. `ఉరి` వంటి అవకాశాన్ని కోల్పోయినా? ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రాజెక్టులతో సిద్ధమవుతుంది. `ధురంధర్` విజయంతో ఆదిత్య ధర్ ఇండియాలోనే సంచలన దర్శకుడిగా మారిపోయారు. ఇప్పుడాయన ఏ సినిమా చేసినా పాన్ ఇండియాలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కథ, హీరో విషయంలో ఆదిత్య ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
