Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్‌కు డబుల్ రిలీఫ్!

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో మెగా హీరోలకు సంబంధించిన రెండు వార్తలు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Jun 2026 1:55 PM IST
మెగా ఫ్యాన్స్‌కు డబుల్ రిలీఫ్!
X

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో మెగా హీరోలకు సంబంధించిన రెండు వార్తలు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి- డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఆగిపోయిందన్న ప్రచారం. మరొకటి రామ్ చరణ్ - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ దాదాపు ఫిక్సైంద‌నే వార్త. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు ప్రచారాల్లోనూ ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల పేరు చుట్టూ ఈ మధ్య భారీ స్థాయిలో చర్చ జ‌ర‌గ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

దసరా వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో డైరెక్ట‌ర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ది ప్యార‌డైజ్ సినిమా చేస్తున్నారు. నాని సినిమా త‌ర్వాత శ్రీకాంత్, మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టు అఫీషియ‌ల్ గా అనౌన్స్ అయింది కూడా. ఓ వైపు సినిమాపై భారీ అంచ‌నాలుండ‌గా, అదే సమయంలో అనధికారిక ప్రచారాలు కూడా ఎక్కువవుతున్నాయి.

ఇటీవల చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, కథ లేదా ఇతర కారణాల వల్ల సినిమా ముందుకు వెళ్లడం లేదని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి క్యాన్సిల్ డెసిష‌న్ తీసుకోలేదని, సినిమా విషయంలో ఇప్పటికీ ప్రణాళికలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఇది ఊరటనిచ్చే విషయంగా మారింది.

మరోవైపు రామ్ చరణ్ - శ్రీకాంత్ ఓదెల సినిమా దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన కూడా వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొందరు అయితే దీనినే చరణ్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని సమాచారం. రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని, సుకుమార్ సినిమా త‌ర్వాత ఏ ప్రాజెక్టు చేస్తార‌నే విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. తదుపరి సినిమాకు సంబంధించి డైరెక్ట‌ర్ ను ఎంపిక చేసే ప్రక్రియ కూడా ఇంకా పూర్తికాలేదని సమాచారం.

ఈ పరిణామాలను పరిశీలిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. శ్రీకాంత్ ఓదెల ఒకేసారి ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం ఎంత వేగంగా వైరల్ అయిందో, అంతే వేగంగా ఆ వార్తలపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఆయన ఫోకస్ ప్రస్తుతం ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్లు, ప్రణాళికలపైనే ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మెగా క్యాంప్ చుట్టూ తిరుగుతున్న ఈ రెండు రూమర్లకు తాజాగా స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్టే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల విష‌యంలో ఇకపై అధికారిక ప్రకటనలు వచ్చేవరకు ఇలాంటి వార్తలను అభిమానులు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.