Begin typing your search above and press return to search.

ఢిల్లీకి చిరు ఫ్యామిలీ.. స్పెషల్ ఏంటంటే?

ఇక గురువారం చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించనున్నారు.

By:  Tupaki Desk   |   8 May 2024 2:11 PM GMT
ఢిల్లీకి చిరు ఫ్యామిలీ.. స్పెషల్ ఏంటంటే?
X

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులను 2024 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగానే సినీ, రాజకీయంతో పాటు అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలు అందించిన అనేక మంది ప్రముఖులు ఈసారి కూడా ఎంపిక అయ్యారు.

అందులో భాగంగా మన మెగాస్టార్ చిరంజీవికి కూడా కేంద్ర ప్రభుత్వం.. పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అత్యున్నత పౌర పురస్కారాలను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు అందుకున్నారు. కానీ ఆ రోజు జరిగిన వేడుకకు చిరంజీవి కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదు.

ఇక గురువారం చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు చిరంజీవి తన ప్రైవేట్ జెట్ లో బుధవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు. మెగాస్టార్ తో పాటు ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా రేపు రాష్ట్రపతి భవన్ లో జరగనున్న అవార్డుల స్వీకారోత్సవ వేడుకకు హాజరు కానున్నారు.

ఎన్నో పురస్కారాలు... చిరంజీవి తన జీవితంలో ఎన్నో ఘనతలు సాధించారు. పర్సనల్ వెబ్ సైట్ ఉన్న తొలి భారతీయ నటుడిగా మెగాస్టార్ నిలిచారు.1999-2000 సంవత్సరంలో అత్యధిక టాక్స్ చెల్లించిన వ్యక్తిగా 'సమ్మాన్' అవార్డు అందుకున్నారు. 90ల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడిగా రికార్డు సృష్టించారు. ఆస్కార్ వేడుకలకు గెస్ట్ గా ఇన్విటేషన్ అందుకున్న తొలి సౌత్ ఇండియా యాక్టర్ గా పేరు పొందారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మూడు సార్లు నంది పురస్కారం అందుకున్నారు.

స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర చిత్రాలకు నంది అవార్డులు పొందారు. తొమ్మిది ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు (2016), ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (2022) అందుకున్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్‌ ను స్వీకరించారు. ఇటీవల పద్మ విభూషణ్ గా మరో మెట్టు ఎక్కారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును మరి కొద్ది గంటల్లో అందుకోనున్నారు. అందుకే మరోసారి అభినందనలు మెగాస్టార్!