Begin typing your search above and press return to search.

చిరంజీవి-యండ‌మూరి మ‌ళ్లీ సాధ్య‌మేనా?

ఇలా ఇద్ద‌రు ఎవ‌రి బిజీలో వారు ఉన్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో చిరంజీవి-యండ‌మూరి మ‌ధ్య పొర‌పొచ్చాలు కూడా త‌లెత్తాయి.

By:  Tupaki Desk   |   21 Jan 2024 5:22 AM GMT
చిరంజీవి-యండ‌మూరి మ‌ళ్లీ సాధ్య‌మేనా?
X

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి విరేంద్రనాద్ న‌వ‌ల హీరో అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న ర‌చించిన న‌వ‌ల‌ల ఆధారంగానే చిరు ఎన్నో సినిమాలు చేసారు. చిరంజీవిని మెగాస్టార్ గా మార్చింది ఆయ‌న న‌వ‌ల‌లే. అందుకే మెగాస్టార్ అనే బిరుదును స్వ‌యంగా చిరంజీవికి యండ‌మూరి ఇచ్చారు. 'అభిలాష‌'..'ఛాలెంజ్'..'మ‌ర‌ణ మృదంగం'..'రాక్ష‌సుడు' లాంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ ఆ కాంబినేష‌న్ లోనే సాధ్య‌మైంది.

యండ‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి 'స్టువ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్' అనే సినిమా కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత ఆ కాంబినేష‌న్ లో మ‌ళ్లీ సినిమా రాలేదు. యండ‌మూరి న‌వ‌ల‌లు త‌గ్గించి వ్య‌క్తిత‌త్వ వికాస నిపుణుడిగా క్లాసులు ప్రారంభించారు. దీనిలో భాగంగా ర‌క‌ర‌కాల ఇనిస్ట్యూట్లు తిరుగుతూ యువ‌త లో చైత‌న్యం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసారు. చిరంజీవి వేర్వేరు ర‌చ‌యిత‌లో ప‌నిచేసారు.

ఇలా ఇద్ద‌రు ఎవ‌రి బిజీలో వారు ఉన్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో చిరంజీవి-యండ‌మూరి మ‌ధ్య పొర‌పొచ్చాలు కూడా త‌లెత్తాయి. 'చిరంజీవి రాజకీయాలలోకి రావడం త‌న‌కు ఇష్టం లేదని... అది మీకు చేత కాని పని.. మీ వ్యక్తిత్వానికి రాజకీయాలు సరిపడవు అని యండ‌మూరి సలహా ఇవ్వ‌డం అప్ప‌ట్లో పెద్ద దుమారమే రేపింది. అంత‌కు ముందు 'మృగ‌రాజు' సినిమా స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. అలాగే చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ద‌వ‌డ స‌రిగ్గా లేక‌పోతే ఓసారి సర్జ‌రీ చేయించార‌ని ఓసారి య‌థాలాపంగా యండ‌మూరి మాట‌ల మ‌ధ్య‌లో అన్నారు.

ఆ మాట చ‌ర‌ణ్ ని కించ‌ప‌రచాల‌ని అన్న‌ది కాదు. ఏదో ప్లో అలా మాట్లాడారు అనే విమర్శ ఉంది. అయితే ఈ విష‌యాన్ని నాగ‌బాబు సీరియ‌స్ గా తీసుకుని ఆయ‌న పేరు పెట్ట‌కుండా ప‌బ్లిక్ గానే మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. అలాగే చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీర‌య్య' పాట విష‌యంలో యండ‌మూరి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసారు. వాటికి కౌంట‌ర్ గా చంద్ర‌బోస్ స్పందించారు. ఇలా చిరు-యండ‌మూరి మ‌ధ్య కొన్ని ర‌కాల మ‌నస్ప‌ర్ద‌లైతే ఉన్నాయ‌ని అంటుంటారు. కానీ ఏనాడు ఈ విమ‌ర్శ‌ల‌పై చిరంజీవి నేరుగా ముందుకొచ్చి స్పందించింది లేదు. అయితే ఇలాంటి వాటిని వేటిని పట్టించుకోకుండా చిరంజీవి త‌న జీవిత క‌థ‌ని రాసే అవ‌కాశం యండ‌మూరికి క‌ల్పించ‌డం విశేషం.