Begin typing your search above and press return to search.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు 25 ఏళ్లు

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లి కాలంలో సేవాకార్య క్ర‌మాలు మ‌రింత విస్తృతం చేసారు

By:  Tupaki Desk   |   3 Oct 2023 6:25 AM GMT
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు 25 ఏళ్లు
X

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లి కాలంలో సేవాకార్య క్ర‌మాలు మ‌రింత విస్తృతం చేసారు. స‌హాయం అనే మాట ఆయ‌న చెవిన పడిందంటే? వెంట‌నే బాధితుడిని ఆదుకుంటున్నారు. ఇక క‌రోనా స‌మ‌యంలో చిరంజీవి అందించిన సేవ‌లు గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్ల రూపాయ‌లు సేవా కార్య‌క్ర‌మంలో భాగంగా ఖ‌ర్చు చేసారు. తాజాగా ఆయ‌న ఏర్పాటు చేసిన చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ నిన్న‌టితో 25 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి సోష‌ల్ మీడియాలో స్పందించారు.

'దేశానికి ముఖ్యమైన రోజున.. నేను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సిసిటి)ను ఏర్పాటు చేశాను. 25 సంవత్సరాల ఎంతో అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించింది సీసీటీ. ఈ ట్రస్ట్ ద్వారా 10 లక్షలకు పైగా రక్త యూనిట్లు సేకరించి పేదలకు అందించాం. నేత్రదానం ద్వారా 10 వేల మందికి పైగా కంటి చూపును తీసుకొచ్చాం. కరోనా మహమ్మారి కాలంలో వేలాది మంది ప్రాణాలు రక్షించాం. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో ఉన్న తృప్తి చాలా అమూల్యమైనది. సీసీటీ సేవలకు అండగా నిలిచిన లక్షలాది మంది సోదరులు.. సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ సేవల ద్వారా మహాత్ముడికి నివాళి అర్పిస్తున్నాను' అని చిరంజీవి వెల్లడించారు.

1998 అక్టోబ‌ర్ న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిరంజీవి ఛారిటిబుల్ ట్ర‌స్ట్ ని ఏర్పాటు చేసారు. ఈ ట్ర‌స్ట్ ద్వారా ఎన్నో సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ ట్రస్ట్ తరఫున బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఆయ‌న అభిమానుల ద్వారా సేక‌రించిన ర‌క్తాన్ని ఆప‌ద‌లో ఉన్న వారికి అందించే ఏర్పాటుకి ఆనాడే పునాది పాడింది. దేశ వ్యాప్తంగా చిరంజీవి పుట్టిన రోజున నాడు పెద్ద ఎత్తున ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేసి ర‌క్త సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఏటా నిర్వ‌హిస్తున్నారు. ఇంకా మ‌రెన్నో మెడిక‌ల్ క్యాంపులు ఏటా ఏర్పాటు చేస్తున్నారు.

అప్ప‌ట్లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ట్రస్ట్ కు 'బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్' అవార్డును అందించింది. అలాగే చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ..2006లో చిరంజీవి చాటిట‌బుల్ పౌండేష‌న్ గా మారింది. బ్ల‌డ్ బ్యాంక్ తో పాటు ఐబ్యాంక్ ని కూడా స్థాపించారు. ఈ ఫౌండేషన్ ను నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ప్రారంభమైంది. బ్ల‌డ్ బ్యాక్..ఐబ్యాంక్ ద్వారా ఎంతో మంది ఉచితంగా సేవ‌లు ల‌భించాయి. ఇక కరోనా సమయంలో 'కరోనా క్రైసిస్ ఛారిటీ' పేరిట సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందించారు.